ఆదివారం అనుబంధం - Sat, 1 Oct 2011.
.సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా తీస్తున్న 'డర్టీ పిక్చర్' ఇప్పుడు సినిమా రంగంలో చర్చనీయంగా వుంది. దక్షిణాది చిత్రాలలో పచ్చి శృంగార నృత్యాలకు మారు పేరుగా ఉపయోగపడిన సిల్క్ స్మిత ఎంత గడించిందో గాని ఆఖరుకు అర్థంతరంగా ఆత్మహత్య చేసుకుని కనుమరుగైపోయింది. ఆవిధంగా విషాదాంతమైన నాయికల జాబితాకు అంతేలేదు. మీనా కుమారి, సావిత్రి, శోభ, ఫటాఫట్ జయలక్ష్మి, విజయశ్రీ.... ఇలా ఎందరినైనా చెప్పొచ్చు. హాలివుడ్‌లోనైతే మర్లిన్ మన్రో మరణం ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంత దారుణంగా గాకున్నా వ్యాధిగ్రస్తులై మరణించిన మహిళా తారల విషయంలోనూ బోలెడు మానసిక ఘర్షణ, మానవీయ వేదన కనిపిస్తాయి. మరోవైపునుంచి చూస్తే జయప్రద, సబిత వంటి వారిని పూర్వ భర్తలు వేధించి కోర్టులకెక్కిన తీరు కూడా అందరికీ తెలుసు. సబిత కేసులోనైతే హైకోర్టు సంచలన తీర్పునే ఇచ్చింది. తారామణుల ప్రతిభకు ప్రతిబంధకాలుగా తయారైన పురుషుల మూలంగానే ఇన్ని వైపరీత్యాలు సంభవించాయి. అందుకే చిత్ర పరిశ్రమ ఎప్పటికప్పుడు కథానాయికల వాస్తవ జీవితాలను ఆధారం చేసుకుని కథలల్లుతూ వుంటుంది. ఇప్పుడు సిల్క్ స్మిత కథ తీస్తున్నప్పటికీ గతంలోనూ బాగా ప్రసిద్ధి పొందిన ఇలాంటి చిత్రాలున్నాయి.
మీనాకుమారి స్వంత కథ..... నాయికల నిజ జీవితాల ఆధారంగా తీసిన చిత్రాలలో ముందుగా చెప్పుకోవలసింది మీనాకుమారి పాత్రనే. హిందీ సినిమా రంగానికి మకుటం లేని మహారాణిగా (తెలుగులో సావిత్రిని మించి) వెలుగొందిన మీనా కుమారి అసలు పేరు మహజబిన్ బానో. తల్లిదండ్రులు కూడా సినీ రంగానికి చెందిన వారు కావడంతో ఆమెను బాలతారగా ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే ఆమె దర్శక రచయిత కమల్ ఆమ్రోహీ దృష్టిలో పడింది గాని మొదట్లో వీలు పడలేదు. తర్వాత కాలంలో ఆయన ఆమెను గుర్తించడం, అవకాశాలివ్వడం జరిగింది.1952లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మీనాకుమారి మొత్తం తొంభై చిత్రాల్లో నటించారంటే ఆమె ఖ్యాతి అర్థం చేసుకోవచ్చు.ఇంతకూ కమల్‌ను పెళ్లి చేసుకున్నాక ఆమె అత్తగారి వూరు ఆమ్రోహీ వెళ్లింది. తమ ప్రేమ కథనే ఇతివృత్తంగా తీసుకుని 'దయారీ' చిత్రాన్ని పెళ్లయిన మరుసటి ఏడాదిలోనే నిర్మించింది. మరో మూడేళ్ల తర్వాత 'పాకిజా' అన్న చిత్రాన్ని మొదలెట్టారు గాని పూర్తి కావడానికి పదహారేళ్లు పట్టింది. కొన్నేళ్లు దాంపత్య జీవితం గడిపాక వారు విడిపోయారు. ఆమె సూపర్ స్టార్ కావడంతో కొందరు కుట్ర పన్ని దూరం చేశారని ఆమ్రోహీ అంటుండేవారు. విడిపోయిన కారణంగా 'పాకిజా' చిత్రం కూడా ఆగిపోయింది. ఈ లోపల జీవిత సమస్యలు తట్టుకోలేని మీనాకుమారి మద్యపానానికి బానిసవడం, ఆరోగ్యం బొత్తిగా క్షీణించి విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకోవడం జరిగాయి. మళ్లీ 1971-72 మధ్య ఆమెనే చొరవ తీసుకుని కమల్ ఆమ్రోహీతో మాట్లాడి 'పాకిజా'ను పూర్తి చేశారు.
దేశంలో నిర్మాణమైన సంగీత కళాభరిత చిత్రంగా 'పాకిజా' పేరొందింది. అది ఘన విజయం సాధించిన తర్వాత 'పాకిజా2' తీయాలని కూడా మీనాకుమారి ప్రతిపాదించినప్పటికీ ఆరోగ్యం సహకరించలేదు చివరకు ఆమె 1972 మార్చి 31న విషాదకరంగా మరణించింది. కాకపోతే తన ప్రేమ కథను తానే నిర్మించుకున్న నాయికగా మిగిలిపోయింది.
స్మితాపాటిల్...శ్యామ్ భూమిక
తారామణుల జీవితాల ఆధారంగా నిర్మితమైన చిత్రాల్లో బాగా ఆదరణ పొందింది శ్యాం బెనగల్ తీసిన 'భూమిక'. మరాఠీ నాటక సినీ నటి హంసా వాడ్కర్ జీవితకథ ఈ చిత్రానికి ఆధారం. భూమిక అంటేనే పాత్ర. హంసా వాడ్కర్ వివాదాస్పద సంచలన జీవితం గడిపింది.మామూలు మహిళలు పాటించే హద్దులు దాటి తన స్థానం నిలబెట్టుకోవడానికి పెనుగులాడింది.ఈ కథనే శ్యాం బెనగల్ ఎంచుకున్నారు. నాయికగా నటించిన స్మితా పాటిల్ అద్భుత నటన ఆ పాత్రకు ప్రాణం పోసి పురస్కారాల వర్షం కురిపించింది. బాలివుడ్ నటి ఉష(స్మిత) ఒక సంప్రదాయ గాయని కుమార్తె. ఆ గాయని వ్యసనపరుడు, దుర్మార్గుడు అయిన ఒక సనాతన బ్రాహ్మణున్ని పెళ్లాడి అనేక కష్టాలనెదుర్కొంటుంది. అతను చనిపోయాక తల్లి వద్దంటున్నా ఉషను సినిమాల్లో వేషాల కోసం ముంబాయి తీసుకుపోతాడు వాళ్లను కనిపెట్టుకుని వుంటున్న నౌకరు కేశవ్ దాల్వి (అమల్ పలేకర్). అమ్మమ్మ ఆనందం, అమ్మ ఆవేదనల మధ్య ఉష నటిగా మారుతుంది. చిన్నప్పటి నుంచి తనపై కన్నేసిన కేశవ్‌నే పెళ్లి చేసుకుంటుంది. కొంత అనివార్యంగా కొంత అభిమానంగా. ఈ పెళ్లి తల్లికి ఇష్టం లేకున్నా ఉష ఎదిరించి చేసుకుంటుంది. అయితే అతను భర్తగా గాక నౌకరుగానే వ్యవహరిస్తూ తన వల్ల ఆర్థిక లాభమే ఆశిస్తున్నాడని అనతికాలంలోనే అర్థం చేసుకుంటుంది. కేశవ్ అనేక వ్యాపారాలు చేసి విఫలమై చివరకు ఆమెకు తార్పుడుగాడుగా తయారవుతాడు. హీరో రంజన్ (అనంత నాగ్)కు ఆమెను దగ్గర చేయాలని ప్రయత్నించి మళ్లీ తనే అసూయకు గురవుతాడు. ఈ ఘర్షణ భరించలేని ఉష ఏదో లోకంలో వున్నట్టుండే స్వార్థపర దర్శకుడు సునీల్ వర్మ (నసీరుద్దీన్ షా)కు కాస్త దగ్గరవుతుంది గాని ఆమె ఘర్షణ తగ్గదు. తర్వాత వినాయక్ కాలే (అమ్రిష్ పురి) అనే కోటీశ్వరుడికి అనధికార ద్వితీయ కళత్రమై కొంత గౌరవం పొందాననుకుంటుంది. కాని ఆ ఇంట్లో తనకు స్వేచ్ఛా స్వంతత్రాలు బొత్తిగా లేవని, కాలే వన్నీ బూటకపు మర్యాదలనీ తెలిసి మళ్లీ గతిలేక కేశవ్ ద్వారానే అక్కడి నుంచి బయటపడుతుంది. ''పడక మారుతుంది, వంటిల్లు మారుతుంది. మగాళ్ల ముసుగులు మారతాయి. కాని మగాళ్లు మాత్రం మారరు.'' అని కేశవ్ భార్య అంటుండగా మళ్లీ పాత జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ చిత్రం 1978లో స్మితా పాటిల్‌కు జాతీయ ఉత్తమ నటి అవార్డు తెచ్చిపెట్టడమే గాక శ్యాం బెనగళ్ గిరీష్ కర్నాడ్, సత్యదేవ్ దూబేలకు ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారంకూడా తెచ్చింది.
