Wednesday, June 22, 2011

kaasula kanka laxmi- లకలక

సరిగ్గా వినపడటం లేదు...కాని నా గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారో...
‘కొంచెం జాగ్రత్త తల్లీ’... ఎవరో పెద్దావిడ మాట్లాడుతున్నారు.‘పేరేమి పెడదాం...’ ఖంగుమంటోంది పెద్దాయన స్వరం.
ఖర్చులు బాగా పెరుగుతాయి... ఇంకో షిఫ్ట్ పని చేద్దామనుకుంటున్నా...’
నీరసంగా ఒక మగ గొంతు.
కొంచెం ఇంటి పనులు అవీ చేసుకుంటూ ఉంటే మంచిది...
ఆ మాత్రం ఎక్సర్‌సైజ్ ఉండాలి..’ చాలా తెలివైన ఆవిడ సలహా...
నా చుట్టూ చీకటి...
నాకు వినపడే ఈ మాటలే నాకు ప్రపంచాన్ని చూపిస్తున్నాయి.
చీకటి ఎన్ని నిగూఢ రీఛార్జ్‌లకు నిలయం!
పుట్టబోయే బిడ్డ తల్లి కడుపులో ఉండి అనుకునే మాటలివి.
పుట్టే బిడ్డకు ఎన్ని రిస్కులో...
ఆ రిస్కుల్లోంచి బయటపడ్డ అభిమన్యుడి కథే నిజమైన రీఛార్జ్!
చంద్రముఖి సినిమా కాన్పు చాలా రిస్కులతో కూడింది.
సినిమా థియేటర్ కూడా కళామతల్లి గర్భం లాంటిదే.
అక్కడ వినపడే ‘లకలకలకలకలు’
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ... డిసెంబర్ 9... సమయం ఏడు గంటలు...
అప్పుడే చీకటి పడింది... ‘‘చంద్రముఖి సినిమా గురించి మీకు చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాలి...’’ అన్నారు గవర పార్థసారథి.
ఆయన సుప్రసిద్ధ సినీనిర్మాత. రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాని తెలుగులో నిర్మించింది ఆయనే. డాబా మీద ఎదురెదురు కూర్చున్నాం.‘‘చంద్రముఖి అనే దెయ్యం ఈ సినిమా షూటింగ్ సమయంలో... చాలామందిని వెంటాడిందంటారు... నిజమేనా...’’ అడిగాను.
ఆయన గట్టిగా నవ్వేశారు. ‘‘అదే నిజమైతే... ఆ సినిమా చేసిన మేమంతా బాగానే ఉన్నాం కదా... ’’ పార్థసారథి చెబుతుంటే నేను కాగితం మీద నోట్ చేసుకుంటున్నాను.
ఉన్నట్టుండి... పెన్ రాయడం ఆగిపోయింది.
ఇంక్ అయిపోయిందా? విదిల్చాను. లాభం లేదు. పార్థసారథి ఉత్సాహంగా సినిమా సంగతులు చెబుతునే ఉన్నారు.
‘‘పెన్ను... ఇప్పుడే ఆగిపోవాలా... ? ఎందుకిలా జరిగింది...?’’ ఆలోచిస్తున్నాను. అప్రయత్నంగా ఆకాశంలోకి చూశాను. అప్పటికే బాగా చీకటి పడింది. ఆ రోజు... అ... మా... వా... స్యతో పోరాడుతున్నాడు చంద్రుడు.

******
దెయ్యం... నిజంగా... ఉంటుందా?
లేక మనలోని భయాలకు రూపమే... దెయ్యమా? దెయ్యాలు ఎప్పుడయినా కనిపిస్తాయా? శ్మశానంలోనూ... చీకట్లలో రోడ్ల మీద... మర్రిచెట్టు మొదళ్లలో... ?
దెయ్యం నిజంగానే మనుషుల్ని వెంటాడుతుందా... ? శారీరకంగా... మానసికంగా... మనిషిని కుంగదీస్తుందా? లేక... దెయ్యం... మనిషిని రీఛార్జ్ చేస్తుందా?
దెయ్యం...
రీ... ఛా... ర్జ్...
చేయగలదా?

******
2009... బెంగళూరు... అర్ధరాత్రి 12 దాటింది. హోటల్ రూమ్‌లో ఆదమరిచి నిద్రపోతోంది... హీరోయిన్ విమలా రామన్. చంద్రముఖి-2 కన్నడ వెర్షన్ ‘ఆప్తరక్షక’ సినిమా షూటింగ్‌లో మొదటిరోజు ఆమె పాల్గొని వచ్చింది. లలితామహల్ ప్యాలెస్‌లో ఉదయం అంతా కీలకమైన ఒక పాటను షూట్ చేశారు.
‘‘గరని గరఘరని... తిరువిధీ ధరణి... నిన్ననోడి తరణి...’’
నిద్రలో కూడా ఆ పాట ఆమెను వెన్నాడుతోంది.
‘‘హేయ్... నాగవల్లీ...’’ అంటాడు హీరో ఆ పాటలో... పక్క మీద నుంచి ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది విమలా రామన్.
సన్నని బెడ్‌లైట్ వెలుతురు... చీకటిలో అంతా అస్పష్టంగా ఉంది. చుట్టూ చూస్తున్న విమలారామన్ కళ్లు పక్కనే ఉన్న గోడ దగ్గర ఆగిపోయాయి. అక్కడ ఓ నీడ. భరతనాట్యం డ్రెస్సులో పూర్తిగా ముస్తాబయి ఓ అమ్మాయి నిలబడినట్టు... కాని అక్కడ మనిషి లేదు. నీడ మాత్రమే ఉంది.
‘‘హేయ్ నాగవల్లీ...!’’ ఎవరో పిలిచినట్టుంది... గాలి గుసగుసలాడినట్టు...
ఆ నీడను చూసి వణికిపోయింది విమలారామన్. భయంతో బిగుసుకుపోయింది. ఒళ్లంతా చెమటలు. ఒక్క ఉదుటున లేచి లైట్లన్నీ స్విచాన్ చేసింది. అక్కడ మనిషీ లేదూ... నీడా లేదు.

