Tuesday, December 6, 2011

దక్షిణాదిలో సినిమాల శ్రీకార గాధ

ఆదివారం అనుబంధం Sat, 22 Jan 2011,
అవునన్నా, కాదన్నా సినిమా ఇవాళ జన జీవితంలో ఓ ప్రధానమైన భాగం. ప్రజల కట్టూ బొట్టూ, ఆటా పాటా, మాటా - ఇలా అన్నిటినీ అనూహ్యంగా ప్రభావితం చేస్తున్న శక్తిమంతమైన మాధ్యమం. అలాంటి సినిమాలకు మన దేశంలో నూరేళ్ళకు పైగా చరిత్ర ఉంది. దాదాసాహెబ్‌ ఫాల్కే తీసిన 'రాజా హరిశ్చంద్ర' (1913)కు మునుపే కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఫాల్కే 'రాజా హరిశ్చంద్ర'ను తొలి భారతీయ చలనచిత్రంగా చరిత్రకారులు తీర్మానించారు. మరి, కేవలం మన దక్షిణాది వరకు తీసుకుంటే, ఇక్కడ తొలి చలనచిత్ర ప్రయత్నం ఎవరు, ఎప్పుడు, ఎలా చేశారు?


దక్షిణ భారతదేశంలో తొలి పూర్తి నిడివి చలనచిత్రాన్ని రూపొందించిన వ్యక్తి - ఆర్‌. నటరాజ ముదలియార్‌గా ప్రసిద్ధుడైన రంగస్వామి నటరాజ ముదలియార్‌ (1885 - 1972). నిజానికి, ఆయన సినిమాలతో అసలు సంబంధమే లేని వ్యక్తి అంటే ఆశ్చర్యం కలుగుతుంది. మద్రాసులోని ప్రసిద్ధ థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఆయన ఆటోమొబైల్‌ విడిభాగాల డీలర్‌. వెల్లూరులోని వ్యాపారస్థుల కుటుంబంలో 1885 జనవరి 26న ఆయన జన్మించారు. తండ్రి పేరు - రంగస్వామి. పెద్దమనిషిగా పేరున్న వ్యాపారి. మెట్రిక్‌ దాకా చదువుకున్న నటరాజ ముదలియార్‌ తన తండ్రి లాగే వ్యాపార రంగంలోకి దిగారు. రాజధాని అయిన మద్రాసుకు మారి, సమీప బంధువూ, ధనికుడూ అయిన ఎస్‌.ఎం. ధర్మలింగం ముదలియార్‌తో కలసి 'వాట్సన్‌ అండ్‌ కంపెనీ'ని స్థాపించారు. బ్రిటీషు సైకిళ్ళను దిగుమతి చేసుకొని అమ్మేవారు.


మోటారు వ్యాపారం నుంచి మూకీలకు!


అప్పట్లో ఒక్కో సైకిల్‌ 25 రూపాయలకు అమ్ముడయ్యేది. గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్‌ అంటే ఎంతో వింతగా చూస్తూ, 'రబ్బరు బండి' అని పిలిచేవారట! మొత్తానికి, నటరాజ ముదలియార్‌ సైకిళ్ళ వ్యాపారం బాగా వృద్ధిలోకి వచ్చింది. అలా అయిదేళ్ళు గడిచాక, 1911లో ఆ వ్యాపార భాగస్వాములు మరో అడుగు ముందుకు వేశారు. అమెరికన్‌ కార్లు, ఆటోమొబైల్‌ విడిభాగాల దిగుమతి వ్యాపారం చేసే విదేశీ సంస్థ 'రోమర్‌, డాన్‌ అండ్‌ కంపెనీ' అనే సంస్థను కొన్నారు. మోటారుకార్లను దిగుమతి చేసుకోవడం, అమ్మడం ప్రారంభించారు. అప్పట్లో మద్రాసులో 'అడిసన్‌ అండ్‌ కంపెనీ' ఒక్కటే అమెరికన్‌ కార్ల వ్యాపారం సాగించేదట! దాంతో, అమెరికన్‌ కార్లను అమ్మిన తొలి భారతీయుడయ్యారు - నటరాజ ముదలియార్‌. ఆ రోజుల్లో ఒక్కో కారు వెల 1000 రూపాయలే!