సిల్క్ స్మిత జీవితమే 'డర్టీ పిక్చర్'
ఇప్పుడు ఏక్తా కపూర్, మిలన్ లూథ్రియాలు దక్షిణాది తార సిల్క్ స్మిత కథపై తీస్తున్న 'డర్టీ పిక్చర్'లో నాయికగా విద్యా బాలన్ నటిస్తుంది. గతంలో పాప వంటి చిత్రాల్లో గంభీరమైన పాత్రలకు పేరొందిన విద్యాబాలన్ స్మితగా నప్పుతుందా ఆమె ఆకారం అలా వుంటుందా వగైరా సందేహాలు కొందరు వ్యక్తం చేసినా విద్య వాటన్నిటినీ కొట్టిపారేస్తున్నది. స్మిత అసలు పేరు విజయలక్ష్మి. నైలెక్స్ నళిని, పటాపట్ జయలక్ష్మి లాగే సిల్క్ స్మిత అన్నది కూడా ఆమెను పాపులర్ చేయడానికి తగిలించిన పేరు. నల్లగా లావుగా వుండే 'సిల్క్' లేని కమర్షియల్ చిత్రాలే ఒకప్పుడు దక్షిణాదిన వుండేవి కావు. హీరోను చూసి గాక సిల్క్ డాన్సు నెంబర్ వుందో లేదో తెలుసుకున్నాకే బయ్యర్లు కొంటారని అంటుండేవారు. ఆమె పారితోషికం కూడా చాలా భారీగా వుండేది. 'వసంత కోకిల, సీతాకోక చిలుక, బావ - బావ మరిది...' వంటి ఎన్నో చిత్రాలు ఆమె చుట్టూ తిరిగాయి కూడా. అయితే ఇంతటి ప్రసిద్ధి గల ఆమె నిజ జీవితం మాత్రం బాధామయం. చిన్న చిన్న పాత్రలు వేసే రోజుల్లో ఆమెను గుప్పిట్లో పెట్టుకున్న మూర్తి అనే ఆసామి తర్వాత కాలంలోనూ వేధిస్తూ డబ్బు గుంజుతుండేవాడు. పదేళ్ల పాటు కనకవర్షం కురిపించిన ఆ తారను అనునిత్యం వేధిస్తుండేవాడట. తట్టుకోలేక ఆమె అనేక సార్లు ఆత్మహత్యా యత్నాలు కూడా చేసింది. చివరకు విషాదకరంగా ఉరి వేసుకుని మరణించింది.
సిల్క్ స్మిత పాత్ర వేయడం తనకేమీ కష్టంగా లేదని విద్యాబాలన్ ధీమాగా చెబుతున్నది. ప్రేక్షకులకు తెలిసిందల్లా ఆమె డాన్సులు, పాటలే. ఆమె మ్యానరిజమ్స్ కూడా వారు పూర్తిగా గమనించి వుండరు. ఏ ఇందిరాగాంధీ పాత్రనో వేయాలంటే ఆమె గురించిన ప్రతి విషయమూ ప్రజలకు తెలిసి వుండే అవకాశం వుంది. అమితాబ్ బచన్ వేషం వేయాలన్నా అంతే కష్టం. కాని సిల్క్ స్మిత విషయానికి వస్తే ఆ సమస్యలేమీ వుండవు. ఆమెను గురించి నేను ఏమనుకుని ఎలా నటించాలనుకున్నానో అలాగే నటించేస్తాను అన్నారు విద్య. సిల్క్ జీవితాన్ని ప్రభావితం చేసిన ముగ్గురు పురుషులుగా నసీరుద్దీన్ షా, తుషార్ కపూర్, ఇమ్రాన్ హస్మీ నటిస్తున్నారు. అన్నట్టు విద్యా బాలన్ గతంలోనూ నిజ జీవిత పాత్ర ధరించకపోలేదు. 'నో బడీ కిల్డ్ జెస్సీకాలాల్' అన్న చిత్రంలో ఆమె అక్క షబ్రినాలాల్ పాత్ర పోషించింది.