******
‘‘వ్వాట్...? నాగవల్లా... రాత్రి కనిపించిందా?...’’ ఫోన్‌లో మాట్లాడుతున్నాడు ప్రొడక్షన్ మేనేజర్.
హీరోయిన్ విమలారామన్ ఆ రోజు షూటింగ్‌కి రాదట. రాత్రి ఆమెకు నాగవల్లి కనిపించిందట. ఒక్కసారి కాదు, రెండుసార్లు. అర్ధరాత్రి మళ్లీ 2.30 గంటలకు విమలారామన్‌కి పక్కనే ఎవరో పడుకున్నట్టు అనిపించి చూస్తే ఎవ్వరూ లేరట. చిలవలుపలవలుగా ఈ విషయం సెట్ అంతా పాకిపోయింది. క్షణాల్లో కన్నడ ఫిలిం ఇండస్ట్రీ అంతా ఇది హాట్ న్యూస్ అయిపోయింది.
‘‘ఇప్పుడేంటి పరిస్థితి?’’ అడిగారు డెరైక్టర్ పి. వాసు.
‘‘విమలారామన్‌కి బాగా జ్వరం వచ్చేసింది. ఆరోగ్యం దెబ్బతినిందట. డాక్టర్లు పది రోజులు బెడ్‌రెస్ట్ తీసుకోమన్నారు’’ చెప్పాడు ప్రొడక్షన్ మేనేజర్. హీరో, డెరైక్టర్, ప్రొడ్యూసర్... అందరూ మొహమొహాలు చూసుకున్నారు. ‘‘నాన్‌సెన్స్’’ అనుకున్నారు. కాని ఇంకొన్ని భయంకరమైన పరిణామాలు ముందుముందు పొంచి ఉన్నాయని అప్పటికి వాళ్లకింకా తెలియదు.

******
జనం దేన్నీ తొందరగా నమ్మరు. కాని ఒకసారి నమ్మడం మొదలుపెడితే మరి ఆగరు. ఆప్తరక్షక షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రతి చిన్న విషయం ఓ పెద్ద సంచలనం అవుతోంది. ‘రా..రా... ’ పాటను షూట్ చేస్తుండగా నలుగురు ఆర్టిస్టులు ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. సీనియర్ నటుడు రమేశ్ భట్ షూటింగ్ మధ్యలో అనారోగ్యం పాలయ్యాడు. మెజీషియన్‌గా నటించిన అవినాశ్ గొంతు పూడుకుపోయి మూడు రోజులు డబ్బింగ్ చెప్పలేకపోయాడు. చివరికి హీరోకి కూడా తప్పలేదు. ఏదో తెలియని ఇబ్బందిగా ఉందని హీరో విష్ణువర్ధన్ కొద్దిరోజులు బాధపడ్డారు. ఇవన్నీ నాగవల్లి ఎఫెక్ట్ అని ఆప్తరక్షక సినిమా యూనిట్ అనుకుంది. అప్పటికి ఇదంతా... ఇంకా... బయట ప్రపంచానికి తెలియదు.

******
30 డిసెంబర్, 2009. బెంగళూరు.
సుప్రసిద్ధ హీరో విష్ణువర్ధన్ కనుమూత! ఆప్తరక్షక ఆయనకు 200వ సినిమా. కన్నడ చిత్రరంగంలో సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న విష్ణువర్ధన్ 200వ సినిమా రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ పెద్ద పండగ చేద్దాం అనుకున్నారు. ఆప్తరక్షక రిలీజ్ కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. కాని ఈలోగానే జరగరానిది జరిగిపోయింది. ఆయన 59 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు.
విష్ణువర్ధన్ మరణంతో కొందరికి కొత్త భయాలు పట్టుకున్నాయి. ఆ భయాలు బయటకు పొక్కాయి. అవి చివరికి టీవీ ఛానెల్స్‌కి చిక్కాయి. ఇంకేముంది? సెన్సేషనల్ న్యూస్! నాగవల్లి దెయ్యం వెంటాడుతోందంటూ స్పెషల్ బులెటిన్స్ మొదలయ్యాయి.
నాగవల్లి మీద కన్నడంలో రెండు సినిమాలు వచ్చాయి. మొదటిది ఆప్తమిత్ర, రెండవది ఆప్తరక్షక.
2004లో వచ్చింది ఆప్తమిత్ర. ఆ సినిమాలో సౌందర్య హీరోయిన్. నాగవల్లి దెయ్యం పట్టిన గంగ పాత్రను పోషించింది సౌందర్య. ఆ సినిమాలో కూడా హీరో విష్ణువర్ధనే. దురదృష్టవశాత్తూ ఆప్తమిత్ర సినిమా తరువాత విమాన ప్రమాదంలో సౌందర్య మరణించింది.
2009లో ఆప్తరక్షక షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా రిలీజ్‌కి ముందే హీరో విష్ణువర్ధన్ మరణించారు.
కాబట్టి, ఇదంతా నాగవల్లి దెయ్యం పగబట్టడం వల్లనే జరుగుతోందా? అని ప్రశ్నలు సంధిస్తూనే జనంలో కొత్త అనుమానాలు రేకెత్తించాయి ఛానెల్స్. మొట్టమొదటిసారి... జనం దృష్టిలో... నాగవల్లి... నిజమైంది.
నాగవల్లి ఒక దెయ్యం. అది పగబడుతోంది. వెంటాడుతోంది. ప్రాణాలు తీస్తోంది.
ఒక అబద్ధాన్ని నమ్మేయడం తేలిక. ఒక నిజాన్ని అన్వేషించడం కష్టం. నాగవల్లి ఒక దెయ్యం అని జనం నమ్మడం మొదలుపెట్టారు. కాని వాళ్లు కొన్ని ప్రశ్నలు గాలికి వదిలేశారు. నాగవల్లి నిజమా... అబద్ధమా?
ఎవరీ నాగవల్లి? ఎందుకు పగబడుతోంది? ఎక్కడ పుట్టింది? అసలు... నాగవల్లి కథేంటి?
జవాబుల కోసం ఇప్పుడు మనం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్దాం!

