‘నో వన్ కిల్‌డ్ జెస్సికా…’!
‘సాత్ ఖూన్ మాఫ్’…!
‘టర్నింగ్ 30’…!
‘ఐ యామ్…’!
ఈ సినిమాలన్నింటిల్లో ఉన్న కామన్ పాయింట్ ఏమిటంటే ఇవన్నీ మహిళ ఇతివృత్త ప్రధాన చిత్రాలు కావడమే! ఇలా గతంలో ఎన్నడూ లేనంతగా బాలీవుడ్‌లో ఈ సీజన్‌లో లెక్కకు మిక్కిలి మహిళా చిత్రాలు రూపొందుతున్నాయి. సంఖ్యా పరంగానే కాకుండా, ఈ సినిమాల బడ్జెట్‌లు, వీటిలో నటిస్తున్న నటీమణులు, వీటికి దర్శకత్వం వహిస్తున్న దర్శకులు అందరూ కూడా టాప్ రేంజిలో ఉండడం ఇప్పుడు బాలీవుడ్‌లో జోరందుకుంటున్న ఈ మహిళా చిత్రాలపై చర్చను లేవనెత్తుతోంది!
మహిళా చిత్రాలేంటి?
సాధారణంగా బాలీవుడ్ కానీ, మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా కానీ అన్ని వర్గాల అన్ని స్థాయిల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించడం సహజం! సినిమా హిట్ కావాలంటే, బాక్సాఫీస్ కలెక్షన్లు పెరగాలంటే అందరు ప్రేక్షకులూ ఆ సినిమాను ఆదరించడం అవసరం. అంటే ఓ సాధారణ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అన్నిరకాల ఎలిమెంట్స్ ఆ సినిమాలో ఉండాలన్న మాట! అయితే ఈ సూత్రానికి భిన్నంగా కొన్ని సినిమాలు, ఓ ప్రత్యేక, కథ-కథనం-ఇతివృత్తంతో నిర్మాణమవడం, ఆ సినిమాలు మొదట్లోనే ఆ ప్రత్యేక తరగతికి చెందిన సినిమాలుగా ముద్రపడడం కూడా జరుగుతోంది. అలాంటి వాటిలో మహిళా ప్రధాన చిత్రాలు కూడా ఒకటి! ప్రపంచ సినిమా గ్రామర్‌లో ఈ తరహా సినిమాలను ‘విమెన్ -సెంట్రిక్ సినిమాల’నీ, ‘్ఫమేల్ ఓరియెంటెడ్ సినిమా’లనీ, ‘హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల’నీ అంటారు.
ఇక మహిళా చిత్రాలనగానే కొన్ని లక్షణాలు ఇట్టే గుర్తుకు వస్తాయి. 1.ఈ సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఉంటుంది. 2. మహిళలు సాధారణంగా ఎదుర్కొనే సామాజిక, రాజకీయ, ఆర్థిక, మానసిక సమస్యలే వీటిలో ఇతివృత్తం 3.కథ యావత్తు హీరోయిన్ చుట్టే తిరుగుతుంది. 4. సెంటిమెంట్, హ్యూమన్ కంపాషన్ ఈ సినిమాల్లో కనిపించే ఎలిమెంట్స్, 5. సానుభూతి, యాగ్రెసివ్‌నెస్-తిరుగుబాటు-చైతన్యం–సామాజిక మార్పు అనేవి ఈ సినిమాల్లో ప్రధానంగా కనిపించే అంశాలు. 6.అణిచివేత-దోపిడీ-లింగ వివక్ష-స్ర్తిలపై విచక్షణలు- న్యూలైఫ్ స్టైల్స్‌లో స్ర్తిలు ఎదుర్కొనే సంఘర్షణలు ప్రధాన కథా వస్తువులు 7. ఆధునిక నగర జీవన శైలులలో స్ర్తిపరమైన అస్తిత్వ వేదనలు, అచీవ్‌మెంట్స్, జీవన పోరాటాలు వీటిలో మూలాంశాలు.
గతంలో లేవా?
