Tuesday, December 6, 2011

చలనచిత్ర రంగంలో చేజారిపోతున్న ప్రముఖ స్థానం

భారతదేశంలో తెరపై బొమ్మలు మాట్లాడడం మొదలై, 80 ఏళ్ళు పూర్తయ్యాయని 'అశీతి' (అంటే సంస్కృతంలో ఎనభై అని అర్థం) పూర్తి ఉత్సవాలు జరుపుకొంటున్నాం. తెలుగు మాటలు, పాటలే ఉన్న తొలి తెలుగు సంపూర్ణ టాకీ 'భక్త ప్రహ్లాద' అసలు సిసలు విడుదల తేదీ ఏమిటన్న దానిపై ఇటీవల ఓ పరిశోధనలో సరికొత్త సాక్ష్యాధారాలు వెలుగు చూశాయి. అయినా, వాటిని పట్టించుకోకుండా పాత నమ్మకమైన సెప్టెంబర్‌ 15నే పట్టుకొని వేలాడుతూ, ఆ రోజే చిత్ర పరిశ్రమ పెద్దలు 'తెలుగు చలనచిత్ర దినోత్సవం' జరిపారు. ఏటేటా, ఆ రోజునే జరుపుతామనీ ప్రకటించారు. పండుగ జరుపుకొనే మాట ఎలా ఉన్నా, సరిగ్గా ప్రస్తుత పరిస్థితిలో తెలుగు సినిమా ఏ పరిస్థితుల్లో ఉందని చూస్తే మాత్రం ఒకింత విచారమే కలుగుతుంది. తగ్గిపోతున్న విజయాలు, దేశ చలనచిత్ర రంగంలో మన చేజారిపోతున్న ప్రముఖ స్థానం ఆందోళన కలిగిస్తాయి.


అవును! తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇటీవల కొద్దికాలంగా సర్రున కిందకు జారిపోతోంది. ఒకప్పుడు దేశం మొత్తంలో అత్యధిక చలనచిత్రాలను నిర్మించి, అగ్ర స్థానంలో నిలిచిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇవాళ ఆ స్థానాన్నీ, స్థాయినీ పోగొట్టుకుంది. ఇది ఎవరో అంటున్న నోటి మాట కాదు. గణాంకాలు, బాక్సాఫీస్‌ వివరాలు చెబుతున్న చేదు నిజం. అందుకు తాజా నివేదికలే సాక్ష్యం. సినిమాల్లో నాణ్యత, వసూళ్ళతో సంబంధం లేకుండా, నిర్మాణమైన చలనచిత్రాల సంఖ్యలో మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమ నిన్న మొన్నటి వరకు అగ్రేసర స్థానంలో నిలిచింది. హిందీ చలనచిత్ర పరిశ్రమ కన్నా మిన్నగా, దేశంలోనే అతి ఎక్కువ సంఖ్యలో సినిమాలు నిర్మించే పరిశ్రమగా మనం ముందుండేవారం. అలాంటిది 2009లో మనం చిత్ర నిర్మాణంలో ప్రథమ స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయాం. ఇటీవల విడుదలైన గణాంక వివరాలను బట్టి చూస్తే, మనం ఇప్పుడు అక్కడ నుంచి మరో మెట్టు కిందకు జారాం. నిర్మాణమైన చిత్రాల సంఖ్య రీత్యా 2010లో మనం ఏకంగా మూడో స్థానానికి పడిపోయాం.


దేశవ్యాప్తంగా తగ్గిన చిత్ర నిర్మాణం


చిత్ర నిర్మాణ సంఖ్యలో తమిళ తంబీలు మనల్ని దాటి ముందుకు వచ్చారు. తమిళ చిత్ర పరిశ్రమ రెండో స్థానానికి ఎగబాకగా, తెలుగు చిత్ర పరిశ్రమ మూడో స్థానానికి దిగజారింది. కేంద్ర సెన్సార్‌ బోర్డు ('సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌' - సి.బి.ఎఫ్‌.సి) 2010వ సంవత్సరానికి గాను జారీ చేసిన వార్షిక నివేదికలో ఈ సంగతులు వెల్లడయ్యాయి. మన దేశం మొత్తం మీద నిర్మాణమైన చలనచిత్రాల సంఖ్య గత ఏడాది కొద్దిగా తగ్గింది. 2009లో మన దేశం మొత్తం మీద, వివిధ భాషలన్నీ కలిపి 1288 చిత్రాలు తయారయ్యాయి. కాగా, ఆ మరుసటి ఏడాది 2010 కల్లా ఆ సంఖ్య కొద్దిగా తగ్గి, 1274కు చేరిందని సెన్సార్‌ బోర్డు వార్షిక నివేదిక తెలిపింది.


తమిళం ముందు! తెలుగు వెనుక!!


మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే, పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. తెలుగులో రూపొందుతున్న చిత్రాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2009లో తెలుగులో నిర్మాణమై, సెన్సార్‌ జరుపుకొని, సర్టిఫికెట్‌ పొందిన చిత్రాల సంఖ్య (నేరు తెలుగు చిత్రాలు, అనువాద చిత్రాలు కలిపి) 218. కాగా, గత ఏడాది - అంటే 2010లో ఇది 181కి పడిపోయింది. ఫలితంగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ దేశం మొత్తం మీద ఏకంగా మూడో స్థానంలోకి పడిపోయింది. పొరుగు రాష్ట్రంలోని తమిళ సోదరులు చిత్ర నిర్మాణ సంఖ్యలో మనల్ని దాటి, ముందుకు వచ్చారు. ''తమిళంలో గడచిన 2010లో 129 నేరు చిత్రాలు వచ్చాయి. అనువాద చిత్రాలు కలపకుండానే ఇన్ని చిత్రాలు నిర్మాణం కావడానికి తమిళ చిత్ర పరిశ్రమలో ఓ రికార్డు'' అని తమిళ చలనచిత్ర చరిత్రకారుడు, జర్నలిస్టు అయిన ఎనిమిది పదుల 'ఫిల్మ్‌న్యూస్‌' ఆనందన్‌ వివరించారు. ఈ ''2011లో ఆగస్టు చివరి నాటికే తమిళంలో 80 నేరు చిత్రాలు వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 140 చిత్రాలు వస్తాయని అంచనా'' అని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 7 ఒక్క రోజునే తమిళంలో ఏడు చిత్రాలు రిలీజవడం అందుకు పెద్ద సూచన.


