Tuesday, December 6, 2011

చలనచిత్ర రంగంలో చేజారిపోతున్న ప్రముఖ స్థానం

భారతదేశంలో తెరపై బొమ్మలు మాట్లాడడం మొదలై, 80 ఏళ్ళు పూర్తయ్యాయని 'అశీతి' (అంటే సంస్కృతంలో ఎనభై అని అర్థం) పూర్తి ఉత్సవాలు జరుపుకొంటున్నాం. తెలుగు మాటలు, పాటలే ఉన్న తొలి తెలుగు సంపూర్ణ టాకీ 'భక్త ప్రహ్లాద' అసలు సిసలు విడుదల తేదీ ఏమిటన్న దానిపై ఇటీవల ఓ పరిశోధనలో సరికొత్త సాక్ష్యాధారాలు వెలుగు చూశాయి. అయినా, వాటిని పట్టించుకోకుండా పాత నమ్మకమైన సెప్టెంబర్‌ 15నే పట్టుకొని వేలాడుతూ, ఆ రోజే చిత్ర పరిశ్రమ పెద్దలు 'తెలుగు చలనచిత్ర దినోత్సవం' జరిపారు. ఏటేటా, ఆ రోజునే జరుపుతామనీ ప్రకటించారు. పండుగ జరుపుకొనే మాట ఎలా ఉన్నా, సరిగ్గా ప్రస్తుత పరిస్థితిలో తెలుగు సినిమా ఏ పరిస్థితుల్లో ఉందని చూస్తే మాత్రం ఒకింత విచారమే కలుగుతుంది. తగ్గిపోతున్న విజయాలు, దేశ చలనచిత్ర రంగంలో మన చేజారిపోతున్న ప్రముఖ స్థానం ఆందోళన కలిగిస్తాయి.


అవును! తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇటీవల కొద్దికాలంగా సర్రున కిందకు జారిపోతోంది. ఒకప్పుడు దేశం మొత్తంలో అత్యధిక చలనచిత్రాలను నిర్మించి, అగ్ర స్థానంలో నిలిచిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇవాళ ఆ స్థానాన్నీ, స్థాయినీ పోగొట్టుకుంది. ఇది ఎవరో అంటున్న నోటి మాట కాదు. గణాంకాలు, బాక్సాఫీస్‌ వివరాలు చెబుతున్న చేదు నిజం. అందుకు తాజా నివేదికలే సాక్ష్యం. సినిమాల్లో నాణ్యత, వసూళ్ళతో సంబంధం లేకుండా, నిర్మాణమైన చలనచిత్రాల సంఖ్యలో మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమ నిన్న మొన్నటి వరకు అగ్రేసర స్థానంలో నిలిచింది. హిందీ చలనచిత్ర పరిశ్రమ కన్నా మిన్నగా, దేశంలోనే అతి ఎక్కువ సంఖ్యలో సినిమాలు నిర్మించే పరిశ్రమగా మనం ముందుండేవారం. అలాంటిది 2009లో మనం చిత్ర నిర్మాణంలో ప్రథమ స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయాం. ఇటీవల విడుదలైన గణాంక వివరాలను బట్టి చూస్తే, మనం ఇప్పుడు అక్కడ నుంచి మరో మెట్టు కిందకు జారాం. నిర్మాణమైన చిత్రాల సంఖ్య రీత్యా 2010లో మనం ఏకంగా మూడో స్థానానికి పడిపోయాం.


దేశవ్యాప్తంగా తగ్గిన చిత్ర నిర్మాణం


చిత్ర నిర్మాణ సంఖ్యలో తమిళ తంబీలు మనల్ని దాటి ముందుకు వచ్చారు. తమిళ చిత్ర పరిశ్రమ రెండో స్థానానికి ఎగబాకగా, తెలుగు చిత్ర పరిశ్రమ మూడో స్థానానికి దిగజారింది. కేంద్ర సెన్సార్‌ బోర్డు ('సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌' - సి.బి.ఎఫ్‌.సి) 2010వ సంవత్సరానికి గాను జారీ చేసిన వార్షిక నివేదికలో ఈ సంగతులు వెల్లడయ్యాయి. మన దేశం మొత్తం మీద నిర్మాణమైన చలనచిత్రాల సంఖ్య గత ఏడాది కొద్దిగా తగ్గింది. 2009లో మన దేశం మొత్తం మీద, వివిధ భాషలన్నీ కలిపి 1288 చిత్రాలు తయారయ్యాయి. కాగా, ఆ మరుసటి ఏడాది 2010 కల్లా ఆ సంఖ్య కొద్దిగా తగ్గి, 1274కు చేరిందని సెన్సార్‌ బోర్డు వార్షిక నివేదిక తెలిపింది.


తమిళం ముందు! తెలుగు వెనుక!!


మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే, పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. తెలుగులో రూపొందుతున్న చిత్రాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2009లో తెలుగులో నిర్మాణమై, సెన్సార్‌ జరుపుకొని, సర్టిఫికెట్‌ పొందిన చిత్రాల సంఖ్య (నేరు తెలుగు చిత్రాలు, అనువాద చిత్రాలు కలిపి) 218. కాగా, గత ఏడాది - అంటే 2010లో ఇది 181కి పడిపోయింది. ఫలితంగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ దేశం మొత్తం మీద ఏకంగా మూడో స్థానంలోకి పడిపోయింది. పొరుగు రాష్ట్రంలోని తమిళ సోదరులు చిత్ర నిర్మాణ సంఖ్యలో మనల్ని దాటి, ముందుకు వచ్చారు. ''తమిళంలో గడచిన 2010లో 129 నేరు చిత్రాలు వచ్చాయి. అనువాద చిత్రాలు కలపకుండానే ఇన్ని చిత్రాలు నిర్మాణం కావడానికి తమిళ చిత్ర పరిశ్రమలో ఓ రికార్డు'' అని తమిళ చలనచిత్ర చరిత్రకారుడు, జర్నలిస్టు అయిన ఎనిమిది పదుల 'ఫిల్మ్‌న్యూస్‌' ఆనందన్‌ వివరించారు. ఈ ''2011లో ఆగస్టు చివరి నాటికే తమిళంలో 80 నేరు చిత్రాలు వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 140 చిత్రాలు వస్తాయని అంచనా'' అని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 7 ఒక్క రోజునే తమిళంలో ఏడు చిత్రాలు రిలీజవడం అందుకు పెద్ద సూచన.


వెలుగు తగ్గడానికి కారణాలెన్నో!


'అరయంగ కర్ణుడీల్గె నార్గురి చేతన్‌...' అంటు కర్ణుడి చావుకు కారణాల లాగా, తెలుగులో చలనచిత్ర నిర్మాణం తగ్గడానికి కూడా అనేక కారణాలున్నాయి. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మారిపోతున్న రాజకీయ పరిస్థితులు, కొరవడిన ప్రశాంతత, గత రెండేళ్ళుగా తెలుగులో బాక్సాఫీస్‌ హిట్లు గణనీయంగా తగ్గిపోవడం లాంటివి అందులో కొన్ని కారణాలు. అలాగే, అదుపు లేకుండా పెరిగిపోతున్న నిర్మాణ వ్యయంతో సహా అనేకానేక అంతర్గత సమస్యలు సైతం తెలుగు చలనచిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే, ఇది ఆందోళనకరమైన పరిణామమే! తెలుగు పరిశ్రమకు ఇది మంచి ధోరణి కాదనేది అందరూ ఒప్పుకొనే విషయం. నిజం చెప్పాలంటే, ఇవాళ తెలుగు చిత్ర సీమలో రెగ్యులర్‌గా సినిమాలు తీస్తున్న నిర్మాతలు కూడా చాలా తక్కువే! సినిమాయే లోకంగా బతుకుతూ, అంకితభావంతో ఒకదాని తరువాత మరొకటిగా సినిమాలు తీస్తున్న చిత్రనిర్మాతలు ఇవాళ ఆట్టే లేరు. ''సినీ వ్యాపారమే తప్ప, మరో వ్యాపారం తెలియని నిర్మాతలు ఇవాళ పరిశ్రమలో నూటికి 10 మంది మించి లేరు. నిర్మాతల మండలిలో 928 మంది నిర్మాతలున్నారు. కానీ, వారిలో ఎక్కువ మంది ఒకటి రెండు సినిమాలు నిర్మించి, ఆగిపోయినవాళ్ళే! అయిదు, అంతకన్నా ఎక్కువ సినిమాలు తీసినవాళ్ళ సంఖ్య తక్కువ'' అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి ఇటీవలే అధ్యక్షుడైన నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ సైతం పేర్కొన్నారు.


కళ్ళు తెరవాల్సిన తరుణం


ఏతావాతా, కొన్నేళ్ళుగా ఏటా అత్యధిక చిత్రాలు నిర్మిస్తున్న ఘనత వహించిన మన తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడిలా ఇలాంటి అనేకానేక కారణాల వల్ల ఆ ప్రత్యేకతను కోల్పోవడం విచారకరమే. సినిమాల కథ కథనాల్లో, నాణ్యతలో, జాతీయ స్థాయి గుర్తింపు, అవార్డుల విషయంలో ఇప్పటికే మనం వెనుకబడి ఉన్నామన్నది సినీ ప్రియులం జీర్ణించుకోలేకపోతున్న వాస్తవం. గోరుచుట్టు మీద రోకటి పోటులా ఇప్పుడు చిత్ర నిర్మాణ సంఖ్యలోనూ వెనుకబడ్డాం. ఇప్పటికైనా మన నిర్మాతలు, దర్శకులు, హీరోలు, సాంకేతిక నిపుణులు కళ్ళు తెరవాలి. వాస్తవ పరిస్థితుల్ని గుర్తించాలి. చిత్ర నిర్మాణం ఎందుకు తగ్గిపోతోందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. చిత్ర నిర్మాణం తగ్గిపోవడానికి కారణమవుతున్న తమ లోటుపాట్లనూ, కొండకచో వ్యవహార శైలినీ సరిదిద్దుకోవాలి. అప్పుడే మనం మళ్ళీ పూర్వ ప్రతిష్ఠను సంపాదించుకోగలుగుతాం. సినీ వ్యాపార ధోరణుల విశ్లేషణలో అపార అనుభవం ఉన్న కాట్రగడ్డ నరసయ్య కథనం ప్రకారం ''ఈ ఏడాదిలో ఆగస్టు నెలాఖరుకు తెలుగులో 81 నేరు చిత్రాలు, 89 అనువాద చిత్రాలు విడుదలయ్యాయి.'' దాన్నిబట్టి చూస్తే, గత ఏడాది కన్నా ఈసారి తెలుగులో చలనచిత్ర నిర్మాణాల సంఖ్య మెరుగు కావచ్చని ఓ చిరు ఆశాదీపం మిణుకు మిణుకుమంటోంది.

No comments:

Post a Comment