మహిళా ప్రధాన కథా చిత్రాల నిర్మాణం ఇటీవలి ధోరణే అనుకుంటే పొరపాటే! బాలీవుడ్‌లో 1913లో తొలి సినిమా నిర్మాణం నుంచి మొదలుకొని ఇప్పటివరకు వేర్వేరు కాలాలు-తారలు-సందర్భాలకు అనుగుణంగా రకరకాల మహిళా చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని ఫిక్షనల్ స్టోరీలు కాగా, మరికొన్ని నిజ జీవిత సంఘటనలనుగాని ఇన్‌స్పిరేషన్‌తో రూపొందినవి. ఇంకొన్ని మాత్రం ఏకంగా నిజ జీవిత మహిళల కథలనే ‘బయోపిక్’ తరహాలో తెరకెక్కించారు. అయితే ఇవన్నీ సమకాలీన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో స్ర్తి స్థాయినీ, పోరాటాన్ని చూపించడం విశేషం!
బాలీవుడ్‌లో మహిళా ప్రధాన చిత్రాలకు ఒక పూర్తి షేప్‌ను తెచ్చిన సినిమాగా ‘మదర్ ఇండియా’ను చెప్పుకోవాలి. నర్గీస్‌దత్ టైటిల్‌రోల్‌లో వచ్చిన ఈ సినిమా గ్రామీణ భారతంలోని భూమి-స్ర్తిల అనుబంధాలను, కుటుంబ బంధం-న్యాయం మధ్య సంఘర్షణను అద్భుతంగా తెరకెక్కించి మహిళా ప్రధాన చిత్రాలలో మణిమకుటంగా నిలిచింది. ఇదే కాకుండా నూతన్ ‘సుజాత’, ‘బందినీ’ సినిమాలు…మీనాకుమారి ‘పాకీజా’ సినిమా…షర్మిలాఠాగూర్ ‘వౌసమ్’ సినిమా ఈ కోవలోనివిగానే గుర్తింపు పొందాయి. కాగా 16వ శతాబ్దపు లక్నో గాయనీమణి ఉమ్రావ్‌జాన్ జీవితం ఆధారంగా రేఖ హీరోయిన్‌గా అదే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది. ముజఫర్ అలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ నర్తకి జీవితంలోని అన్ని రకాల దశలను అత్యద్భుతంగా ప్రజెంట్ చేసింది. బాలీవుడ్ సినీ ప్రస్థానంలోఓ క్లాసిక్‌గా రూపొందిన ఈ సినిమా, ఆ తర్వాత ఐశ్వర్య మెయిన్ లీడ్‌లో రీమేక్‌గా సైతం రూపొందింది. ఇక మొఘల్ కాలంనాటి కథతో రూపొందిన ‘అనార్కలి’, ‘మొఘల్-ఎ-ఆజమ్’ సినిమాలు కూడా మహిళా ప్రధాన చిత్రాలుగానే గుర్తింపుపొందాయి.
మరోవైపున సమకాలీన నిజ జీవిత సంఘటనలు, వ్యక్తుల జీవితాలతో ఒ కొన్ని మహిళా చిత్రాలు వచ్చాయి. వాటిలో గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆంధీ’ సినిమాని ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. సంజీవ్‌కుమార్-అపర్ణాసేన్ జంటతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఇందిరాగాంధీ జీవితాన్ని పోలి ఉందనే వివాదాలను సైతం ఎదుర్కొంది.
‘దామిని’ సంచలనం
బాలీవుడ్‌లో తొలితరం మహిళా చిత్రాలన్నీ స్ర్తి సహజమైన అబలత్వాన్ని, అసహాయతను సింపథెటిక్‌గా చూపిస్తూనే, ఉద్యమించే మూర్తిమత్వాన్ని, ధిక్కరించే స్వభావాన్ని వ్యక్తీకరించాయి. కానీ 1980 దశకం తర్వాత వచ్చిన మహిళా చిత్రాలన్నీ మరింత నిర్మాణాత్మకంగా, మరింత ‘్ఫకస్‌డ్’ రావడం విశేషం. అలాంటి సినిమాలలో రాజ్‌కుమార్ సంతోషి ‘దామిని’ చెప్పుకోదగ్గ సినిమా! తన సాటి స్ర్తికి జరిగిన అన్యాయాన్ని తన భర్త, కుటుంబాన్ని సైతం ఎదిరించి న్యాయస్థానంలో పరిష్కారం కనుక్కొన్న ఒంటరి స్ర్తి పోరాటమే ఈ సినిమా!ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించి మహిళా చిత్రాల స్టామినాను తెలియజెప్పింది.