అప్పట్లో పాశ్చాత్య దేశాల మూకీ చిత్రాల ప్రదర్శనలను చూశాక, మన దేశంలోనూ చలనచిత్ర నిర్మాణాల తొలినాళ్ళ విశేషాలను తెలుసుకున్నాక నటరాజ ముదలియార్‌కు ఒక ఆలోచన వచ్చింది. మద్రాసులో సైతం ఇలాంటి సైలెంట్‌ ఫిల్ములు తీసే అవకాశం ఉందని ఆయన గ్రహించారు. చిత్ర నిర్మాణంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో లార్డ్‌ కర్జన్‌ భారతదేశానికి గవర్నర్‌ - జనరల్‌గా, వైస్రారుగా వ్యవహరిస్తుండేవారు.



ఆయన నిర్వహించే దర్బార్‌లనూ, సామాజిక కార్యకలాపాలనూ న్యూస్‌ రీలుగా బ్రిటీషు సినిమాటోగ్రాఫర్లు చిత్రీకరించేవారు. అలాంటి కెమేరామన్లలో ఒకరు - స్టీవర్ట్‌ స్మిత్‌. ఆయన పూనాలో ఓ సినిమా హాలు కూడా నడిపేవారు. ఆయనను ముదలియార్‌ సంప్రదించారు. సినిమాటోగ్రఫీలోని ప్రాథమిక అంశాలు నేర్పాల్సిందిగా అభ్యర్థించి, ఒప్పించారు. పూనాకు వెళ్ళి, స్మిత్‌ను కలుసుకున్నారు. లార్డ్‌ కర్జన్‌ 1903 నాటి దర్బార్‌కు అధికారిక సినిమాటోగ్రాఫరైన స్మిత్‌, మూవీ కెమేరాతో ఎలా చిత్రీకరణ జరపాలో కొద్ది రోజుల పాటు నటరాజ ముదలియార్‌కు నేర్పారు. సినిమా రూపకర్తగా మారాలని ఆశించిన నటరాజ ముదలియార్‌ అక్కడ కొన్ని దృశ్యాలు చిత్రీకరించారు. పూనాలోని స్మిత్‌ నివాసంలో ఓ రాత్రి వేళ విందు అనంతరం ఆ దృశ్యాలను ప్రదర్శించి చూశారు.


దక్షిణాదిలో తొలి స్టూడియో


అటుపైన నటరాజ ముదలియార్‌ మద్రాసుకు తిరిగి వచ్చేశారు. అప్పటికి తెలుగునేలలో అత్యధిక భాగం మద్రాసు రాజధానిగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండేది. మద్రాసు వచ్చిన ఆయన, తన వ్యాపార సహచరుడు ధర్మలింగం ముదలియార్‌తో కలసి మిత్రులనూ, వ్యాపార సహచరులనూ వాటాదారులుగా చేర్చుకొని, 1916లో 'ఇండియన్‌ ఫిల్మ్‌ కంపెనీ' పేరిట ఓ చలనచిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పారు. అప్పట్లో అందరూ ఇంగ్లీషు తరహా పేర్లు ఎక్కువగా పెడుతుంటే, ఆయన అందుకు భిన్నంగా భారతీయ నామం పెట్టడం గమనార్హం.