వెలుగు తగ్గడానికి కారణాలెన్నో!


'అరయంగ కర్ణుడీల్గె నార్గురి చేతన్‌...' అంటు కర్ణుడి చావుకు కారణాల లాగా, తెలుగులో చలనచిత్ర నిర్మాణం తగ్గడానికి కూడా అనేక కారణాలున్నాయి. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మారిపోతున్న రాజకీయ పరిస్థితులు, కొరవడిన ప్రశాంతత, గత రెండేళ్ళుగా తెలుగులో బాక్సాఫీస్‌ హిట్లు గణనీయంగా తగ్గిపోవడం లాంటివి అందులో కొన్ని కారణాలు. అలాగే, అదుపు లేకుండా పెరిగిపోతున్న నిర్మాణ వ్యయంతో సహా అనేకానేక అంతర్గత సమస్యలు సైతం తెలుగు చలనచిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే, ఇది ఆందోళనకరమైన పరిణామమే! తెలుగు పరిశ్రమకు ఇది మంచి ధోరణి కాదనేది అందరూ ఒప్పుకొనే విషయం. నిజం చెప్పాలంటే, ఇవాళ తెలుగు చిత్ర సీమలో రెగ్యులర్‌గా సినిమాలు తీస్తున్న నిర్మాతలు కూడా చాలా తక్కువే! సినిమాయే లోకంగా బతుకుతూ, అంకితభావంతో ఒకదాని తరువాత మరొకటిగా సినిమాలు తీస్తున్న చిత్రనిర్మాతలు ఇవాళ ఆట్టే లేరు. ''సినీ వ్యాపారమే తప్ప, మరో వ్యాపారం తెలియని నిర్మాతలు ఇవాళ పరిశ్రమలో నూటికి 10 మంది మించి లేరు. నిర్మాతల మండలిలో 928 మంది నిర్మాతలున్నారు. కానీ, వారిలో ఎక్కువ మంది ఒకటి రెండు సినిమాలు నిర్మించి, ఆగిపోయినవాళ్ళే! అయిదు, అంతకన్నా ఎక్కువ సినిమాలు తీసినవాళ్ళ సంఖ్య తక్కువ'' అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి ఇటీవలే అధ్యక్షుడైన నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ సైతం పేర్కొన్నారు.


కళ్ళు తెరవాల్సిన తరుణం


ఏతావాతా, కొన్నేళ్ళుగా ఏటా అత్యధిక చిత్రాలు నిర్మిస్తున్న ఘనత వహించిన మన తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడిలా ఇలాంటి అనేకానేక కారణాల వల్ల ఆ ప్రత్యేకతను కోల్పోవడం విచారకరమే. సినిమాల కథ కథనాల్లో, నాణ్యతలో, జాతీయ స్థాయి గుర్తింపు, అవార్డుల విషయంలో ఇప్పటికే మనం వెనుకబడి ఉన్నామన్నది సినీ ప్రియులం జీర్ణించుకోలేకపోతున్న వాస్తవం. గోరుచుట్టు మీద రోకటి పోటులా ఇప్పుడు చిత్ర నిర్మాణ సంఖ్యలోనూ వెనుకబడ్డాం. ఇప్పటికైనా మన నిర్మాతలు, దర్శకులు, హీరోలు, సాంకేతిక నిపుణులు కళ్ళు తెరవాలి. వాస్తవ పరిస్థితుల్ని గుర్తించాలి. చిత్ర నిర్మాణం ఎందుకు తగ్గిపోతోందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. చిత్ర నిర్మాణం తగ్గిపోవడానికి కారణమవుతున్న తమ లోటుపాట్లనూ, కొండకచో వ్యవహార శైలినీ సరిదిద్దుకోవాలి. అప్పుడే మనం మళ్ళీ పూర్వ ప్రతిష్ఠను సంపాదించుకోగలుగుతాం. సినీ వ్యాపార ధోరణుల విశ్లేషణలో అపార అనుభవం ఉన్న కాట్రగడ్డ నరసయ్య కథనం ప్రకారం ''ఈ ఏడాదిలో ఆగస్టు నెలాఖరుకు తెలుగులో 81 నేరు చిత్రాలు, 89 అనువాద చిత్రాలు విడుదలయ్యాయి.'' దాన్నిబట్టి చూస్తే, గత ఏడాది కన్నా ఈసారి తెలుగులో చలనచిత్ర నిర్మాణాల సంఖ్య మెరుగు కావచ్చని ఓ చిరు ఆశాదీపం మిణుకు మిణుకుమంటోంది.

నాయికల జీవిత చిత్ర మాలిక

ఆదివారం అనుబంధం - Sat, 1 Oct 2011.
.సిల్క్‌ స్మిత జీవితకథ ఆధారంగా తీస్తున్న 'డర్టీ పిక్చర్‌' ఇప్పుడు సినిమా రంగంలో చర్చనీయంగా వుంది. దక్షిణాది చిత్రాలలో పచ్చి శృంగార నృత్యాలకు మారు పేరుగా ఉపయోగపడిన సిల్క్‌ స్మిత ఎంత గడించిందో గాని ఆఖరుకు అర్థంతరంగా ఆత్మహత్య చేసుకుని కనుమరుగైపోయింది. ఆవిధంగా విషాదాంతమైన నాయికల జాబితాకు అంతేలేదు. మీనా కుమారి, సావిత్రి, శోభ, ఫటాఫట్‌ జయలక్ష్మి, విజయశ్రీ.... ఇలా ఎందరినైనా చెప్పొచ్చు. హాలివుడ్‌లోనైతే మర్లిన్‌ మన్రో మరణం ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంత దారుణంగా గాకున్నా వ్యాధిగ్రస్తులై మరణించిన మహిళా తారల విషయంలోనూ బోలెడు మానసిక ఘర్షణ, మానవీయ వేదన కనిపిస్తాయి. మరోవైపునుంచి చూస్తే జయప్రద, సబిత వంటి వారిని పూర్వ భర్తలు వేధించి కోర్టులకెక్కిన తీరు కూడా అందరికీ తెలుసు. సబిత కేసులోనైతే హైకోర్టు సంచలన తీర్పునే ఇచ్చింది. తారామణుల ప్రతిభకు ప్రతిబంధకాలుగా తయారైన పురుషుల మూలంగానే ఇన్ని వైపరీత్యాలు సంభవించాయి. అందుకే చిత్ర పరిశ్రమ ఎప్పటికప్పుడు కథానాయికల వాస్తవ జీవితాలను ఆధారం చేసుకుని కథలల్లుతూ వుంటుంది. ఇప్పుడు సిల్క్‌ స్మిత కథ తీస్తున్నప్పటికీ గతంలోనూ బాగా ప్రసిద్ధి పొందిన ఇలాంటి చిత్రాలున్నాయి.