ప్యారలల్ సినిమా నీరాజనం
భారతీయ వెండితెరపై 1955లో మొదలైన ‘న్యూవేవ్’ సినిమా ఆర్ట్ఫిలిం, ప్యారలల్ సినిమా ఉద్యమాలు స్ర్తి ప్రధాన కథా చిత్రాలకు పెద్దపీట వేసాయి. ఇంకా చెప్పాలంటే ప్యారలల్ సినిమాకి ప్రధాన పునాది స్ర్తియే అయిందన్నా ఆశ్చర్యంలేదు…ఆ మాటకొస్తే ప్యారలల్ సినిమా మూవ్‌మెంట్‌కు పునాది వేసిన ‘పథేర్ పాంచాలి’ సినిమా కూడా మహిళా ప్రధాన కథా చిత్రమే! ఇక శ్యామ్‌బెనగల్ అంకుర్, భూమిక, మండీ, మంధన్ మొదలగు సినిమాలు సాయిపరంజపే ‘స్పర్శ్’, ‘సతి’ సినిమాలన్నీ ఈ కోవలోనివే!
ఇక కల్పనా లజ్మి దర్శకత్వంలో డింపుల్ కపాడియా మెయిన్ రోల్‌లో వచ్చిన ‘రుడాలి’ ఈ తరహా చిత్రాలతో గొప్ప సినిమాగా నిలిచిందని చెప్పాలి. తర్వాత ‘దమన్’ ‘చింగారీ’ సినిమాలు కూడా కల్పనా లజ్మిలోని స్ర్తి ప్రధాన కథా ఇతివృత్తాలకు వివిధ కోణాలను ఆవిష్కరించినవే! ఇవే కాక, జగ్‌మోహన్ ముంద్రా దర్శకత్వంలో వచ్చిన ‘బవందర్’ (నందితాదాస్ హీరోయిన్), ‘ప్రోవోక్‌డ్’ (ఐశ్వర్యారాయ్) సినిమాలు మహిళల ప్రస్తుత స్థితిగతులకు అద్దం పట్టినవే!
మలుపు తిప్పిన ‘చాందినీ బార్’
మహిళా ప్రధాన కథా చిత్రాల దశను-దిశను ఇటీలి కాలంలో మలుపుతిప్పిన సినిమాగా ‘చాందినీ బార్’ను చెప్పుకోవచ్చు. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో టబు హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలే కాక, బాక్సాఫీస్ కలెక్షన్లను కూడా సాధించింది. 1991 అనంతర భారతీయ సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిస్థితులలో పొడసూపిన నూతన పోకడలకు ఈ సినిమాలు అద్దం పట్టాయి. బసు భట్టాచార్య డైరక్షన్‌లో రేఖ హీరోయిన్‌గా వచ్చిన ‘ఆస్థా’ కూడా ఈ కోవలోనిదే!
ప్రీతిజింటా ప్రధాన పాత్రలో వచ్చిన ‘క్యాకెహనా’ సినిమా పెళ్లికిముందే గర్భవతైన స్ర్తి సమస్యను ఇతివృత్తంగా స్వీకరించగా టబు హీరోయిన్‌గా వచ్చిన ‘అస్తిత్వ’ సినిమా ఓ మధ్య వయస్కురాలి మనోవేదనలోంచి పెల్లుబికిన అస్తిత్వ వేదనగా నిలిచింది! ప్రకాష్‌ఝా దర్శకత్వంలో వచ్చిన మృత్యుదండ్, లజ్జ, సుధీర్ మిశ్రా డైరక్షన్ వహించిన ‘్ఛమేలీ’ (కరీనా హీరోయిన్) సినిమాల్లో స్ర్తి సమస్యలను సామాజికాంశాల నేపథ్యంతో చక్కగా వివరించారు. నగేష్‌కుకునూర్ ‘డోర్’ సినిమా కూడా ఇలాంటిదే.
అలాగే మధుర్ భండార్కర్ డైరక్షన్‌లో వచ్చిన ‘పేజ్-3’ సినిమా మెట్రో నగరాల్లోని హైక్లాస్ మహిళల లైఫ్‌స్టయిల్‌ని, ‘్ఫ్యషన్’ సినిమా మోడలింగ్ ప్రపంచంలో అమ్మాయిల జీవన గతుల్ని ఎంతో రియాలస్టిక్‌గా ప్రజెంట్ చేసింది. ప్రదీప్ సర్కార్ డైరక్షన్‌లో వచ్చిన ‘పరిణీత’, ‘లాగా చున్రీమే దాగ్’ సినిమాలు కూడా స్ర్తి సమస్యలను తమదైన కోణంలో విశే్లషించాయి.
తాజాగా హాలీవుడ్ ‘స్టెప్‌మామ్’ ఆధారంగా కరీనా, కాజోల్‌లతో వచ్చిన సినిమా ‘వి ఆర్ ఫ్యామిలీ’! ఈ సినిమా ప్రస్తుత నగర జీవనంలోని కుటుంబ అనుబంధాలను, ఫ్యామిలీ వాల్యూస్ సంరక్షణలో స్ర్తిల పాత్రలను నేటి ఆధునిక ధోరణులనుంచి పరిశీలించింది
అడపా దడపా వచ్చిన ఈ మహిళా చిత్రాలు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఇటీవల ఇబ్బడి ముబ్బడిగా రూపొందుతున్నాయి. ‘నోవన్ కిల్‌డ్ జస్సికా’ సినిమా ఈ కోవలో ప్రస్తావించుకోవాల్సిన సినిమా! న్యూఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో మనుశర్మ అనే ఓ మంత్రి కొడుకు తాగిన మత్తులో చంపేసిన బార్ టెండర్ ‘జెస్సికాలాల్’ జీవితగాధ ఆధారంగా ఈ సినిమా రూపొందది! పూర్తి రియలస్టిక్ ప్యాటర్న్‌లో జెస్సికా హత్యానంతర పరిస్థితులు, ఆమెకు న్యాయం కోసం ఆమె అక్క చేసిన పోరాటం ఈ సినిమా ఇతివృత్తం. రాజ్‌కుమార్ గుప్తా డైరక్షన్‌లో రాణీముఖర్జీ, విద్యాబాలన్ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ఆసక్తిని క్రియేట్ చేసి, మంచి సక్సెసును సాధించింది.
ఇక మధుర్ భండార్కర్ డైరక్షన్‌లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా వచ్చిన సినిమా-‘సాత్ ఖూన్ మాఫ్’! రస్కిన్ బాండ్ రాసిన ‘సుసన్నాస్ సెవెన్ హజ్బెండ్స్‘ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా వెరైటే సినిమాగా విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
‘రాజ్‌నీతి’ దర్శకుడు ప్రకాశ్‌ఝా నిర్మాణంలో అలంకృత శ్రీవాస్తవ డైరెక్షన్‌లో గుల్‌పనాగ్ హీరోయిన్‌గా రిలీజ్ అయిన న్యూఏజ్ స్టోరీ ‘టర్నింగ్ 30’ కూడా మంచి మార్కులనే కొట్టేసింది.!
రానున్న సినిమాలు?
కోల్‌కత్తాలో అదృశ్యమైన తన భర్తకోసం అనే్వషణ జరిపే మహిళ కథతో ‘సుజయ్‌ఘోష్’ రూపొందిస్తున్న సినిమా-కహానీ! విద్యాబాలన్ హీరోయిన్‌గా వస్తున్న ఈ సినిమాకి మహిళా ఇతివృత్తమే ప్రధానం! ఇక, అపర్ణాసేన్ డైరక్షన్‌లో కొంకణాసేన్ శర్మ హీరోయిన్‌గా వస్తున్న ‘ఇతి మృణాళిని’ మరోటి! సినీనటి జీవితగాధ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో గ్లామర్ ప్రపంచంలోని స్ర్తిల స్థితిగతులను చూపించనున్నారు.
ఇవే కాకుండా, ‘ఐయామ్’ అనే టైటిల్‌తో ఓనిర్ డైరెక్షన్‌లో ఓ వెరైటీ సినిమా రూపొందుతోంది. నందితాదాస్, జుహీచావ్లా, మనీషా కోయిరాలా ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ఈ సినిమా మహిళలను వేధిస్తున్న నాలుగు విభిన్న సామాజిక సమస్యలను ఆధునిక దృక్కోణంనుంచి నాలుగు వేర్వేరు కథలుగా తీయడం విశేషం!