అలాగే, దక్షిణ భారతదేశంలోని తొలి స్టూడియోను సైతం మద్రాసులో నటరాజ ముదలియార్‌ బృందమే నెలకొల్పింది. మద్రాసులోని పరశువాక్కమ్‌ ప్రాంతంలో మిల్లర్స్‌ రోడ్డులో నెలకొన్న పెద్ద తోట బంగళా 'టవర్‌ హౌస్‌'లో స్టూడియో ఏర్పాటు చేసింది. (ప్రస్తుతం విద్యార్థుల హాస్టళ్ళు, హోటళ్ళు, దుకాణాలు, సినిమా హాళ్ళు, ఆసుపత్రులు, కల్యాణ మండపాలు, వాహనాల రద్దీతో ఎంతో ఇరుకుగా తయారైన ఆ రోడ్డులో 95 ఏళ్ళ క్రితం ఓ స్టూడియో ఉండేదంటే ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది). అప్పట్లో తంజావూరు జిల్లాలో ధనిక భూస్వామి కుటుంబానికి చెందిన తిరువయ్యూర్‌ మూపనార్‌ వద్ద లండన్‌ నుంచి కొని తెచ్చిన విలియమ్‌సన్‌ 35 ఎం.ఎం. సైలెంట్‌ మూవీ కెమేరా, ప్రింటర్‌ ఉండేవి. ఆయన వద్ద నుంచి వాటిని 1800 రూపాయలకు నటరాజ ముదలియార్‌ కొన్నారు.


తొలి మూకీకి తంటాలు


అయితే, ఫిల్మును కడిగి, నిర్మాణానంతర కార్యకలాపాలు జరిపే లేబొరేటరీని మాత్రం వాతావరణం చల్లగా ఉండి, అలాంటి పనులకు అనుకూలించే బెంగుళూరులో నెలకొల్పారు. ఫిల్ముల ప్రాసెసింగ్‌ పనిలో శిక్షణ పొందిన నారాయణస్వామిని ఆ లేబొరేటరీకి పెద్దగా నియమించారు. అప్పట్లో చిత్రీకరణ జరపగానే, చిత్రీకరణ ముగిసిన ఫిల్ము రోల్స్‌ను ఏ రోజుకు ఆ రోజు శరవేగంగా బెంగుళూరుకు పంపేసేవారు. ఎక్స్‌పోజ్‌ అయి, అలా వచ్చిన రీళ్ళను బెంగుళూరులో ప్రాసెసింగ్‌ చేసేవారు. నటరాజ ముదలియార్‌ వారానికి ఒకసారి బెంగుళూరుకు వెళ్ళి, పురోగతిని కనుక్కునేవారు.



ఆనాటి తమిళ నాటక రంగ పునరుజ్జీవనంలో ముఖ్యుడైన తన మిత్రుడు పమ్మల్‌ సంబంద ముదలియార్‌ను ఏ కథ తెరకెక్కించాలనే విషయంలో సలహా అడిగారు. భావోద్వేగాలు, పోరాటం, కొద్దిపాటి సెక్స్‌ అప్పీలు కూడా ఉన్న కథనే తెరకెక్కించాల్సిందని చెప్పి, ఆ మూడూ ఉన్న ద్రౌపదీ, కీచక వృత్తాంతాన్ని సినిమాగా తీయాల్సిందిగా ఆయన సలహా ఇచ్చారు. తొలి ప్రయత్నంలో అలాంటి కథను సినిమాగా తీయడం సరైనది కాదని కొందరు బంధువులు అభ్యంతరం చెప్పినప్పటికీ, నటరాజ ముదలియార్‌ పట్టుదలతో ముందుకు సాగి, 'కీచక వధమ్‌' ప్రారంభించారు. కానీ, ఆయన ప్రాథమికంగా రచయిత కాదు. దాంతో, తన సన్నిహిత మిత్రుడూ - రంగస్థల ప్రముఖుడూ అయిన సి. రంగవడివేలు అనే వకీలును ఆశ్రయించారు. సినిమాలో పాత్రలు పోషించే నటీనటులకు శిక్షణనిచ్చే బాధ్యతను కూడా నిర్వహించారు. అలా దక్షిణ భారతదేశంలో కెల్లా తొలి చలనచిత్రం 'కీచక వధమ్‌' (1916) తయారైంది.