మీనాకుమారి స్వంత కథ..... నాయికల నిజ జీవితాల ఆధారంగా తీసిన చిత్రాలలో ముందుగా చెప్పుకోవలసింది మీనాకుమారి పాత్రనే. హిందీ సినిమా రంగానికి మకుటం లేని మహారాణిగా (తెలుగులో సావిత్రిని మించి) వెలుగొందిన మీనా కుమారి అసలు పేరు మహజబిన్‌ బానో. తల్లిదండ్రులు కూడా సినీ రంగానికి చెందిన వారు కావడంతో ఆమెను బాలతారగా ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే ఆమె దర్శక రచయిత కమల్‌ ఆమ్రోహీ దృష్టిలో పడింది గాని మొదట్లో వీలు పడలేదు. తర్వాత కాలంలో ఆయన ఆమెను గుర్తించడం, అవకాశాలివ్వడం జరిగింది.1952లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మీనాకుమారి మొత్తం తొంభై చిత్రాల్లో నటించారంటే ఆమె ఖ్యాతి అర్థం చేసుకోవచ్చు.ఇంతకూ కమల్‌ను పెళ్లి చేసుకున్నాక ఆమె అత్తగారి వూరు ఆమ్రోహీ వెళ్లింది. తమ ప్రేమ కథనే ఇతివృత్తంగా తీసుకుని 'దయారీ' చిత్రాన్ని పెళ్లయిన మరుసటి ఏడాదిలోనే నిర్మించింది. మరో మూడేళ్ల తర్వాత 'పాకిజా' అన్న చిత్రాన్ని మొదలెట్టారు గాని పూర్తి కావడానికి పదహారేళ్లు పట్టింది. కొన్నేళ్లు దాంపత్య జీవితం గడిపాక వారు విడిపోయారు. ఆమె సూపర్‌ స్టార్‌ కావడంతో కొందరు కుట్ర పన్ని దూరం చేశారని ఆమ్రోహీ అంటుండేవారు. విడిపోయిన కారణంగా 'పాకిజా' చిత్రం కూడా ఆగిపోయింది. ఈ లోపల జీవిత సమస్యలు తట్టుకోలేని మీనాకుమారి మద్యపానానికి బానిసవడం, ఆరోగ్యం బొత్తిగా క్షీణించి విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకోవడం జరిగాయి. మళ్లీ 1971-72 మధ్య ఆమెనే చొరవ తీసుకుని కమల్‌ ఆమ్రోహీతో మాట్లాడి 'పాకిజా'ను పూర్తి చేశారు.



దేశంలో నిర్మాణమైన సంగీత కళాభరిత చిత్రంగా 'పాకిజా' పేరొందింది. అది ఘన విజయం సాధించిన తర్వాత 'పాకిజా2' తీయాలని కూడా మీనాకుమారి ప్రతిపాదించినప్పటికీ ఆరోగ్యం సహకరించలేదు చివరకు ఆమె 1972 మార్చి 31న విషాదకరంగా మరణించింది. కాకపోతే తన ప్రేమ కథను తానే నిర్మించుకున్న నాయికగా మిగిలిపోయింది.


స్మితాపాటిల్‌...శ్యామ్‌ భూమిక


తారామణుల జీవితాల ఆధారంగా నిర్మితమైన చిత్రాల్లో బాగా ఆదరణ పొందింది శ్యాం బెనగల్‌ తీసిన 'భూమిక'. మరాఠీ నాటక సినీ నటి హంసా వాడ్కర్‌ జీవితకథ ఈ చిత్రానికి ఆధారం. భూమిక అంటేనే పాత్ర. హంసా వాడ్కర్‌ వివాదాస్పద సంచలన జీవితం గడిపింది.మామూలు మహిళలు పాటించే హద్దులు దాటి తన స్థానం నిలబెట్టుకోవడానికి పెనుగులాడింది.ఈ కథనే శ్యాం బెనగల్‌ ఎంచుకున్నారు. నాయికగా నటించిన స్మితా పాటిల్‌ అద్భుత నటన ఆ పాత్రకు ప్రాణం పోసి పురస్కారాల వర్షం కురిపించింది. బాలివుడ్‌ నటి ఉష(స్మిత) ఒక సంప్రదాయ గాయని కుమార్తె. ఆ గాయని వ్యసనపరుడు, దుర్మార్గుడు అయిన ఒక సనాతన బ్రాహ్మణున్ని పెళ్లాడి అనేక కష్టాలనెదుర్కొంటుంది. అతను చనిపోయాక తల్లి వద్దంటున్నా ఉషను సినిమాల్లో వేషాల కోసం ముంబాయి తీసుకుపోతాడు వాళ్లను కనిపెట్టుకుని వుంటున్న నౌకరు కేశవ్‌ దాల్వి (అమల్‌ పలేకర్‌). అమ్మమ్మ ఆనందం, అమ్మ ఆవేదనల మధ్య ఉష నటిగా మారుతుంది. చిన్నప్పటి నుంచి తనపై కన్నేసిన కేశవ్‌నే పెళ్లి చేసుకుంటుంది. కొంత అనివార్యంగా కొంత అభిమానంగా. ఈ పెళ్లి తల్లికి ఇష్టం లేకున్నా ఉష ఎదిరించి చేసుకుంటుంది. అయితే అతను భర్తగా గాక నౌకరుగానే వ్యవహరిస్తూ తన వల్ల ఆర్థిక లాభమే ఆశిస్తున్నాడని అనతికాలంలోనే అర్థం చేసుకుంటుంది. కేశవ్‌ అనేక వ్యాపారాలు చేసి విఫలమై చివరకు ఆమెకు తార్పుడుగాడుగా తయారవుతాడు. హీరో రంజన్‌ (అనంత నాగ్‌)కు ఆమెను దగ్గర చేయాలని ప్రయత్నించి మళ్లీ తనే అసూయకు గురవుతాడు. ఈ ఘర్షణ భరించలేని ఉష ఏదో లోకంలో వున్నట్టుండే స్వార్థపర దర్శకుడు సునీల్‌ వర్మ (నసీరుద్దీన్‌ షా)కు కాస్త దగ్గరవుతుంది గాని ఆమె ఘర్షణ తగ్గదు. తర్వాత వినాయక్‌ కాలే (అమ్రిష్‌ పురి) అనే కోటీశ్వరుడికి అనధికార ద్వితీయ కళత్రమై కొంత గౌరవం పొందాననుకుంటుంది. కాని ఆ ఇంట్లో తనకు స్వేచ్ఛా స్వంతత్రాలు బొత్తిగా లేవని, కాలే వన్నీ బూటకపు మర్యాదలనీ తెలిసి మళ్లీ గతిలేక కేశవ్‌ ద్వారానే అక్కడి నుంచి బయటపడుతుంది. ''పడక మారుతుంది, వంటిల్లు మారుతుంది. మగాళ్ల ముసుగులు మారతాయి. కాని మగాళ్లు మాత్రం మారరు.'' అని కేశవ్‌ భార్య అంటుండగా మళ్లీ పాత జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ చిత్రం 1978లో స్మితా పాటిల్‌కు జాతీయ ఉత్తమ నటి అవార్డు తెచ్చిపెట్టడమే గాక శ్యాం బెనగళ్‌ గిరీష్‌ కర్నాడ్‌, సత్యదేవ్‌ దూబేలకు ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారంకూడా తెచ్చింది.


