
టాక్ షోలకి వరవడి ‘ఓప్రా షో’
ఓప్రా విన్ ఫ్రే షో... ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఎన్నో టాక్‌షోలకు మూలం. 'ఈ టాక్‌షోను మొదలుపెట్టి దాదాపు పాతికేళ్లు కావస్తోంది, ఇక 2011 సెప్టెంబరులో ముగింపు పలుకుతాను' అని ప్రకటించింది ఓప్రా.
'ఓప్రా విన్‌ఫ్రే షో' అసలు పేరు 'ఎ.ఎం.షికాగో షో'. 1983లో ఈ టాక్‌షో నిర్వహణలో తొలిసారి పాలుపంచుకుంది ఓప్రా. అప్పట్లో ఈ షోకి పెద్దగా ఆదరణ లేదనే చెప్పాలి. కానీ ఓప్రా వచ్చాక కొన్ని నెలల వ్యవధిలోనే ఈ షో టెలివిజన్ రేటింగుల్లో అట్టడుగు నుంచి అగ్రస్థానానికి చేరుకుంది.
* 1986లో 'ఎ.ఎం.షికాగో షో' పేరు ఓప్రా విన్‌ఫ్రే షో గా మారింది. నాలుగేళ్ల తర్వాత ఈ షోని ఓప్రా సొంతంగా రూపొందించడం మొదలుపెట్టింది. 'హార్పో (HARPO-ఓప్రా అనే పేరుని తిరగేస్తే హార్పో అని వస్తుంది)' పేరిట స్టూడియోను ఏర్పాటు చేసుకుని ఈ షోని తానే నిర్వహించింది.
* ఓప్రా విన్‌ఫ్రే షోకు ఇది రజతోత్సవ సంవత్సరం. ఈ షోను మొదలుపెట్టి 2011, సెప్టెంబర్ నాటికి 25 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ పాతికేళ్లలో 5000కు పైగా ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. ఒక్కో ఏడాదినీ ఒక్కో సీజన్‌గా లెక్కేస్తే అమెరికన్ టెలివిజన్ చరిత్రలో వరసగా 19 సంవత్సరాలపాటు అగ్రస్థానంలో నిలిచిన టాక్‌షో ఇదే.
* మీడియాకు అంతగా ఇంటర్వ్యూలివ్వని మైకేల్‌జాక్సన్ ఓప్రావిన్‌ఫ్రే షోకి హాజరయ్యాడు. జాక్సన్ విటిలిగో(బొల్లి) వ్యాధితో బాధపడుతున్న విషయం ప్రపంచానికి ఈ షో ద్వారానే తెలిసింది.
* ఓప్రా విన్‌ఫ్రే షోని వారానికి దాదాపు ఐదుకోట్ల మంది చూస్తారని అంచనా. షో జరిగేటప్పుడు స్టూడియోలో మూడొందల మంది వీక్షకులుంటారు. అలా ఈ ఇరవై ఐదేళ్లలో ఈ షోని ప్రత్యక్షంగా చూసిన ప్రేక్షకుల సంఖ్య పదకొండు లక్షల పైమాటే!
* ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా దాకా... ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల్లో ఓప్రావిన్‌ఫ్రే షో ప్రసారమవుతోంది.
* ఇప్పటివరకూ ఈ షోలో పాల్గొన్న ప్రముఖుల సంఖ్య 900కు పైమాటే. ఇక గిన్నిస్ రికార్డులు సాధించినవారూ జీవితంలో ఘోరకష్టాలను అనుభవించి మానసిక స్త్థెర్యంతో పైకొచ్చినవారూ... ఇలాంటి వారందరినీ కలుపుకొంటే దాదాపు 28,000 మంది ఈ షోలో పాల్గొన్నారు. అందరికన్నా అత్యధికంగా ప్రముఖ హాలీవుడ్ నటి జూలియారాబర్ట్స్ దాదాపు పదిసార్లు ఈ షోలో పాల్గొంది. పురుషుల్లో ఎక్కువసార్లు ఈ షోలో కనిపించిన ఘనత అమెరికన్ నల్లజాతి గాయకుడు లూధర్ వాండ్రాస్‌కి దక్కింది.
* ఇక దేశాధినేతలూ తదితర ప్రముఖుల విషయానికొస్తే... ముగ్గురు ప్రెసిడెంట్లు(బిల్ క్లింటన్, జార్జిబుష్, ఒబామా) ఈ షోకి హాజరయ్యారు. ఇంకా... నలుగురు (అమెరికా) ప్రథమమహిళలూ ఒక మహారాణి(జోర్డాన్‌రాణి రానియా), మరొక మాజీ మహారాణి, ఆరు దేశాల యువరాజులూ ఆరుగురు యువరాణులూ... ఓప్రా షోకి వన్నెతెచ్చారు.
* 1989లో తన షోకి వీక్షకాదరణ పెంచుకునేందుకో కొత్త ఆలోచన చేసింది ఓప్రా. అలాస్కా రాష్ట్రానికి చెందిన కొందరు బ్రహ్మచారులను ఎంపిక చేసుకుని వారందరినీ ఒకే విమానంలో షికాగోకి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని ముందుగానే ప్రచారసాధనాల ద్వారా హోరెత్తించడంతో ఆ అబ్బాయిలలో తమకు నచ్చేవాడెవరైనా ఉంటారేవోనన్న ఆశతో టీనేజీ అమ్మాయిలు వేలాదిగా ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు.
* 2005లో తన షో చూడ్డానికి స్టూడియోకి వచ్చిన 300 మందికీ పప్పుబెల్లాలు పంచిపెట్టినట్టు కార్లు పంచిపెట్టింది ఓప్రా. అందుకు ఆవిడ తన సొంత సొమ్ము వినియోగించలేదనుకోండీ. తమ సంస్థకు ప్రచారం కోసం ఓ కార్ల కంపెనీ వారు చేసిన ఏర్పాటు అది. పేరు మాత్రం ఓప్రాకే వచ్చింది.
* గత పాతికేళ్లుగా తన కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూస్తున్న ప్రేక్షకుల్లో 300 మందిని 'విశిష్టప్రేక్షకులు' పేరుతో ఎంపిక చేసింది ఓప్రా. ఈఏడాది సిరీస్ ప్రారంభించే నేపథ్యంలో ఆ మూడొందల మందినీ ప్రత్యేకవిమానంలో ఆస్ట్రేలియాకు తీసుకెళ్లి అక్కడే రెండువారాల కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందుకోసం అయ్యే ఖర్చులో సగభాగాన్ని ఆస్ట్రేలియా పర్యాటక శాఖ భరించింది. ఇక ఈ సిరీస్‌కి వచ్చిన తొలి విశిష్ట అతిథి జాన్ ట్రవోల్టా.
...అవండీ ఓప్రా షో 'సమ్'గతులు.

No comments:
Post a Comment