Tuesday, July 26, 2011

తెలుగు పత్రికల తీరు తెన్నులు

1885లో "ఆంధ్ర ప్రకాశిక" తో మొదలైన తెలుగు పత్రికలు నేటి కంప్యూటర్ యుగంలోకూడా సమాజంలో ప్రముఖ పాత్ర పోషించవలిసివుంది
ఇటీవల కాలంలో పత్రికా ప్రచురణలోనూ, వార్తా సేకరణ పద్ధతులలోనూ చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. మనం ప్రజాస్వామికాపాలనా విధానాన్ని వరించాము. నిజమైన స్వేచ్ఛగల పత్రికా వ్యవస్థ ప్రజాస్వామ్యానికి జీవనాడి వంటిది. కనుక ఈ వచ్చిన, వస్తున్న మార్పుల ప్రభావం గణనీయమైనదిగా ఉంటుంది.

తెలతెలవారుతుండగానే తలుపు తట్టి, వాటిక పేపరువేసి వెళ్ళే కుర్రాడు నేటి నాగరికత జీవనంలో మేలుకొలుపు గీతిక పాడే బాల హరిదాసు వంటివాడు. అతడు తెచ్చి ఇచ్చే దినపత్రిక మండతల్లో ప్రకృత ప్రపంచం మన కంటిముందు సాక్షాత్కరిస్తుంటుంది. వార్తలు, వింతలు, విశేషాలు, వినోదాలు, విషాదాలు కలగలసి ఉండే పంచామృతం వంటిది వార్తాపత్రిక. పత్రికలు చదవడంలో ఎవరి అభిరుచులు వారివి, ఎవరి అలవాట్లు వారివి. ఆయా వ్యక్తుల, కుటుంబాల పరిసరాలను, అవసరాలను, ఆశయాలను బట్టి ఈ అభిరుచులు వేరువేరుగా ఉంటాయి.

తనకు తెలియని సంగతులు తెలుసుకోవాలన్న తహతహ, ఆశ్చర్యాతిరేకం, హర్షాతిశయం కలిగించే అద్భుతాలను, ఆధునిక మానవ విజయాలనూ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం, అన్నిటినీ మించి స్వీయ వివేక వికాసాలను అనుదినం పెంపొందించుకోవాలన్న తపన - ఇవన్నీ మనచేత పత్రికలను చదివిస్తాయి. క్రమేపీ ఇదొక అలవాటుగా, వ్యవసనంగా మనలో గూడుకట్టుకుంటుంది.

అయితే, ప్రజాస్వామిక స్వేచ్ఛా సమాజంలో ఈ అలవాటుకు ఒక పత్ర్యేక కారణం ఉన్నది. వార్తా విశేషాలను విపులంగా తెలుసుకొని తీరవలసిన ఒక ఆవశ్యకత ఈ వ్యవస్థలో పౌరులకు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయాలు ప్రజల అభిమతం మీద ఆధారపడి ఉంటాయి. ఈ ప్రజాభిమతాన్ని వివేక పూరితమైనదిగా తీర్చి దిద్దగల శక్తి వార్తాపత్రికలకున్నది. ప్రభుత్వ పరంగా, సమాజపరంగా నిత్యం ఏమి జరుగుతున్నదీ, ఎలా జరుగుతున్నదీ పౌరులు తెలుసుకోవటానికి పత్రికలు ముఖ్య సాధనం. అయితే ఈనాటి పౌరులకు తమ సమాజంలో తమ ప్రాంతంలో, తమ దేశంలో ఏమి జరుగుతున్నదో మాత్రమే తెలుసుకుంటే చాలదు. మనచుట్టూ ఉన్న బయటి ప్రపంచంలో వస్తూ ఉండే దైనందిన పరిణామాలను కూడా తెలుసుకోవడం అవసరం. ఈ తెలివిడికి పత్రికలు గవాక్షం వంటివి.