సిల్క్‌ స్మిత జీవితమే 'డర్టీ పిక్చర్‌'


ఇప్పుడు ఏక్తా కపూర్‌, మిలన్‌ లూథ్రియాలు దక్షిణాది తార సిల్క్‌ స్మిత కథపై తీస్తున్న 'డర్టీ పిక్చర్‌'లో నాయికగా విద్యా బాలన్‌ నటిస్తుంది. గతంలో పాప వంటి చిత్రాల్లో గంభీరమైన పాత్రలకు పేరొందిన విద్యాబాలన్‌ స్మితగా నప్పుతుందా ఆమె ఆకారం అలా వుంటుందా వగైరా సందేహాలు కొందరు వ్యక్తం చేసినా విద్య వాటన్నిటినీ కొట్టిపారేస్తున్నది. స్మిత అసలు పేరు విజయలక్ష్మి. నైలెక్స్‌ నళిని, పటాపట్‌ జయలక్ష్మి లాగే సిల్క్‌ స్మిత అన్నది కూడా ఆమెను పాపులర్‌ చేయడానికి తగిలించిన పేరు. నల్లగా లావుగా వుండే 'సిల్క్‌' లేని కమర్షియల్‌ చిత్రాలే ఒకప్పుడు దక్షిణాదిన వుండేవి కావు. హీరోను చూసి గాక సిల్క్‌ డాన్సు నెంబర్‌ వుందో లేదో తెలుసుకున్నాకే బయ్యర్లు కొంటారని అంటుండేవారు. ఆమె పారితోషికం కూడా చాలా భారీగా వుండేది. 'వసంత కోకిల, సీతాకోక చిలుక, బావ - బావ మరిది...' వంటి ఎన్నో చిత్రాలు ఆమె చుట్టూ తిరిగాయి కూడా. అయితే ఇంతటి ప్రసిద్ధి గల ఆమె నిజ జీవితం మాత్రం బాధామయం. చిన్న చిన్న పాత్రలు వేసే రోజుల్లో ఆమెను గుప్పిట్లో పెట్టుకున్న మూర్తి అనే ఆసామి తర్వాత కాలంలోనూ వేధిస్తూ డబ్బు గుంజుతుండేవాడు. పదేళ్ల పాటు కనకవర్షం కురిపించిన ఆ తారను అనునిత్యం వేధిస్తుండేవాడట. తట్టుకోలేక ఆమె అనేక సార్లు ఆత్మహత్యా యత్నాలు కూడా చేసింది. చివరకు విషాదకరంగా ఉరి వేసుకుని మరణించింది.


సిల్క్‌ స్మిత పాత్ర వేయడం తనకేమీ కష్టంగా లేదని విద్యాబాలన్‌ ధీమాగా చెబుతున్నది. ప్రేక్షకులకు తెలిసిందల్లా ఆమె డాన్సులు, పాటలే. ఆమె మ్యానరిజమ్స్‌ కూడా వారు పూర్తిగా గమనించి వుండరు. ఏ ఇందిరాగాంధీ పాత్రనో వేయాలంటే ఆమె గురించిన ప్రతి విషయమూ ప్రజలకు తెలిసి వుండే అవకాశం వుంది. అమితాబ్‌ బచన్‌ వేషం వేయాలన్నా అంతే కష్టం. కాని సిల్క్‌ స్మిత విషయానికి వస్తే ఆ సమస్యలేమీ వుండవు. ఆమెను గురించి నేను ఏమనుకుని ఎలా నటించాలనుకున్నానో అలాగే నటించేస్తాను అన్నారు విద్య. సిల్క్‌ జీవితాన్ని ప్రభావితం చేసిన ముగ్గురు పురుషులుగా నసీరుద్దీన్‌ షా, తుషార్‌ కపూర్‌, ఇమ్రాన్‌ హస్మీ నటిస్తున్నారు. అన్నట్టు విద్యా బాలన్‌ గతంలోనూ నిజ జీవిత పాత్ర ధరించకపోలేదు. 'నో బడీ కిల్డ్‌ జెస్సీకాలాల్‌' అన్న చిత్రంలో ఆమె అక్క షబ్రినాలాల్‌ పాత్ర పోషించింది.


నాయిక శారదనా షీలానా?