******
1984-85 మధ్యలో... తిరువనంతపురం... కేరళ.
రూమ్‌లో పడుకుని నిద్రపోతున్నాడు మధు ముట్టమ్. అతను మలయాళ సినీ రచయిత. ఏడాది కిందట అతని మొదటి సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు రెండో సినిమా కోసం కథ ఆలోచిస్తున్నాడు. ఎలాంటి కథ రాయాలి? అదెంత కొత్తగా ఉండాలి? ఆలోచిస్తూ భోజనం చేస్తున్నాడు, ఆలోచిస్తూ నడుస్తున్నాడు, ఆలోచిస్తూ పడుకుంటున్నారు. కొద్దికాలంగా అతనికి ఇదే ఆలోచన. ఆ రోజు కూడా ఆలోచిస్తూనే పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ... హఠాత్తుగా... కలలాగా... అతనికి ఏదో ఫ్లాష్ అయింది.
దెయ్యం!
ఓ భూత్‌బంగ్లా... అందులో నాగవల్లి అనే దెయ్యం ఉందని అందరికీ భయం. ఒకప్పుడు అది రాజమహల్. ఇప్పుడు దాన్ని ఒక వ్యక్తి కొంటాడు. అతని భార్య గంగ. నాగవల్లి దెయ్యం ఆమెను పట్టుకుంటుంది. అప్పటి నుంచి ఇంట్లో అన్నీ విపరీతాలు జరుగుతుంటాయి. దెయ్యం పట్టిన గంగ తన భర్తనే చంపాలనుకుంటుంది. కాని భర్త ఫ్రెండు ఓ సైకియాట్రిస్ట్. అతనే హీరో. దెయ్యాన్ని పాతకాలం పద్ధతుల్లో వదలించడం పాత కథ. కాని దెయ్యం అనేది మానసికమైన బలహీనత... ముందు మనలోని భయాల్ని వదిలించుకుంటే ఎలాంటి దెయ్యాలు పట్టవు. కాబట్టి గంగకు సైకలాజికల్ ట్రీట్‌మెంట్ ఇస్తాడు హీరో. అదెలా జరిగింది?
ఠక్కున లేచాడు మధు. వెంటనే తనకు వచ్చిన ఐడియాని కాగితం మీద పెట్టేశాడు. అతనికి ఇప్పుడు లీలగా ఓ సినిమా మనస్సులోనే కనిపిస్తోంది. మరు ఉదయాన్నే అతను ఫాజిల్ ముందు నిలబడ్డాడు.
మలయాళంలో టాప్ డెరైక్టర్ ఫాజిల్. ఒక్క కేరళలో కాదు, దేశంలోనే టాప్ డెరైక్టర్స్‌లో ఒకడిగా ఫాజిల్‌కి గౌరవం ఉంది. ఇప్పుడు ఆయన చేతిలో ఓ కాగితం ఉంది. అందులో రైటర్ మధు ముట్టమ్ రాసిన కథ చదువుతున్నాడు ఫాజిల్.
‘‘లైన్ బాగానే ఉంది. దీన్ని డెవలప్ చేసి చూపించు...’’ అన్నారు ఫాజిల్.
క్రియేటివిటి ఉన్న వ్యక్తి ఉత్సాహానికి ఎంత ప్రోత్సాహం ఉంటే అంత హుషారుగా ఉంటాడు.
ఫాజిల్ రెస్పాన్స్ మధులో నీరసం నింపింది. బాగానే ఉందన్నారు కాని ఎగ్జయిట్ కాలేదు. దాంతో మధు ముట్టమ్ ఆ కథను పక్కన పెట్టేశాడు. నాగవల్లి దెయ్యం... ఆ కాగితంలోనే ఉండిపోయింది. ఆ కాగితం ఎక్కడో మూలన పడిపోయింది.

******
మూడు నాలుగేళ్లు గడిచిపోయాయి. దర్శకుడు ఫాజిల్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. రైటర్ మధు ఏవో కథల మీద పనిచేస్తున్నాడు. ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. ఓ రోజు ఫాజిల్ ఏదో ఫైలు కోసం వెతుకుతున్నారు. ఎక్కడో మూలన ఉంది రైటర్ మధు ఇచ్చిన నాగవల్లి కథ. ఆ కాగితం ఇప్పుడు రెపరెపలాడుతోంది... ఆయన దృష్టిలో పడేందుకేనా?
అన్ని ఫైల్సూ, కాగితాలూ తీసి చూస్తున్నారు ఫాజిల్. చివరికి ఈ కాగితం కూడా ఆయన కంటపడింది. తీసి చదివారు. ఇది మధు ముట్టమ్ రాసిన కథ... బాగుందే! అనుకున్నారు ఫాజిల్.
రొటీన్ సినిమాలు తీసి బోరు కొట్టినప్పుడు ఇలాంటి కథలు నచ్చుతాయి. విచిత్రంగా ఈ కథలో నాగవల్లి అనే దెయ్యం భయపెట్టడం లేదు, ప్రేమించేలా ఉంది. దెయ్యం అనే భయానికి సైకలాజికల్ ట్రీట్‌మెంట్. ఇందులో మెసేజ్ ఉంది. ఫాజిల్ మరి ఆలస్యం చేయలేదు. వెంటనే మధుకి కబురు పెట్టారు. కొద్దిరోజులు ఇద్దరూ కలిసి కథ వండేశారు. తర్వాత దాన్నే సినిమాగా తీశారు. అదే - మణిచిత్రతళు. అంటే నగిషీలు చెక్కిన తలుపు గడియ. అది ఓపెన్ చేస్తేనే కదా... అసలు కథంతా మొదలవుతుంది.
మలయాళం సినిమా సూపర్‌స్టార్స్ మోహన్‌లాల్, సురేశ్ గోపి హీరోలు. నాగవల్లి ఆవహించే గంగ పాత్రలో శోభన. అసలే గొప్ప క్లాసికల్ డ్యాన్సర్ శోభన. ఆ పాత్రలో చెలరేగిపోయింది. 1993 రిలీజ్ అయింది మణిచిత్రతళు. సూపర్‌హిట్. శోభనకు ఆ సంవత్సరం ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు ప్రకటించారు.

******
1994... న్యూఢిల్లీ...
‘‘హాయ్ శోభనా... కంగ్రాట్యులేషన్స్...’’ నవ్వుతూ పలకరించారు గవర పార్థసారథి.
‘‘హాయ్... థాంక్యూ... సేమ్ టు యూ పార్థూ...’’ సంతోషంగా చెప్పింది శోభన.
ఆ రోజు రాష్టప్రతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా నేషనల్ అవార్డులు తీసుకోబోతున్నారు వాళ్లిద్దరూ.
మణిచిత్రతళులో... ఉత్తమ నటి శోభన.
మిష్టర్ పెళ్లాం... ఉత్తమ చిత్రం నిర్మాత గవర పార్థసారథి.
ఆయన అంతకుముందు తీసిన ప్రతిస్పందన సినిమాలో శోభన హీరోయిన్. ఇప్పుడు ఢిల్లీలో మళ్లీ ఇద్దరూ కలిశారు.
‘‘మణిచిత్రతళు సినిమా చూడండి పార్థూ... చాలా మంచి ఫిల్మ్... వీలయితే తెలుగులో రీమేక్ చేయండి. తప్పకుండా హిట్ అవుతుంది...’’ శోభన సూచించింది.
గవర పార్థసారథి ఢిల్లీలోనే స్పెషల్ స్క్రీనింగ్‌లో మణిచిత్రతళు సినిమా చూశారు. కాని ఆ తర్వాత సందేహించారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో. రిస్క్ అవుతుందేమో... అనుకున్నారు. తెలుగులో హీరోల స్టార్‌డమ్... మాస్ అప్పీల్... ఫ్యాన్స్ అంచనాలు... అన్నీ వేరు. పార్థసారథి ప్రయత్నించి కుదరక ఆ ఆలోచన మానుకున్నారు.
మణిచిత్రతళు క్రమంగా మరుగునపడిపోయింది.
ఆలోచన దాటి... కాగితం దాటి... ఫిల్మ్ దాటి వచ్చింది నాగవల్లి. ఆ దెయ్యం కేరళలోనే ఆగిపోయింది.
ఆగింది... అంతే!

******
సరిగ్గా పదేళ్ల తరువాత... \u3102?్చట2004. బెంగళూరులో... కన్నడ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (కెసిఎఎ) ఆఫీసు.
అసోసియేషన్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు సూపర్‌స్టార్ విష్ణువర్ధన్. ఆయన ఎదురుగా సీనియర్ కమేడియన్ ద్వారకేష్, మరోపక్క కొందరు ఫైనాన్షియర్స్. చాలా సినిమాల్లో కమేడియన్‌గా నటించారు ద్వారకేష్. నిర్మాతగా కొన్ని సినిమాలు కూడా తీశారు, నష్టపోయారు. ఓ ఫ్లాప్ సినిమా తాలూకు పంచాయితీ అక్కడ నడుస్తోంది. ఇద్దరి మధ్య గొడవ వింటున్నారు విష్ణువర్ధన్. ఫైనాన్షియర్స్ చెప్పేది న్యాయంగా ఉంది. అలాగే, ద్వారకేష్ కూడా కావలసినవాడు. ప్రాబ్లమ్ పరిష్కరించాలి... కాని ఇద్దరూ సంతోషంగా ఉండాలి. ఒక నిర్ణయానికి వచ్చారు విష్ణువర్ధన్. ఆయన ద్వారకేష్‌ని పక్కకు తీసుకువెళ్లారు.
‘‘చూడు ద్వారకేష్.. న్యాయంగా నువ్వు వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసేయ్... నీకు నేను చేయగల హెల్ప్ ఏంటంటే... నీకో సినిమా చేసిపెడతాను... మంచి కథ దొరకంగానే డేట్స్ ఇస్తాను... ఓకె అను...’’ నచ్చచెప్పారు.
కన్నడలో విష్ణువర్ధన్‌తో సినిమా చేస్తే చాలు, నిర్మాతలు గట్టెక్కినట్లే. ద్వారకేష్ కాదనలేదు. వెంటనే ఒప్పుకుని ఫైనాన్షియర్స్‌కి డబ్బు చెల్లించేశాడు. కాని అతను ఊరుకోలేదు. విష్ణువర్ధన్‌ని తగులుకున్నాడు. మర్నాడు ఉదయమే అతను విష్ణు ఇంట్లో ఉన్నాడు... డేట్స్ కావాలంటూ...
‘‘కాదయ్యా... కథా లేదు... ఏమీ లేదు... డేట్స్ ఎలా ఇవ్వడం... పైగా నేను రెండు సినిమాలు చేయాల్సి ఉంది. ఆ తర్వాత డేట్స్ ఇస్తాను... నన్ను తొందరపెట్టకు ప్లీజ్...’’ అంటూ చెప్పబోయాడాయన.
ద్వారకేష్ వినడం లేదు. ‘‘విష్ణు... మీ మాట మీద గౌరవంతో నాకు నష్టం కలిగినా ఫైనాన్షియర్స్‌కి సెటిల్ చేసేశాను. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాను. నువ్వు వెంటనే డేట్స్ ఇవ్వకపోతే మొత్తానికి కూరుకుపోతాను..’’ బతిమిలాడేస్తున్నాడు ద్వారకేష్. ఒకరోజు, రెండు రోజులు, వారం పది రోజులు... రోజూ ఠంచనుగా వచ్చేస్తున్నాడు. పట్టుదలని విక్రమార్కుడిలా ఉన్నాడు. ఇబ్బంది పెట్టేస్తున్నాడు. మొహమాటపెట్టేస్తున్నాడు. ఇంక లాభం లేదు... ద్వారకేష్‌ను రీఛార్జ్ చేయడానికయినా సినిమా చేయాలి... ఓ నిర్ణయానికి వచ్చారు విష్ణువర్ధన్.
‘‘డెరైక్టర్ పి.వాసుకి ఒకసారి ఫోన్ చేయ్...’’ సెక్రటరీకి చెప్పారు.

******
‘‘చేద్దాం విష్ణు... మంచి ప్రాజెక్టే చేద్దాం... ’’ అంటున్నారు వాసు.
ఇప్పుడాయన విష్ణువర్ధన్ ఆఫీసులో ఉన్నారు. చాలాకాలంగా ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు. కాని ఇంత త్వరగా చేయాల్సి వస్తుందని ఇద్దరూ అనుకోలేదు. ద్వారకేష్‌ని గట్టెక్కించడానికి సినిమా చేయాలి.
‘‘ఓ కథ అనుకుని దాన్ని వండి సిద్ధం చేసే టైమ్ లేదు వాసు. ఏదైనా మంచి రీమేక్ ఉంటే చూడండి... వెంటనే స్టార్ట్ చేయాలి...’’ అన్నారు విష్ణువర్ధన్.
‘‘ఉంది... ఈ మధ్యనే డెరైక్టర్ ఫాజిల్ కలిశాడు. నాకు మంచి ఫ్రెండ్. మాటల మధ్యలో మణిచిత్రతళు గురించి చెప్పాడు. నాకు కూడా ఆ సినిమా చేయాలని ఉంది. కొత్తగా ఉంటుంది. మీరొకసారి చూసి ఓకె అంటే వెంటనే మొదలుపెట్టచ్చు...’’
డెరైక్టర్ వాసు చెప్పడం, విష్ణు ఆ సినిమా చూడటం... చకచకా జరిగిపోయాయి.
సినిమా బాగుంది. మలయాళంలో సూపర్‌హిట్ అయింది. మంచి కథ ఉంది. మహిళా ప్రేక్షకులకి పడుతుంది. విష్ణువర్ధన్ సినిమా మినిమమ్ గ్యారంటీ. కమర్షియల్ డెరైక్టర్ పి. వాసు. ఇంకేం కావాలి?
‘ఆప్తమిత్ర’ - టైటిల్ అనౌన్స్ చేశారు. సైకియాట్రిస్ట్‌గా విష్ణు. ఆయన ఫ్రెండ్ రమేశ్‌గా రమేశ్ అరవింద్. నాగవల్లి ఆత్మ ఆవహించే గంగ పాత్రలో సౌందర్య. హీరోయిన్‌గా ప్రేమ. గురుకిరణ్ సంగీతం. సినిమా మొదలైంది. అంతా అనుకున్నట్టే జరుగుతుండగా మధ్యలో బ్రేక్. నిర్మాత ద్వారకేష్ దగ్గర డబ్బు లేదు. 70 శాతం సినిమా షూటింగ్ పూర్తయ్యాక... ఇంక చేతులెత్తేశాడు. సినిమా దాదాపు ఆగిపోయింది.
మళ్లీ తలపట్టుకున్నారు విష్ణువర్ధన్. కిందా మీదా పడి ఫైనాన్షియర్స్ సహాయంతో మొత్తానికి ‘ఆప్తమిత్ర’ షూటింగ్ పూర్తి అయిందనిపించారు. ఇప్పుడు అది విడుదలకు సిద్ధంగా ఉంది. నాగవల్లి ఏం చేస్తుందో... ఇంకా తెలియదు.