గాంధీ కుమారుడితో టైటిల్‌ కార్డుల రచన


మహాభారతంలోని కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 35 రోజుల్లో పూర్తయింది. అప్పట్లో సినిమా షూటింగ్‌ చేయడానికి విద్యుత్‌ దీపాలు కూడా అందుబాటులో లేవు. అందుకే, బంగళాలో ఓ పందిరి లాంటిది వేయించి, దానికి పై కప్పు వేయకుండా తెల్లటి వస్త్రాన్ని కట్టారట! ఆ వస్త్రం గుండా వచ్చిన సూర్యరశ్మి కాంతిలో చిత్రీకరణ జరిపేవారట! రంగస్థల నటీనటులైన రాజా ముదలియార్‌తో కీచక పాత్ర, జీవరత్నంతో ద్రౌపది పాత్ర వేయించారు. అప్పట్లో ఈ సినిమా తీయడానికి రూ. 35 వేల దాకా ఖర్చయిందట! ఆ రోజుల్లో ఓ సినిమాకు అంత డబ్బు ఖర్చు కావడమంటే చాలా ఎక్కువ. చిత్ర నిర్మాణంలో నటరాజ ముదలియార్‌కు అప్పటికి పెద్దగా అనుభవం లేదనడానికి అంత ఖర్చు కావడమే సాక్ష్యం.



1917లో చిత్రీకరణ జరుపుకొన్న ఈ మూకీ చిత్రం 1918 జనవరిలో మద్రాసులోని 'ఎల్ఫిన్‌స్టన్‌ సినిమా' హాలు (మౌంట్‌రోడ్‌లోని ఇప్పటి కొత్త శాసనసభ ప్రాంగణం ఎదురుగా ఉండేది)లో విడుదలైనట్లూ, రెండు వారాల పాటు ఆడినట్లూ చరిత్రకారులు చెబుతున్నారు. ఆ చిత్రం కరాచీతో సహా భారతదేశ వ్యాప్తంగానే కాక, రంగూన్‌ (బర్మా), సిలోన్‌, ఫెడరేటెడ్‌ మాలే స్టేట్స్‌లో, సింగపూర్‌లో, ఇతర ఇరుగు పొరుగు దేశాల్లో సైతం విజయవంతంగా ఆడింది. అప్పట్లోనే ఆ సినిమా మొత్తం రూ. 50 వేల దాకా వసూళ్ళు చేసిందట! అంటే, రూ. 15 వేలు లాభమన్నమాట. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం కిందే లెక్క.



అప్పట్లో సినిమా మొత్తం శబ్దరహితంగా సాగేది కాబట్టి, మాటలు, పాటలు లేని ఆ మూకీ చిత్రాల్లో తెరపై జరుగుతున్నదేమిటో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉండేది. దాంతో, దృశ్యానికీ దృశ్యానికీ మధ్య 'ఇంటర్‌ - టైటిల్‌ కార్డుల'లో కథా సందర్భాన్నీ, సన్నివేశాన్నీ, కొన్ని ముఖ్యమైన సంభాషణలనూ తెరపై చూపేవారు. నటరాజ ముదలియార్‌ చిత్రాల్లోని టైటిల్‌ కార్డులు తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఉండేవి. దాంతో, ఈ మూకీ చిత్రాలను ఏ ప్రాంతంలోని, ఏ భాష ప్రజలు చూసినా కథ సులువుగా అర్థమయ్యేది.