ఇప్పుడు మళయాలంలో జయరాజ్‌ రూపొందిస్తున్న 'నాయిక' చిత్రం కూడా అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం మూడు సార్లు ఊర్వశి పురస్కారం పొందిన శారద కథ అని అనుకుంటున్నారు. తెలుగు తార అయినప్పటికీ మళయాల చిత్రాల ద్వారా జాతీయ కీర్తి నార్జించిన శారద ఆ పిమ్మటే ఇంట గెలిచారు. శారద జీవితం కూడా పూలపాన్పు కాదు. మొదట్లో హాస్య పాత్రలలో కనిపించిన శారద 'తులాభారం' (తెలుగులో మనుషులు మారాలి) తర్వాతనే తారాపథం చేరుకోగలిగారు. హాస్యనటుడు చలం ను పెళ్లి చేసుకున్న శారద చాలా చేదు అనుభవాల తర్వాత విడిపోయారు. గ్లామర్‌ తార కాకున్నా 70, 80 దశకాలలో శారద ఒక ప్రత్యేక స్థానం పొందారు. క్రాంతికుమార్‌ శారద తర్వాత మహిళా ప్రధాన పాత్రల్లో శోభన్‌బాబుతో పలు చిత్రాల్లో నటించడమే గాక 'ప్రతిధ్వని' తర్వాత నాయికా ప్రధాన పాత్రలకు మారుపేరుగా వెలుగొందారు. హక్కుల కోసం పోరాడే మహిళ అంటే శారద అన్న పేరు పొందారు. అలాంటి ప్రముఖ నటి కథ అంటే అందరిలో ఆసక్తి రేకెత్తింది. అయితే అందులో నిజం లేదని శారదతో సహా సంబంధిత వ్యక్తులందరూ ఖండించారు. ఎన్టీఆర్‌తో 'భలేతమ్ముడు, నేనే మొనగాణ్ని' వంటి చిత్రాలలో నటించిన మళయాల తార షీలా కథ ఆధారంగా 'నాయిక' రూపొందుతున్నదట. పద్మప్రియ ఈ పాత్రను పోషిస్తున్నారు. శారద కూడా ఇందులో నటిస్తున్నారు. శర్వానంద్‌, జయరామ్‌, మమతా మోహన్‌దాస్‌ ఇతర పాత్రధారులు. తెలుగులో ఇలాంటి చిత్రాలు సూటిగా తీసిన ఉదాహరణలు లేవు గాని 'సీతామాలక్ష్మి', అంతకన్నా ఎక్కువగా 'శివరంజని' చిత్రాల్లో నాయికలను వెంటాడే శాడిస్టుల కథలను చూపించారు. అయితే అవి కూడా సంసార పక్షంగా తీయడమే తప్ప భూమికలో వలె ఆఫ్‌ బీట్‌ తరహాలో ప్రయత్నించే సాహసం జరగలేదు. ఇక ముందు కూడా జరక్కపోవచ్చు. ఎందుకంటే ఫార్ములా వలయాన్ని ఛేదించడానికి మన పరిశ్రమ నియమాలు బొత్తిగా అంగీకరించవు. పైగా హీరోల కథలను తీసినప్పుడు గొప్పగానే వుంటుంది. నాయికలపై కేంద్రీకరిస్తే హీరోలు బొత్తిగా ఒప్పుకోకపోవచ్చు. అదీ సంగతి. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన సిల్క్‌ స్మిత కథ ఇప్పుడు ఎలా తీస్తారో చూడాల్సిందే. కొద్ది కాలంలోనే అన్ని భాషల చిత్రాలను వూపేసిన దివ్య భా రతి కథ కూడా మర్చిపోవలసింది కాదు. ఎంతైనా ఇది పురుషాధిక్య ప్రపంచం గనకే నాయికల కథలే సినిమాలవుతుంటాయి. అందులో ఆవేదనతో పాటు ఆకర్షణా వుంటుందనే అంచనాతో.

దక్షిణాదిలో సినిమాల శ్రీకార గాధ

ఆదివారం అనుబంధం Sat, 22 Jan 2011,
అవునన్నా, కాదన్నా సినిమా ఇవాళ జన జీవితంలో ఓ ప్రధానమైన భాగం. ప్రజల కట్టూ బొట్టూ, ఆటా పాటా, మాటా - ఇలా అన్నిటినీ అనూహ్యంగా ప్రభావితం చేస్తున్న శక్తిమంతమైన మాధ్యమం. అలాంటి సినిమాలకు మన దేశంలో నూరేళ్ళకు పైగా చరిత్ర ఉంది. దాదాసాహెబ్‌ ఫాల్కే తీసిన 'రాజా హరిశ్చంద్ర' (1913)కు మునుపే కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఫాల్కే 'రాజా హరిశ్చంద్ర'ను తొలి భారతీయ చలనచిత్రంగా చరిత్రకారులు తీర్మానించారు. మరి, కేవలం మన దక్షిణాది వరకు తీసుకుంటే, ఇక్కడ తొలి చలనచిత్ర ప్రయత్నం ఎవరు, ఎప్పుడు, ఎలా చేశారు?


దక్షిణ భారతదేశంలో తొలి పూర్తి నిడివి చలనచిత్రాన్ని రూపొందించిన వ్యక్తి - ఆర్‌. నటరాజ ముదలియార్‌గా ప్రసిద్ధుడైన రంగస్వామి నటరాజ ముదలియార్‌ (1885 - 1972). నిజానికి, ఆయన సినిమాలతో అసలు సంబంధమే లేని వ్యక్తి అంటే ఆశ్చర్యం కలుగుతుంది. మద్రాసులోని ప్రసిద్ధ థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఆయన ఆటోమొబైల్‌ విడిభాగాల డీలర్‌. వెల్లూరులోని వ్యాపారస్థుల కుటుంబంలో 1885 జనవరి 26న ఆయన జన్మించారు. తండ్రి పేరు - రంగస్వామి. పెద్దమనిషిగా పేరున్న వ్యాపారి. మెట్రిక్‌ దాకా చదువుకున్న నటరాజ ముదలియార్‌ తన తండ్రి లాగే వ్యాపార రంగంలోకి దిగారు. రాజధాని అయిన మద్రాసుకు మారి, సమీప బంధువూ, ధనికుడూ అయిన ఎస్‌.ఎం. ధర్మలింగం ముదలియార్‌తో కలసి 'వాట్సన్‌ అండ్‌ కంపెనీ'ని స్థాపించారు. బ్రిటీషు సైకిళ్ళను దిగుమతి చేసుకొని అమ్మేవారు.


మోటారు వ్యాపారం నుంచి మూకీలకు!


అప్పట్లో ఒక్కో సైకిల్‌ 25 రూపాయలకు అమ్ముడయ్యేది. గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్‌ అంటే ఎంతో వింతగా చూస్తూ, 'రబ్బరు బండి' అని పిలిచేవారట! మొత్తానికి, నటరాజ ముదలియార్‌ సైకిళ్ళ వ్యాపారం బాగా వృద్ధిలోకి వచ్చింది. అలా అయిదేళ్ళు గడిచాక, 1911లో ఆ వ్యాపార భాగస్వాములు మరో అడుగు ముందుకు వేశారు. అమెరికన్‌ కార్లు, ఆటోమొబైల్‌ విడిభాగాల దిగుమతి వ్యాపారం చేసే విదేశీ సంస్థ 'రోమర్‌, డాన్‌ అండ్‌ కంపెనీ' అనే సంస్థను కొన్నారు. మోటారుకార్లను దిగుమతి చేసుకోవడం, అమ్మడం ప్రారంభించారు. అప్పట్లో మద్రాసులో 'అడిసన్‌ అండ్‌ కంపెనీ' ఒక్కటే అమెరికన్‌ కార్ల వ్యాపారం సాగించేదట! దాంతో, అమెరికన్‌ కార్లను అమ్మిన తొలి భారతీయుడయ్యారు - నటరాజ ముదలియార్‌. ఆ రోజుల్లో ఒక్కో కారు వెల 1000 రూపాయలే!