******
ఇక్కడ కథకు కాసేపు బ్రేక్ ఇవ్వాలి. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కోసం ఛలో చెన్నై.
సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి సీనియర్ నటుడు శివాజీ గణేశన్ అంటే గురుభావం. ఎంతోకాలంగా ఆయన రజనీని భోజనానికి ఇంటికి రమ్మని పిలవడం, తరువాత ఇద్దరికీ టైమ్ సరిపడకపోవడం జరుగుతూ వస్తోంది. రజనీ మాట ఇస్తే అది నెరవేరుస్తారు. కాని ఎందుకో గురువు కోరికను తీర్చలేకపోయాడు. వెళ్దాం వెళ్దాం అనుకుంటూ ఉన్నాడు... ఈలోగా జరగరాని ఘోరం జరిగిపోయింది. శివాజీ గణేశన్ గతించారు. ఆ రోజు అంత్యక్రియలకు వెళ్లినప్పుడు శివాజీ గణేశన్ పార్ధివ శరీరాన్ని చూసి రజనీ విలపించాడు.ఙఞ్చట‘‘మీ ఇంటికి ఈ పరిస్థితుల్లో వస్తాననుకోలేదు గురూజీ...’’ అంటూ ఏడ్చారు. గురువు కోసం ఏదైనా చేయాలి అని అప్పుడే గట్టిగా సంకల్పం చెప్పుకున్నారు రజనీ.

******
చెన్నైలో... శివాజీ గణేశన్ ఇల్లు అప్పటికే కళ తప్పి ఉంది. పెయింట్లు లేక గోడలు వెలిసిపోయాయి. శివాజీ ఆఫీసు కూడా అంతే. ఎక్కడపడితే అక్కడ దుమ్ము. అప్పటికే అప్పులలో కూరుకుపోయి ఉంది ఆ కుటుంబం. ఆస్తులు ఉన్నాయి కాని అమ్మితే అంతవరకూ తండ్రి సంపాదించుకున్న పరువు, ప్రతిష్ట పోతాయని భయం. పెద్దదిక్కు కోల్పోయి పుట్టెదు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం ఆదుకునే నాథుడి కోసం ఎదురుచూస్తోంది.
ఎవరో చెప్పారు... ఫలానా చోట స్వామీజీ ఉన్నారు, ఆయన ఏదైనా మార్గం చెబుతారని. ఆ కుటుంబం అంతా తరలి వెళ్లింది. స్వామీజీ ఉన్నారు, వాళ్లందరినీ ఆశీర్వదించారు. మీకు వచ్చే సెప్టెంబర్ 28వ తేదీన ఒక శుభం జరుగుతుందని ఆశీర్వదించి పంపించారు. కాని ఆ విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు.

******
ఆగస్టు 27, 2004
బెంగళూరులో... ఆప్తమిత్ర రిలీజ్ అయింది. మొదటిరోజు ఫ్లాప్ టాక్. రెండో రోజూ ఫ్లాప్. వారం రోజుల పాటు సినిమాకి కలెక్షన్లే లేవు. కాని ఏదో మాయ జరిగినట్టుగా జరిగింది. ఆప్తమిత్ర సినిమా క్రమంగా మహిళలకు పట్టేసింది. థియేటర్స్ ఫుల్ కావడం మొదలైంది. యావరేజ్, హిట్, సూపర్‌హిట్, సూపర్‌డూపర్ హిట్... వారం వారానికి ఆప్తమిత్ర హిట్ రేంజ్ పెరిగిపోయింది. తక్కువ బడ్జెట్‌లో తీసిన ఆ సినిమా కన్నడ సినిమా చరిత్రలో రికార్డుల మోత మోగిస్తోంది. ఇది 200 డేస్ బొమ్మ అని ఇండస్ట్రీ వర్గాలు ప్రకటించాయి.
ఆ రోజు సెప్టెంబర్ 27. థియేటర్‌లో కూర్చుని అందరితో కలిసి ‘ఆప్తమిత్ర’ సినిమా చూస్తున్నాడో ముసలతను. నిజానికి అతను మారువేషంలో ఉన్నాడు. తరచి చూసినా అతనెవరో పోల్చుకోవడం కష్టం. పండు ముసలిలా కనిపిస్తున్న ఆ వ్యక్తి వేరెవరో కాదు, రజనీకాంత్. అతను హీరో విష్ణువర్ధన్‌కి చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఆప్తమిత్ర సినిమా చూస్తూ ప్రేక్షకులు థ్రిల్ అయిపోతుండటం గమనించాడు రజనీ. ఎలాగయినా ఈ సినిమా తను చేయాలి. రజనీకాంత్ ఆలోచించడం మొదలుపెట్టాడు.