నాయిక శారదనా షీలానా?
ఇప్పుడు మళయాలంలో జయరాజ్ రూపొందిస్తున్న 'నాయిక' చిత్రం కూడా అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం మూడు సార్లు ఊర్వశి పురస్కారం పొందిన శారద కథ అని అనుకుంటున్నారు. తెలుగు తార అయినప్పటికీ మళయాల చిత్రాల ద్వారా జాతీయ కీర్తి నార్జించిన శారద ఆ పిమ్మటే ఇంట గెలిచారు. శారద జీవితం కూడా పూలపాన్పు కాదు. మొదట్లో హాస్య పాత్రలలో కనిపించిన శారద 'తులాభారం' (తెలుగులో మనుషులు మారాలి) తర్వాతనే తారాపథం చేరుకోగలిగారు. హాస్యనటుడు చలం ను పెళ్లి చేసుకున్న శారద చాలా చేదు అనుభవాల తర్వాత విడిపోయారు. గ్లామర్ తార కాకున్నా 70, 80 దశకాలలో శారద ఒక ప్రత్యేక స్థానం పొందారు. క్రాంతికుమార్ శారద తర్వాత మహిళా ప్రధాన పాత్రల్లో శోభన్‌బాబుతో పలు చిత్రాల్లో నటించడమే గాక 'ప్రతిధ్వని' తర్వాత నాయికా ప్రధాన పాత్రలకు మారుపేరుగా వెలుగొందారు. హక్కుల కోసం పోరాడే మహిళ అంటే శారద అన్న పేరు పొందారు. అలాంటి ప్రముఖ నటి కథ అంటే అందరిలో ఆసక్తి రేకెత్తింది. అయితే అందులో నిజం లేదని శారదతో సహా సంబంధిత వ్యక్తులందరూ ఖండించారు. ఎన్టీఆర్‌తో 'భలేతమ్ముడు, నేనే మొనగాణ్ని' వంటి చిత్రాలలో నటించిన మళయాల తార షీలా కథ ఆధారంగా 'నాయిక' రూపొందుతున్నదట. పద్మప్రియ ఈ పాత్రను పోషిస్తున్నారు. శారద కూడా ఇందులో నటిస్తున్నారు. శర్వానంద్, జయరామ్, మమతా మోహన్‌దాస్ ఇతర పాత్రధారులు. తెలుగులో ఇలాంటి చిత్రాలు సూటిగా తీసిన ఉదాహరణలు లేవు గాని 'సీతామాలక్ష్మి', అంతకన్నా ఎక్కువగా 'శివరంజని' చిత్రాల్లో నాయికలను వెంటాడే శాడిస్టుల కథలను చూపించారు. అయితే అవి కూడా సంసార పక్షంగా తీయడమే తప్ప భూమికలో వలె ఆఫ్ బీట్ తరహాలో ప్రయత్నించే సాహసం జరగలేదు. ఇక ముందు కూడా జరక్కపోవచ్చు. ఎందుకంటే ఫార్ములా వలయాన్ని ఛేదించడానికి మన పరిశ్రమ నియమాలు బొత్తిగా అంగీకరించవు. పైగా హీరోల కథలను తీసినప్పుడు గొప్పగానే వుంటుంది. నాయికలపై కేంద్రీకరిస్తే హీరోలు బొత్తిగా ఒప్పుకోకపోవచ్చు. అదీ సంగతి. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన సిల్క్ స్మిత కథ ఇప్పుడు ఎలా తీస్తారో చూడాల్సిందే. కొద్ది కాలంలోనే అన్ని భాషల చిత్రాలను వూపేసిన దివ్య భా రతి కథ కూడా మర్చిపోవలసింది కాదు. ఎంతైనా ఇది పురుషాధిక్య ప్రపంచం గనకే నాయికల కథలే సినిమాలవుతుంటాయి. అందులో ఆవేదనతో పాటు ఆకర్షణా వుంటుందనే అంచనాతో.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment