సరిగ్గా 14 ఏళ్ళ క్రితం ఆ పాట ట్యూన్ అయింది. ఇప్పటి వరకు అనేక సభల్లో అనేక మంది గాయకులు ఈ పాటను హృదయానికి హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, వైభవాన్ని తెలిపే ఆ పాట... చివరకు ఆర్.నారాయణమూర్తి నటించిన 'వీర తెలంగాణ' చిత్రంతో వెండితెరకెక్కింది. గేయరచయిత నందిని సిద్దారెడ్డికి ఉత్తమ గేయరచయితగా 2010 సంవత్సరానికి నంది అవార్డును తెచ్చిపెట్టింది. ఆ పాటే 'నాగేటి సాలల్లో నా తెలంగాణ...'. ఇప్పటి వరకు 25 పాటలు రాస్తే తనకు ఎంతో గుర్తింపు తెచ్చిన ఆ గేయం పుట్టుక గురించి... సినిమా రంగం పట్ల తనకున్న ఆసక్తి... తదితర విషయాలపై గేయరచయిత నందిని సిద్దారెడ్డి మాటల్లోనే.
'నాగేటి సాలల్లో...' అనే పాటకుగాను నాకు ఉత్తమ గేయరచయితగా నంది అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే గత 14 ఏళ్ళుగా అనేక మంది ఈ పాటను పాడుతున్నారు. బాగా పాపులర్ అయిన పాట అంది. 1997 ఆగస్టు 16వ తేదీన షేక్ బాబా అనే గాయకుడు ఓ పాటను రాసివ్వండి... బహిరంగ సభలో పాడుదాం అన్నారు.
అంతే మరుసటి అంటే ఆగస్టు 17వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈ పాటను రాసిచ్చేశా. ఆ పాటకు ఆయనే ట్యూన్ కట్టుకుని బహిరంగ సభలో పాడారు. అలా మొదలైన ఆ గేయాన్ని దేశపతి శ్రీనివాస్ అనేక సభల్లో పాడి పాపులర్ చేశారు. ఈ పాట ప్రజల్లోకి వెళ్ళడానికి ఆయన పాడటమూ ఓ కారణం. ఓ రోజు ఆర్.నారాయణమూర్తి సిద్ధిపేటలో ఉన్న నా ఇంటికి వచ్చి ఈ పాటను తన సినిమాలో పెట్టుకుంటానని అడగడమూ... నేను వెంటనే ఒప్పుకోవడమూ జరిగిపోయింది. ఈ పాటను తన సినిమాలో జె.ఏసుదాసుతో పాడించారు. సినిమాల్లోకి వెళ్ళాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉంది. కానీ ఉద్యమం వైపు వెళ్ళిన తరువాత ఆ దిశగా ఆలోచించలేదు. ఈ పాటతో సినిమాల్లోకి రావడం... ఆ పాటకు నంది అవార్డు రావడంతో నా చిన్ననాటి కోరిక తీరింది.
కమర్షియల్ పాటలు రాయను అన్ని రసాల పాటలు రాయాలని ఉంది. అయితే ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే పాటలను మాత్రమే రాస్తా. ఇప్పటి వకు 25 పాటలు రాస్తే అందులో పది పాటలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవి. 1992లో జరిగిన మద్యపాన వ్యతిరేఖ ఉద్యమానికి సంబంధించి ఓ ఐదు పాటలను, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఓ పాటను, ప్రజా ఉద్యమాలకు సంబంధించి తొమ్మిది పాటలను రాశా.
నేపథ్యం... మెదక్ జిల్లా కొండపాక మండలం బందారం అనే చిన్న గ్రామంలో రైతు కుటుంబం మాది. నాన్న బాల సిద్దారెడ్డి, అమ్మ రత్నమ్మ పెద్దగా చదువుకోలేదు.. నేను డిగ్రీ పూర్తవగానే ఉస్మానియాలో పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ ఎనిమిదేళ్ళలో పూర్తి చేశా. ప్రస్తుతం సిద్ధిపేటలో నేను చదువుకున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే తెలుగు లెక్చరర్‌గా 19 ఏళ్ళుగా పనిచేస్తున్నా. నాకు గాయకుడు ఘంటసాల అంటే ఇష్టం. సంగీత దర్శకుల్లో సాలూరి రాజేశ్వరరావు, ఇప్పటి తరంలో చక్రి అంటే ఇష్టపడతా. గేయ రచయితల్లో శ్రీశ్రీ, దాశరథి, డాక్టర్ సినారె, ఆత్రేయ రాసిన పాటలంటే ఎంతో ఇష్టం.