అప్పట్లో పాశ్చాత్య దేశాల మూకీ చిత్రాల ప్రదర్శనలను చూశాక, మన దేశంలోనూ చలనచిత్ర నిర్మాణాల తొలినాళ్ళ విశేషాలను తెలుసుకున్నాక నటరాజ ముదలియార్‌కు ఒక ఆలోచన వచ్చింది. మద్రాసులో సైతం ఇలాంటి సైలెంట్‌ ఫిల్ములు తీసే అవకాశం ఉందని ఆయన గ్రహించారు. చిత్ర నిర్మాణంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో లార్డ్‌ కర్జన్‌ భారతదేశానికి గవర్నర్‌ - జనరల్‌గా, వైస్రారుగా వ్యవహరిస్తుండేవారు.



ఆయన నిర్వహించే దర్బార్‌లనూ, సామాజిక కార్యకలాపాలనూ న్యూస్‌ రీలుగా బ్రిటీషు సినిమాటోగ్రాఫర్లు చిత్రీకరించేవారు. అలాంటి కెమేరామన్లలో ఒకరు - స్టీవర్ట్‌ స్మిత్‌. ఆయన పూనాలో ఓ సినిమా హాలు కూడా నడిపేవారు. ఆయనను ముదలియార్‌ సంప్రదించారు. సినిమాటోగ్రఫీలోని ప్రాథమిక అంశాలు నేర్పాల్సిందిగా అభ్యర్థించి, ఒప్పించారు. పూనాకు వెళ్ళి, స్మిత్‌ను కలుసుకున్నారు. లార్డ్‌ కర్జన్‌ 1903 నాటి దర్బార్‌కు అధికారిక సినిమాటోగ్రాఫరైన స్మిత్‌, మూవీ కెమేరాతో ఎలా చిత్రీకరణ జరపాలో కొద్ది రోజుల పాటు నటరాజ ముదలియార్‌కు నేర్పారు. సినిమా రూపకర్తగా మారాలని ఆశించిన నటరాజ ముదలియార్‌ అక్కడ కొన్ని దృశ్యాలు చిత్రీకరించారు. పూనాలోని స్మిత్‌ నివాసంలో ఓ రాత్రి వేళ విందు అనంతరం ఆ దృశ్యాలను ప్రదర్శించి చూశారు.


దక్షిణాదిలో తొలి స్టూడియో


అటుపైన నటరాజ ముదలియార్‌ మద్రాసుకు తిరిగి వచ్చేశారు. అప్పటికి తెలుగునేలలో అత్యధిక భాగం మద్రాసు రాజధానిగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండేది. మద్రాసు వచ్చిన ఆయన, తన వ్యాపార సహచరుడు ధర్మలింగం ముదలియార్‌తో కలసి మిత్రులనూ, వ్యాపార సహచరులనూ వాటాదారులుగా చేర్చుకొని, 1916లో 'ఇండియన్‌ ఫిల్మ్‌ కంపెనీ' పేరిట ఓ చలనచిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పారు. అప్పట్లో అందరూ ఇంగ్లీషు తరహా పేర్లు ఎక్కువగా పెడుతుంటే, ఆయన అందుకు భిన్నంగా భారతీయ నామం పెట్టడం గమనార్హం.



అలాగే, దక్షిణ భారతదేశంలోని తొలి స్టూడియోను సైతం మద్రాసులో నటరాజ ముదలియార్‌ బృందమే నెలకొల్పింది. మద్రాసులోని పరశువాక్కమ్‌ ప్రాంతంలో మిల్లర్స్‌ రోడ్డులో నెలకొన్న పెద్ద తోట బంగళా 'టవర్‌ హౌస్‌'లో స్టూడియో ఏర్పాటు చేసింది. (ప్రస్తుతం విద్యార్థుల హాస్టళ్ళు, హోటళ్ళు, దుకాణాలు, సినిమా హాళ్ళు, ఆసుపత్రులు, కల్యాణ మండపాలు, వాహనాల రద్దీతో ఎంతో ఇరుకుగా తయారైన ఆ రోడ్డులో 95 ఏళ్ళ క్రితం ఓ స్టూడియో ఉండేదంటే ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది). అప్పట్లో తంజావూరు జిల్లాలో ధనిక భూస్వామి కుటుంబానికి చెందిన తిరువయ్యూర్‌ మూపనార్‌ వద్ద లండన్‌ నుంచి కొని తెచ్చిన విలియమ్‌సన్‌ 35 ఎం.ఎం. సైలెంట్‌ మూవీ కెమేరా, ప్రింటర్‌ ఉండేవి. ఆయన వద్ద నుంచి వాటిని 1800 రూపాయలకు నటరాజ ముదలియార్‌ కొన్నారు.


తొలి మూకీకి తంటాలు


అయితే, ఫిల్మును కడిగి, నిర్మాణానంతర కార్యకలాపాలు జరిపే లేబొరేటరీని మాత్రం వాతావరణం చల్లగా ఉండి, అలాంటి పనులకు అనుకూలించే బెంగుళూరులో నెలకొల్పారు. ఫిల్ముల ప్రాసెసింగ్‌ పనిలో శిక్షణ పొందిన నారాయణస్వామిని ఆ లేబొరేటరీకి పెద్దగా నియమించారు. అప్పట్లో చిత్రీకరణ జరపగానే, చిత్రీకరణ ముగిసిన ఫిల్ము రోల్స్‌ను ఏ రోజుకు ఆ రోజు శరవేగంగా బెంగుళూరుకు పంపేసేవారు. ఎక్స్‌పోజ్‌ అయి, అలా వచ్చిన రీళ్ళను బెంగుళూరులో ప్రాసెసింగ్‌ చేసేవారు. నటరాజ ముదలియార్‌ వారానికి ఒకసారి బెంగుళూరుకు వెళ్ళి, పురోగతిని కనుక్కునేవారు.



ఆనాటి తమిళ నాటక రంగ పునరుజ్జీవనంలో ముఖ్యుడైన తన మిత్రుడు పమ్మల్‌ సంబంద ముదలియార్‌ను ఏ కథ తెరకెక్కించాలనే విషయంలో సలహా అడిగారు. భావోద్వేగాలు, పోరాటం, కొద్దిపాటి సెక్స్‌ అప్పీలు కూడా ఉన్న కథనే తెరకెక్కించాల్సిందని చెప్పి, ఆ మూడూ ఉన్న ద్రౌపదీ, కీచక వృత్తాంతాన్ని సినిమాగా తీయాల్సిందిగా ఆయన సలహా ఇచ్చారు. తొలి ప్రయత్నంలో అలాంటి కథను సినిమాగా తీయడం సరైనది కాదని కొందరు బంధువులు అభ్యంతరం చెప్పినప్పటికీ, నటరాజ ముదలియార్‌ పట్టుదలతో ముందుకు సాగి, 'కీచక వధమ్‌' ప్రారంభించారు. కానీ, ఆయన ప్రాథమికంగా రచయిత కాదు. దాంతో, తన సన్నిహిత మిత్రుడూ - రంగస్థల ప్రముఖుడూ అయిన సి. రంగవడివేలు అనే వకీలును ఆశ్రయించారు. సినిమాలో పాత్రలు పోషించే నటీనటులకు శిక్షణనిచ్చే బాధ్యతను కూడా నిర్వహించారు. అలా దక్షిణ భారతదేశంలో కెల్లా తొలి చలనచిత్రం 'కీచక వధమ్‌' (1916) తయారైంది.


గాంధీ కుమారుడితో టైటిల్‌ కార్డుల రచన


మహాభారతంలోని కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 35 రోజుల్లో పూర్తయింది. అప్పట్లో సినిమా షూటింగ్‌ చేయడానికి విద్యుత్‌ దీపాలు కూడా అందుబాటులో లేవు. అందుకే, బంగళాలో ఓ పందిరి లాంటిది వేయించి, దానికి పై కప్పు వేయకుండా తెల్లటి వస్త్రాన్ని కట్టారట! ఆ వస్త్రం గుండా వచ్చిన సూర్యరశ్మి కాంతిలో చిత్రీకరణ జరిపేవారట! రంగస్థల నటీనటులైన రాజా ముదలియార్‌తో కీచక పాత్ర, జీవరత్నంతో ద్రౌపది పాత్ర వేయించారు. అప్పట్లో ఈ సినిమా తీయడానికి రూ. 35 వేల దాకా ఖర్చయిందట! ఆ రోజుల్లో ఓ సినిమాకు అంత డబ్బు ఖర్చు కావడమంటే చాలా ఎక్కువ. చిత్ర నిర్మాణంలో నటరాజ ముదలియార్‌కు అప్పటికి పెద్దగా అనుభవం లేదనడానికి అంత ఖర్చు కావడమే సాక్ష్యం.



1917లో చిత్రీకరణ జరుపుకొన్న ఈ మూకీ చిత్రం 1918 జనవరిలో మద్రాసులోని 'ఎల్ఫిన్‌స్టన్‌ సినిమా' హాలు (మౌంట్‌రోడ్‌లోని ఇప్పటి కొత్త శాసనసభ ప్రాంగణం ఎదురుగా ఉండేది)లో విడుదలైనట్లూ, రెండు వారాల పాటు ఆడినట్లూ చరిత్రకారులు చెబుతున్నారు. ఆ చిత్రం కరాచీతో సహా భారతదేశ వ్యాప్తంగానే కాక, రంగూన్‌ (బర్మా), సిలోన్‌, ఫెడరేటెడ్‌ మాలే స్టేట్స్‌లో, సింగపూర్‌లో, ఇతర ఇరుగు పొరుగు దేశాల్లో సైతం విజయవంతంగా ఆడింది. అప్పట్లోనే ఆ సినిమా మొత్తం రూ. 50 వేల దాకా వసూళ్ళు చేసిందట! అంటే, రూ. 15 వేలు లాభమన్నమాట. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం కిందే లెక్క.



అప్పట్లో సినిమా మొత్తం శబ్దరహితంగా సాగేది కాబట్టి, మాటలు, పాటలు లేని ఆ మూకీ చిత్రాల్లో తెరపై జరుగుతున్నదేమిటో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉండేది. దాంతో, దృశ్యానికీ దృశ్యానికీ మధ్య 'ఇంటర్‌ - టైటిల్‌ కార్డుల'లో కథా సందర్భాన్నీ, సన్నివేశాన్నీ, కొన్ని ముఖ్యమైన సంభాషణలనూ తెరపై చూపేవారు. నటరాజ ముదలియార్‌ చిత్రాల్లోని టైటిల్‌ కార్డులు తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఉండేవి. దాంతో, ఈ మూకీ చిత్రాలను ఏ ప్రాంతంలోని, ఏ భాష ప్రజలు చూసినా కథ సులువుగా అర్థమయ్యేది.




మహాత్మా గాంధీ కుమారుడూ, తరువాతి రోజుల్లో ప్రసిద్ధ పాత్రికేయుడూ, వార్తాపత్రిక ఎడిటరూ అయిన దేవ్‌దాస్‌ గాంధీ ఈ చిత్రానికి హిందీ టైటిల్స్‌ రాశారు. ఇక, మద్రాసు నగర వైద్య ప్రముఖుల్లో ఒకరూ - నటరాజ ముదలియార్‌కు సమీప బంధువూ అయిన డాక్టర్‌ ఎం.ఆర్‌. గురుస్వామి ముదలియార్‌ తమిళంలో టైటిల్‌ కార్డులు రచించారు. ఇక, ఎడిటర్‌, సినిమాటోగ్రాఫర్‌, నిర్మాత, దర్శకుడు, స్టూడియో వ్యవహారాల పర్యవేక్షకుడు - అన్నీ నటరాజ ముదలియారే! కలకత్తాకు చెందిన మదన్‌, బొంబాయికి చెందిన అర్దేషిర్‌ ఇరానీలు ఆ రోజుల్లో భారతదేశమంతటా నటరాజ ముదలియార్‌ చిత్రాలను పంపిణీ చేసేవారు. అలా 'కీచక వధమ్‌'లో ఏ భాష మాటలూ వినిపించకపోయినప్పటికీ, దీనితో సంబంధం ఉన్నవాళ్ళందరూ ఎక్కువగా తమిళులే కావడంతో, చాలామంది దీన్ని తొలి తమిళ చిత్రంగా పేర్కొంటూ ఉంటారు. కానీ, నిర్దుష్టంగా చెప్పాలంటే - ఇది దక్షిణ భారతదేశంలో తయారైన తొలి పూర్తి నిడివి చలనచిత్రం!