******
‘‘రేపు ఉదయం కల్లా బెంగళూరు రా... అర్జెంట్...’’ శివాజీ గణేశన్ కొడుకు, నటుడు ప్రభుకి ఫోన్ వెళ్లింది.
అదే ఫోను... డెరైక్టర్ పి.వాసుకి కూడా వెళ్లింది. ఆ రాత్రంతా రజనీకాంత్ ఆలోచిస్తూ గడిపాడు. అంతకుముందే బాబా సినిమా తీసి ఆర్థికంగా కొంత నష్టపోయాడు. అన్నింటికన్నా ఆ సినిమా ఫ్లాప్ కావడం రజనీకాంత్‌లో మళ్లీ కసిని రగిలించింది. ఈసారి గెలవాలి. షూర్‌గా హిట్ కొట్టాలి. గురువు శివాజీ గణేశన్ రుణం తీర్చుకోవాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. రజనీకాంత్ ఆలోచిస్తునే ఉన్నాడు. ఈలోగా తెల్లవారింది. ప్రభు, పి.వాసు ఇద్దరూ బెంగళూరు చేరుకున్నారు. అప్పటికి వాళ్లిద్దరికీ తెలియదు... తాము ఆప్తమిత్ర సినిమాని రీమేక్ చేయబోతున్నామని.
ముగ్గురూ సమావేశం అయ్యారు. రజనీ తన మనసులో మాట చెప్పాడు. అది విని షాక్ అయ్యాడు డెరైక్టర్ పి.వాసు.
‘‘రజనీ... నిజానికి... ఈ సినిమాని ప్రభు హీరోగా మరొకరి కాంబినేషన్‌లో చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాం..’’ చెప్పారు వాసు.
‘‘నేను చేస్తే ఏమైనా అభ్యంతరమా... నేను డాక్టర్ పాత్ర చేస్తాను... ప్రభు నా ఫ్రెండ్ పాత్ర చేస్తాడు... ’’ రజనీకాంత్ చెప్పగానే ప్రభు, వాసులకు నోట మాట లేదు.
‘‘రజనీ... మీరు చేస్తారా...’’ ఇద్దరూ ఆశ్చర్యపోతూ అడిగారు. యస్... రజనీ చేస్తాడు. గురువు కుటుంబాన్ని ఆదుకోవడం కోసం చేస్తాడు.

******
‘‘లకలకలక...’’ అనుకుంటున్నాడు రజనీ. హౌల హౌల... అంటూంటాడు విష్ణువర్ధన్ కన్నడ వెర్షన్‌లో. అది రజనీకి నచ్చలేదు. మార్చాలి. ఎప్పుడో చిన్నప్పుడు మరాఠీ నాటకంలో విన్నాడు ఈ సౌండు. లకలకలక... ఓ విలన్ మేనరిజమ్ అది. రజనీకి అది గుర్తుకువచ్చింది.
‘‘వాసు... కథలో కొంచెం మార్పులు చేయ్. మాస్ ఆడియెన్స్‌కి కూడా ఇది నచ్చాలి...’’ చెప్పుకుంటూ పోతున్నాడు. రజనీకాంత్ ఉత్సాహం చూస్తుంటే డెరైక్టర్ వాసుకి భయం ఇంకా ఎక్కువయింది. బాబా సినిమా డిజాస్టర్ తర్వాత రజనీ తనను నమ్మి ఈ ప్రాజెక్ట్ అప్పగిస్తున్నాడు. ఒళ్లు దగ్గర పెట్టుకుని చేయాలి. రజనీ ఫ్యాన్స్‌ని మెప్పించాలి. వాసు ఆ పనిలో నిమగ్నమయ్యాడు.
‘‘ఇంకో ముఖ్యవిషయం... ఆ దెయ్యం పేరు నాగవల్లి అంటే కొంచెం లైట్‌గా ఉంది. రాజుల కాలంనాటి నర్తకి కాబట్టి... ఇంకా ఏదైనా హెవీగా ఉండే పేరు పెట్టాలి...’’ ముగ్గురూ డిసైడ్ అయ్యారు. అప్పుడు వారికి తట్టిన పేరు...
చం... ద్ర... ము...ఖి...
మలయాళంలో, కన్నడంలో నాగవల్లి... తమిళంలో... తెలుగులో మాత్రం చంద్రముఖి అయిపోయింది.
నాగవల్లి ఎఫెక్ట్‌ని తగ్గించడానికేనా... ఆ దెయ్యం పేరు చంద్రముఖిగా మార్చారు?
అది మాత్రం మిస్టరీ!

******
లొకేషన్... హైదరాబాద్.
‘‘రజనీకాంత్ ఏదో సినిమా మొదలుపెట్టాడట... డబ్బింగ్ రైట్స్ తీసుకోకూడదూ... నాకో ఛానెల్ ఉంది...’’ చెన్నై నుంచి ఓ ఫ్రెండ్ ఫోన్ చేశారు. ఆ ఫోన్ అందుకున్న వారు గవర పార్థసారథి. ఏ సినిమాయో తెలియదు. కథ తెలియదు. కాని రజనీకాంత్ సినిమా. డీల్ కుదిరితే అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు పార్థసారథి. ఆయన చెన్నై బయల్దేరి వెళ్లేసరికి అప్పటికే అక్కడ పెద్ద పోటీ. తెలుగులో టాప్ నిర్మాతలు కొందరు ఆ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అక్కడికి వెళ్లాక ఆరా తీస్తే తెలిసింది... ఇది కన్నడంలో వచ్చిన ఆప్తమిత్ర సినిమాకి రీమేక్.
అంటే... పద్నాలుగేళ్ల కిందట మలయాళంలో వచ్చిన మణిచిత్రతళు సినిమాయే ఇది.
అప్పుడు అది చేతివరకూ వచ్చింది కాని చేయలేకపోయారు పార్థసారథి. ఇప్పుడు మళ్లీ... ఇన్నేళ్ల తరువాత... అదే సినిమా... మరో రూపంలో వచ్చింది. ఇది యాదృచ్చికంగా జరిగిందా... లేక... మరేదయినా కార్యకారణ సంబంధం ఉందా?

******
చెన్నైలో... శివాజీ గణేశన్ ఆఫీసు దుమ్ముపట్టిపోయి ఉంది. అప్పటికి చంద్రముఖి సినిమా షూటింగ్ ఇంకా జరుగుతోంది. కాని ఆఫీసుని శుభ్రంగా తుడిచే బాయ్ కూడా లేడు. కళ తప్పిన గోడలతో పాడుబడినట్లుంది. అక్కడే... దుమ్ముపట్టిన కుర్చీలో కూర్చుని... సంతకాలు చేశారు పార్థసారథి. లెజెండ్ శివాజీ గణేశన్ ఎలా బతికారు? ఇప్పుడు వారి కుటుంబం ఎలాంటి పరిస్థితిలో ఉంది? చంద్రముఖి సినిమా ఆ కుటుంబాన్ని గట్టెక్కిస్తుందా?

******
2005, ఏప్రిల్ 14.
రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమా విడుదలైన రోజు. మొదటిరోజే ప్రేక్షకులకు దిమ్మతిరిగిపోయింది. రజనీ కొత్తగా కనిపించాడు. కథ మరీ కొత్తగా ఉంది. హీరోగా, విలన్‌గా... ముఖ్యంగా... లకలకలక... అంటూ రజనీ చేసిన మేనరిజమ్ మాస్‌కి విపరీతంగా పట్టేసింది.
లకలకలక....
నలుగురు మాట్లాడుకుంటే ఆ మేనరిజమ్ తలుచుకుంటున్నారు.
‘‘వారాయ్... నాన్ ఉన్నై తేడీ...
వందేన్... నినువుక్కున్నాడీ...
మంజమే నానిడ... ఎన్నయుం కైతొడ...
తోగియుం... తోలిన్ మేల్ ఆడా...’’
రిలీజ్ రోజే సూపర్‌హిట్ టాక్. చంద్రముఖి సినిమా సూపర్‌డూపర్ హిట్. తెలుగులో, తమిళ్‌లో ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలకొడుతూ దూసుకుపోతోంది. 50 రోజులు, 100 రోజులు... 200 రోజులూ... చెన్నైలో శివాజీ గణేశన్ సొంత థియేటర్ అయిన ‘శాంతి’లో ఈ సినిమా ఒక్క ఆటంకం లేకుండా 800 రోజులు ఆడి రికార్డు సృష్టించింది.

******
నాగవల్లి ఉరఫ్ చంద్రముఖి... ఒక ఆత్మ!
అది అభూతకల్పన. కాని సినిమా దాన్ని నిజం అని నమ్మించింది. తరువాత అది భయపెట్టింది. ఆ భయం మనల్ని వెన్నాడింది.
కాని చూడండి చిత్రం... భయపడింది మనం.
సౌందర్య, విష్ణువర్ధన్‌ల మరణాలకు, లైట్‌బాయ్‌లు స్పృహ తప్పడానికి, విమలారామన్ భయానికి, ఆఖరికి బాల్‌పెన్ రాయడం ఆగిపోవడానికీ కూడా నాగవల్లి అలియాస్ చంద్రముఖి కారణం కాకపోవచ్చు. కాని ఆ దెయ్యమే కారణం అనుకుంటేనే ఓ కథ పుడుతుంది. అది ఆసక్తి రేకెత్తిస్తుంది. చెప్పడానికయినా... వినడానికయినా థ్రిల్‌గా ఉంటుంది.
మనిషిని భయం కూడా ఒక్కోసారి రీఛార్జ్ చేస్తుంది.
లేకపోతే... అంతమంది జనం ఆ సినిమాని అన్నేసిసార్లు చూసి... ఎందుకు రీఛార్జ్ par అవుతారు?ఙ- ఇన్‌పుట్స్: సతీశ్ కుమార్

చంద్రముఖి ‘చిత్రాలు’

19వ శతాబ్దంలో ట్రావన్‌కోర్ రాజకుటుంబం నివసించిన ఆలుముట్టిల్ ప్యాలెస్‌లో జరిగిందంటూ ఒక కథ ప్రచారంలో ఉంది.

ఆ కథ ఆధారంగా ఫాజిల్ డెరైక్షన్‌లో సైకలాజికల్ థ్రిల్లర్ ‘మణిచిత్రతళు’ సినిమా మలయాళంలో 1993 డిసెంబర్ 23న విడుదలయింది.

మణిచిత్రతళు సినిమా 300 రోజులు ప్రదర్శితమై మలయాళ చిత్రసీమలో రికార్డులు నెలకొల్పింది.

కేరళలోని ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌లో 12సార్లు ఈ సినిమా టెలికాస్ట్ అయింది. అయిన ప్రతిసారీ రికార్డు స్థాయిలో టిఆర్‌పిలు రావడం ఈ సినిమాకే చెల్లింది.ఇదే సినిమా కన్నడంలో ‘ఆప్తమిత్ర’గా రిలీజ్ అయింది. కన్నడంలో 200 రోజులు ప్రదర్శితమై ఈ సినిమా రికార్డులు నెలకొల్పింది.
తమిళ, తెలుగు భాషల్లో ‘చంద్రముఖి’గా సూపర్‌హిట్ అయింది. తమిళనాట శాంతి థియేటర్‌లో చంద్రముఖి సినిమా 800 రోజులు సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమైంది.హిందీలో ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా ‘భూల్ బులయ్యా’ సినిమా ‘మణిచిత్రతళు’కి రీమేక్.మణిచిత్రతళు సినిమాకి ఫాజిల్ దగ్గర కో-డెరైక్టర్‌గా ప్రియదర్శన్ పనిచేశారు.

ఆప్తమిత్ర స్ఫూర్తితో ఆ సినిమాని కన్నడ, తమిళ భాషల్లో డెరైక్ట్ చేసిన డెరైక్టర్ పి.వాసు సీక్వెల్‌గా ‘ఆప్తరక్షక’ సినిమాని రూపొందించారు. ఆ సినిమా కూడా సూపర్‌హిట్ అయింది.
‘ తెలుగులో ‘నాగవల్లి’ ఇందులో వెంకటేశ్ కథానాయకుడు.