మహాత్మా గాంధీ కుమారుడూ, తరువాతి రోజుల్లో ప్రసిద్ధ పాత్రికేయుడూ, వార్తాపత్రిక ఎడిటరూ అయిన దేవ్‌దాస్‌ గాంధీ ఈ చిత్రానికి హిందీ టైటిల్స్‌ రాశారు. ఇక, మద్రాసు నగర వైద్య ప్రముఖుల్లో ఒకరూ - నటరాజ ముదలియార్‌కు సమీప బంధువూ అయిన డాక్టర్‌ ఎం.ఆర్‌. గురుస్వామి ముదలియార్‌ తమిళంలో టైటిల్‌ కార్డులు రచించారు. ఇక, ఎడిటర్‌, సినిమాటోగ్రాఫర్‌, నిర్మాత, దర్శకుడు, స్టూడియో వ్యవహారాల పర్యవేక్షకుడు - అన్నీ నటరాజ ముదలియారే! కలకత్తాకు చెందిన మదన్‌, బొంబాయికి చెందిన అర్దేషిర్‌ ఇరానీలు ఆ రోజుల్లో భారతదేశమంతటా నటరాజ ముదలియార్‌ చిత్రాలను పంపిణీ చేసేవారు. అలా 'కీచక వధమ్‌'లో ఏ భాష మాటలూ వినిపించకపోయినప్పటికీ, దీనితో సంబంధం ఉన్నవాళ్ళందరూ ఎక్కువగా తమిళులే కావడంతో, చాలామంది దీన్ని తొలి తమిళ చిత్రంగా పేర్కొంటూ ఉంటారు. కానీ, నిర్దుష్టంగా చెప్పాలంటే - ఇది దక్షిణ భారతదేశంలో తయారైన తొలి పూర్తి నిడివి చలనచిత్రం!


ఆడవారి కోసం అష్టకష్టాలు


నటరాజ ముదలియార్‌ నేతృత్వంలోని 'ఇండియన్‌ ఫిల్మ్‌ కంపెనీ' ఆ తరువాత తమ రెండో చిత్రం 'ద్రౌపదీ వస్త్రాపహరణం' నిర్మించింది. 1917లో ఆ చిత్రం విడుదలైంది. సినిమాల్లో నటించడానికి ఆడవాళ్ళు అప్పట్లో ముందుకు వచ్చేవారు కాదు, అందులోనూ కులస్త్రీలు అసలు వచ్చేవారు కాదు. నటరాజ ముదలియార్‌కు సైతం ఈ ఇబ్బంది తప్పలేదు. అయితే, ఎలాగోలా ప్రాథేయపడి, పాశ్చాత్య మహిళలనూ, ఆ తరువాత కొంతమంది ఆంగ్లో - ఇండియన్‌ స్త్రీలనూ నటనకు ఒప్పించారు. ఆ సమస్యను ఆయన అలా పరిష్కరించారు. వయొలెట్‌ బెర్రీ అనే మహిళ ఆయన నిర్మించిన చిత్రాల్లో నటించారు.



ఆమే కాకుండా విలోచన (మేరియన్‌ హిల్‌), రాజా ముదలియార్‌, జీవరత్నం, దొరైస్వామి పిళ్ళైలు కూడా 'ద్రౌపదీ వస్త్రాపహరణం'లో నటించారు. భారతీయ వనితలెవరూ పోషించడానికి ఇష్టపడని ద్రౌపది పాత్రను పాశ్చాత్య వనిత వయొలెట్‌ బెర్రీ ధరించగా, దుశ్శాసనుడి పాత్రను ఆంగ్లం తెలిసిన దొరైస్వామి పిళ్ళై పోషించినట్లు చెబుతారు. బ్రిటీషు వారు మన భారతీయులను బానిసలుగా చూస్తున్న ఆ రోజుల్లో బ్రిటీషు వనితతో ద్రౌపది వేషం వేయించి, ఆమె చీర ఊడదీయించిన ధీశాలి నటరాజ ముదలియార్‌. మొదటి సినిమా కన్నా తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ చిత్రం, దాని కన్నా ఎక్కువ వసూళ్ళు (రూ. 75 వేలు) సాధించిందట!తరువాతి కాలంలో నటరాజ ముదలియార్‌ స్వతంత్రంగా చిత్ర నిర్మాణాన్ని చేపట్టడం కోసం ఆ సంస్థను విడిచిపెట్టి వెళ్ళారు.



స్వస్థలమైన వేలూరుకు వెళ్ళి, ఒంటి చేత్తో 1919లో 'మహిరావణన్‌', 'మార్కండేయ' అనే రెండు చిత్రాలు నిర్మించారు. ఆ రెండు చిత్రాలనూ వెల్లూరు పరిసరాల్లోని కొండ ప్రాంతాల్లో చిత్రీకరించారు. 'మార్కండేయ'లో యముడిగా నటించిన సుబ్రహ్మణ్య నాయుడుతోనే 'మహిరావణన్‌' కూడా తీసినట్లు కథనం. నటరాజ ముదలియార్‌ నిర్మించిన ఈ చిత్రాలన్నీ ఒక్కొక్కటీ సుమారు 6 వేల అడుగుల నిడివి ఉండేవి. అలాగే, ఆయనే తీసిన 'లవ కుశ'లో శ్రీరాముడిగా గోవిందస్వామి నాయుడు నటించారట! మరో చిత్రం 'రుక్మిణి - సత్యభామ'లో రుక్మిణిగా బ్రాహ్మణ యువతి జానకి నటించడం ఆ రోజుల్లో విశేషం. సత్యభామగా జీవరత్నం, శ్రీకృష్ణుడిగా నటేశ నాయుడు నటించారట!


తెరకు దూరమైన తొలి చిత్ర రూపకర్త


అయితే, ఆ తరువాత అంటే... 1923లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో నటరాజ ముదలియార్‌ స్టూడియో కాలిపోయింది. దెబ్బ మీద దెబ్బగా కుమారుడు కూడా చనిపోవడంతో, ఆయన విషాదంలో మునిగిపోయారు. చలనచిత్ర నిర్మాణాన్ని మానేసి, మళ్ళీ ఆటోమొబైల్‌ విడిభాగాల విక్రయ వ్యాపారంలోకి వెళ్ళిపోయారు. అలా ఆ తరువాతి కాలంలో సినిమాల నిర్మాణానికి దూరంగా మెలగి, ప్రజల స్మృతిపథంలో నుంచి పక్కకు తొలగిన నటరాజ ముదలియార్‌ చివరకు 1972 మే 3న మద్రాసులో కన్నుమూశారు.



మద్రాసు ఇవాళ దక్షిణ భారతదేశమంతటికీ అతి పెద్ద చిత్ర నిర్మాణ కేంద్రంగా ఎదిగింది. కానీ, ఒక్కసారి చరిత్రను గమనిస్తే - మద్రాసులో సినిమాలంటూ తీయడం మొదలైన తొలి పదేళ్ళ కాలంలో ఇద్దరే ఇద్దరు భారతీయులు చలనచిత్రాలు నిర్మించారు. వారిలో ఒకరు నటరాజ ముదలియార్‌. రెండో వ్యక్తి - తెలుగు చలనచిత్ర పితామహుడైన రఘుపతి వెంకయ్య కుమారుడు ఆర్‌. ప్రకాశ్‌. (వీళ్ళిద్దరూ కాక సినిమాలు తీసింది - వైటకెర్‌ అనే ఓ పాశ్చాత్యుడు మాత్రమే!). దక్షిణాదిలో చలనచిత్ర నిర్మాణానికి బీజం వేసిన నటరాజ ముదలియార్‌ కృషి, ఆయన రూపొందించిన తొలి దక్షిణాది చలనచిత్రం 'కీచక వధమ్‌' ఇప్పటికీ, ఎప్పటికీ స్మరణీయమే!

No comments:

Post a Comment