కనుక పత్రికల ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. మన దేశంలో తొలుదొలుత పత్రికలు ప్రారంభించిన వారు క్రైస్తవ మత ప్రచారకులు, వారిని చూచి హిందూమత ప్రచారకులూ, సంఘ సంస్కరణవాదులూ పత్రికలు ప్రారంభించారు. అయితే పత్రికలకు మనం చెప్పుకునే నిర్వచనం ప్రకారం అవేవీ వార్తాపత్రికలనిపించుకోవు. ఇలా చూచినప్పుడు తెలుగులో మొట్టమొదటి వార్తాపత్రిక 1885లో వెలువడింది. ' ఆంధ్ర ప్రకాశిక' అనే ఆ పత్రికను ఆవుల చినపార్థసారధి నాయుడు ప్రారంభించారు. అంతకు ముందు యాభై సంవత్సరాల పత్రికల చరిత్ర నన్నయకు పూర్వం తెలుగు సాహిత్య చరిత్ర వంటిదే.
ఆ తరువాత ఈ శతాబ్ధి మొదటి పాదంలో వచ్చిన 'కృష్ణాపత్రిక' (1901), '' స్వరాజ్య'' (1905), ఆంధ్ర ( వార) పత్రిక (1907), '' ఆంధ్ర (దిన) పత్రిక'' (1914), '' కాంగ్రెస్'' 91921), '' జమీన్ రైతు'' 91930), '' వాహిని'' 91935), '' ఆంధ్రప్రభ'' 91938) ఇలా వరుసగా తెలుగులో పత్రికలు పుట్టుకొచ్చాయి. అయితే వీటిలో '' జమీన్ రైతు'', '' ఆంధ్రప్రభ'' మాత్రమే ఇప్పటికీ సజీవంగా కొనసాగుతున్నాయి. ఇలా జరుగుతూ వచ్చిన తెలుగు పత్రికా రంగం చరిత్రలో 1941 నుంచి ఒక కొత్త మలుపు వచ్చింది. అప్పటి వరకూ ఈ పత్రికలన్నీ గ్రాంధిక భాషలో ఉండేవి.

కాగా, నార్ల వెంకటేశ్వరరావుగారు ఆ యేడు ఆంధ్రప్రభ సంపాదకత్వాన్ని చేపట్టడంతో ఈ పెద్ద మార్పు వచ్చింది. పత్రికా రచనలో జన భాషను ఒక పద్ధతిలో ప్రవేశపెట్టి, వాడుక భాషలోనే వార్తలను అందించే ఆధునిక సంప్రదాయాన్ని నెలకొల్పిన ఘనత నార్ల వారిక దక్కుతుంది. గిడుగు వారి వ్యావహారిక భాషా ఉద్యమం, తాపీవారి వాడుక భాష వినియోగ ప్రయోగాలు నార్ల వారికి ఈ విషయంలో తోడ్పడ్డాయి. ఇలా వుండగా 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దానితోపాటే పరాగతం కారాని జన్మహక్కులు, పౌరహక్కులు మనకు సంక్రమించాయి. పర్యవసానంగా మన బాధ్యతలు పెరిగాయి. పత్రికల ప్రాముఖ్యమూ పెరిగింది.

స్వాతంత్ర్యానంతరం మన వార్తా పత్రికల సంఖ్యలోనూ, వాటి ప్రాచుర్యంలోనూ విశేషమైన పెరుగుదల వచ్చింది. అలనాటి చిలక ముద్రణ దశ నుంచి ఈనాడు కంప్యూటర్తోనే చేసే అక్షరాల కూర్పు పద్ధతి వరకు ముద్రణ పద్ధతులలో ఎంతో పురోగమనం జరిగింది. అలాగే ఒకానొకటి ' ఏడురోజులనాటి' తాజావార్త అని పత్రికలు చెప్పుకొనే స్థితి నుంచి ఏడు నిమిషాలలో, ఈరేడు లోకాలలో ఎక్కడ ఏమి జరిగిందీ, జరుగుతున్నదీ తెలుసుకొని ప్రచురించగల మహోన్నత సాంకేతిక దశకు పత్రికలు చేరుకున్నాయి.

అయితే మన పత్రికా రచనా ప్రమాణాల విషయంలో ఆశించవలసినది ఎంతైనా ఉంది. జడ్జీల వలెనే జర్నలిస్టులు కూడా రాగద్వేషాలకతీతంగా వాస్తవాలను నిష్పాక్షిత దృష్టితో విషయ వివేచన చేసి చెప్పడం సబబు, సుముచితము, వాంఛనీయమూ. మరి, మన పాత్రికేయులందరూ ఈనాడు అలా చేస్తున్నారని చెప్పగలమా? అటువంటి జర్నలిస్టులు అసలే లేరని కాదు, అటువంటి పత్రికలూ లేవని కాదు. ఆ సంఖ్య అతి స్వల్పం. మన రేడియో, టెలివిజన్ సౌకర్యాలు పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలో వున్నందున వాటి నుంచి నిష్పాక్షికతను ఆశించజాలము. మన పత్రికలు సైతం వాటి యజమానుల అన్య పారిశ్రామిక పరిరక్షణకు మాత్మే ఉపకరిస్తున్నాయన్న భావం ప్రబలంగా ఉన్నది.

నిజానికి ఈనాడు మన జర్నలిజం ఒకవైపున పాలకుల ఒత్తిళ్ళకూ, మరొకవైపున వ్యాపార ప్రకటనలిచ్చి పోసించే పారిశ్రామికుల ఒత్తిళ్లకూ మధ్యన నలిగిపోతున్నది. ఇటీవలి కాలంలో మన పత్రికా రంగంలో మరొక అవాంఛనీయమైన పరిణామం వచ్చింది. పత్రికా నిర్వహణలో ఒకనాడు సంపాదకునికి ఎనలేని ప్రాముఖ్యం ఉండేది. ఈనాడు అతడు దానిని కోలోపయాడు. ఈ తిరుగులేని పెత్తనం పత్రికల బిజినెస్ మేనేజర్ల చేతుల్లోకి పోయింది. పలితంగా ఈనాటి పత్రికా సంపాదకుడు ముగ్గురు పెత్తందార్లను సంతృప్తి పరచవలసిన దయనీయమైన పరిస్థితులలో పడిపోయాడు. సంపాదకుని పూర్వ ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బతిన్నది. అందువల్లనే ఒకనాడు ఎడిటర్లకు జర్నలిస్టులకు ఉన్న గౌరవం ఈనాడు లేదు
మన పత్రికా రంగంలో వచ్చిన మరొక సరికొత్త పరిణామం మితిమీరిన వ్యాపార దృష్టి - ముద్రణ పద్ధతులలో వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి వలన నేటి పత్రికలు చూడ ముచ్చటగా వుంటున్నాయి. మరి, చదువ ముచ్చటగా వుంటున్నాయా? ఎప్పుడో ఒకటీ అరా తప్ప నేటి పత్రికలలో ఇది మరీ అరుదైన మాట అయింది. ఒకనాడు పెద్ద పత్రికలు కొన్ని స్వల్ప విషయాలను స్థానిక చిన్న పత్రికలకు వదలి వేసేవి. ఈనాడు అలాకాదు. ప్రతీ చిన్న పెద్ద విషయాలలో తలదూర్చి చిన్న పత్రికల మనుగడను దుర్లభం చేస్తున్నాయి. ఒకనాడు సమాజ శ్రేయస్సే పత్రికల ప్రధాన ధేయ్యంగా ఉండేది. ఈనాడు అలాకాదు. యజమానుల వ్యాపార పారిశ్రామిక ప్రయోజనాలను పెంపొందించుకొనటానికి ఉపకరణాలుగా పత్రికలు ఉపయోగపడుతున్నాయి. అలాగే రాజకీయాధికారపు ప్రాపును పొందటానికి, వీలైతే రాజకీయ అధికార పదవులను చేజిక్కించుకొనటాననకీ యజమానులు పత్రికకలను సోపాననలలగా ఉపయోగించుకొంటున్న సందర్భాలూ ఉన్నాయయ.ఇవన్నీ చూచినపుడు అటు ప్రభుత్వ ప్రసార సంస్థలకూ, ఇటు పత్రికలకూ తేడా అట్టే కనిపించదు. ఇవన్నీ అందరూ జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయాలు

No comments:

Post a Comment