ఆడవారి కోసం అష్టకష్టాలు


నటరాజ ముదలియార్‌ నేతృత్వంలోని 'ఇండియన్‌ ఫిల్మ్‌ కంపెనీ' ఆ తరువాత తమ రెండో చిత్రం 'ద్రౌపదీ వస్త్రాపహరణం' నిర్మించింది. 1917లో ఆ చిత్రం విడుదలైంది. సినిమాల్లో నటించడానికి ఆడవాళ్ళు అప్పట్లో ముందుకు వచ్చేవారు కాదు, అందులోనూ కులస్త్రీలు అసలు వచ్చేవారు కాదు. నటరాజ ముదలియార్‌కు సైతం ఈ ఇబ్బంది తప్పలేదు. అయితే, ఎలాగోలా ప్రాథేయపడి, పాశ్చాత్య మహిళలనూ, ఆ తరువాత కొంతమంది ఆంగ్లో - ఇండియన్‌ స్త్రీలనూ నటనకు ఒప్పించారు. ఆ సమస్యను ఆయన అలా పరిష్కరించారు. వయొలెట్‌ బెర్రీ అనే మహిళ ఆయన నిర్మించిన చిత్రాల్లో నటించారు.



ఆమే కాకుండా విలోచన (మేరియన్‌ హిల్‌), రాజా ముదలియార్‌, జీవరత్నం, దొరైస్వామి పిళ్ళైలు కూడా 'ద్రౌపదీ వస్త్రాపహరణం'లో నటించారు. భారతీయ వనితలెవరూ పోషించడానికి ఇష్టపడని ద్రౌపది పాత్రను పాశ్చాత్య వనిత వయొలెట్‌ బెర్రీ ధరించగా, దుశ్శాసనుడి పాత్రను ఆంగ్లం తెలిసిన దొరైస్వామి పిళ్ళై పోషించినట్లు చెబుతారు. బ్రిటీషు వారు మన భారతీయులను బానిసలుగా చూస్తున్న ఆ రోజుల్లో బ్రిటీషు వనితతో ద్రౌపది వేషం వేయించి, ఆమె చీర ఊడదీయించిన ధీశాలి నటరాజ ముదలియార్‌. మొదటి సినిమా కన్నా తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ చిత్రం, దాని కన్నా ఎక్కువ వసూళ్ళు (రూ. 75 వేలు) సాధించిందట!తరువాతి కాలంలో నటరాజ ముదలియార్‌ స్వతంత్రంగా చిత్ర నిర్మాణాన్ని చేపట్టడం కోసం ఆ సంస్థను విడిచిపెట్టి వెళ్ళారు.



స్వస్థలమైన వేలూరుకు వెళ్ళి, ఒంటి చేత్తో 1919లో 'మహిరావణన్‌', 'మార్కండేయ' అనే రెండు చిత్రాలు నిర్మించారు. ఆ రెండు చిత్రాలనూ వెల్లూరు పరిసరాల్లోని కొండ ప్రాంతాల్లో చిత్రీకరించారు. 'మార్కండేయ'లో యముడిగా నటించిన సుబ్రహ్మణ్య నాయుడుతోనే 'మహిరావణన్‌' కూడా తీసినట్లు కథనం. నటరాజ ముదలియార్‌ నిర్మించిన ఈ చిత్రాలన్నీ ఒక్కొక్కటీ సుమారు 6 వేల అడుగుల నిడివి ఉండేవి. అలాగే, ఆయనే తీసిన 'లవ కుశ'లో శ్రీరాముడిగా గోవిందస్వామి నాయుడు నటించారట! మరో చిత్రం 'రుక్మిణి - సత్యభామ'లో రుక్మిణిగా బ్రాహ్మణ యువతి జానకి నటించడం ఆ రోజుల్లో విశేషం. సత్యభామగా జీవరత్నం, శ్రీకృష్ణుడిగా నటేశ నాయుడు నటించారట!


తెరకు దూరమైన తొలి చిత్ర రూపకర్త


అయితే, ఆ తరువాత అంటే... 1923లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో నటరాజ ముదలియార్‌ స్టూడియో కాలిపోయింది. దెబ్బ మీద దెబ్బగా కుమారుడు కూడా చనిపోవడంతో, ఆయన విషాదంలో మునిగిపోయారు. చలనచిత్ర నిర్మాణాన్ని మానేసి, మళ్ళీ ఆటోమొబైల్‌ విడిభాగాల విక్రయ వ్యాపారంలోకి వెళ్ళిపోయారు. అలా ఆ తరువాతి కాలంలో సినిమాల నిర్మాణానికి దూరంగా మెలగి, ప్రజల స్మృతిపథంలో నుంచి పక్కకు తొలగిన నటరాజ ముదలియార్‌ చివరకు 1972 మే 3న మద్రాసులో కన్నుమూశారు.



మద్రాసు ఇవాళ దక్షిణ భారతదేశమంతటికీ అతి పెద్ద చిత్ర నిర్మాణ కేంద్రంగా ఎదిగింది. కానీ, ఒక్కసారి చరిత్రను గమనిస్తే - మద్రాసులో సినిమాలంటూ తీయడం మొదలైన తొలి పదేళ్ళ కాలంలో ఇద్దరే ఇద్దరు భారతీయులు చలనచిత్రాలు నిర్మించారు. వారిలో ఒకరు నటరాజ ముదలియార్‌. రెండో వ్యక్తి - తెలుగు చలనచిత్ర పితామహుడైన రఘుపతి వెంకయ్య కుమారుడు ఆర్‌. ప్రకాశ్‌. (వీళ్ళిద్దరూ కాక సినిమాలు తీసింది - వైటకెర్‌ అనే ఓ పాశ్చాత్యుడు మాత్రమే!). దక్షిణాదిలో చలనచిత్ర నిర్మాణానికి బీజం వేసిన నటరాజ ముదలియార్‌ కృషి, ఆయన రూపొందించిన తొలి దక్షిణాది చలనచిత్రం 'కీచక వధమ్‌' ఇప్పటికీ, ఎప్పటికీ స్మరణీయమే!