ఇక, దివంగత నటి సిల్క్ స్మిత జీవిత గాధ ఆధారంగా వస్తున్న సినిమా- ది డర్టీ పిక్చర్! విద్యా బాలన్ హీరోయిన్ గా ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది..
సక్సెస్ రేటెంత?
మొత్తం ప్రేక్షక జనంలో సగం మంది మహిళా ప్రేక్షకులే! ఒకప్పుడు ‘అత్యంత మహిళాదరణతో నడుస్తున్న చిత్రం’గా చెప్పుకోవడం ఓ విశేషంగా ఉండేది. కానీ గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి సినిమాలన్నీ హీరో డామినేటెడ్‌గా మారి స్ర్తి ఇతి వృత్తాలు వెనక్కి తగ్గాయి. ఆ లోటును పూరిస్తూ ఇప్పుడు వస్తున్న మహిళా చిత్రాల విజృంభణ ఈ దిశగా ఓ ఆశారేఖ! అయితే ఈ విమెన్ సెంట్రిక్ సినిమాలకు బాక్సాఫీసు కలెక్షన్లు ఎలా ఉంటాయి అనేది ఓ పెద్ద ప్రశ్న!
మహిళా ప్రధాన చిత్రాలు ప్రధానంగా బడ్జెట్ పరమైన ఆటంకాలను ఎదుర్కోవడమే కాక, డిస్ట్రిబ్యూషన్, విడుదల పరంగా కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మన సినీ పరిశ్రమకానీ, ప్రేక్షకవర్గం కానీ ‘మేల్ డామినేటెడ్ హీరోయిన్ సినిమాల ప్యాటర్న్’కే ఎక్కువగా అలవాటుపడడం, ఆ సినిమాలకే మార్కెట్ ఉంటుందనే నమ్మకాలతో ఉండడం కూడా ఈ సినిమాలు అంతగా ప్రమోట్ కాకపోవడానికి కారణం అవుతున్నాయి. మరోవైపున హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో బిగ్‌స్టార్ హీరోలు నటించడానికి విముఖత చూపించడం కూడా ఈ సినిమాలకు ఆడియన్స్ తగ్గడానికి కారణంగా మారుతున్నాయి. పైగా ఈ సినిమాలకు ఇంకా ‘ఆర్ట్ ఫిలిం’ ముద్రలే ఉంటున్నాయి. అయితే మంచి కథ, కథనం, ప్రమోషన్ దొరికిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు సూపర్‌హిట్ కూడా అయ్యాయి! విమెన్ సెంట్రిక్ సినిమాలు అనగానే ఏడ్పుగొట్టు కథలనే ముద్ర జనంలో బలంగా ఉండడం, సినిమా అంతటా సందేశాలతో ఊదరగొడతారనే ఇమేజ్ ఏర్పడడం కూడా ఈ సినిమాల సక్సెస్ రేట్‌ని నిర్దేశిస్తున్నాయి. వీటికి తోడు, బాలీవుడ్ సినిమాల్లో హీరోలోగా మూడు గంటల సినిమాని తన భుజాలమీద తీస్కెళ్లగలిగే హీరోయిన్‌లు కూడా మన పరిశ్రమలో లేకపోవడం మరో సమస్య! ఇవన్నీ ఇలావుండగా, సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లలో టికెట్ రేట్లు పెరగడం కూడా ఈ మహిళా చిత్రాల సక్సెస్‌రేటును శాసిస్తున్నాయి. రేట్ల పెరుగుదల వల్ల కుటుంబం మొత్తం సినిమాలకు వెళ్లడాన్ని తగ్గించడం దీనికి కారణం!
మొత్తంమీద మన దేశంలో స్ర్తిల ఎదుగుదలకు ఎన్ని ఆటంకాలున్నాయో, అన్ని ఆటంకాలే ఈ మహిళా చిత్రాలకు కూడా ఉన్నాయి. అయినప్పటికీ పదుల సంఖ్యలో త్వరలో బాలీవుడ్ తెరను ఆక్రమించనున్న ఈ మహిళా చిత్రాలు కొత్త ట్రెండ్‌కు నాంది పలకాలని ఆశిద్దాం!
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment