Monday, November 28, 2011

ధిక్కార స్వరానికి నిలువుటద్దం మా కాళోజీ..

కాళోజీ..
ధిక్కార స్వరానికి నిలువుటద్దం..
మానవత్వపు మనుగడకు
నిలువెత్తు నిదర్శనం..
ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో పరితపించిన మహనీయుడు...
ఆయన వ్యక్తిత్వం నిఖార్సయిన ప్రశ్నల కొడవలి..
ఆయన ఖలేజాకు జీ హుజూర్.
ఈ రోజు కాళోజీ వర్థంతి సందర్భంగా ఈ సిల్‌సిలా.

హన్మకొండలోని నక్కలగుట్ట ప్రాంతంలో కాళోజీ నారాయణ రావు ఇంటికి వెళ్లాం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లోకి అడుగుపెడుతోంటే ‘ఏంరా.. ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నిస్తున్నట్లు కాళోజీ చిత్రపటాలు ఉన్నాయి ఆ గదిలో. ఓ అల్మారాలో పద్మవిభూషణ్ అవార్డు అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకవూటామన్ కాళోజీకి అందిస్తోన్న ఫొటో. వాటి ముందు ఒక సోఫాలో మౌనమునిలా కాళోజీ నారాయణరావు కుమారుడు కాళోజీ రవికుమార్ కూర్చున్నారు. ‘అమ్మగారు లేరా’ అని అడిగితే.. ‘కూర్చొండి’ అంటూ సైగ చేశారు. నాన్నగారి గురించి, ఆయన జ్ఞాపకాల గురించి చెబుతారా? అన్న ప్రశ్నకు జవాబుగా ఆయన మిగిల్చిన వారసత్వాన్ని, త్యాగాన్ని, తెలంగాణ పట్ల, దేశరాజకీయాలపట్ల, తన తండ్రితో తనకున్న సాన్నిహిత్యాన్నీ ఇలా వివరించారు.

ఆయనతో స్నేహబంధమే..
మా నాన్నగారితో నాకు స్నేహబంధమే ఉండేది. అయినా ఆయనతో మాట్లాడాలంటే భయం. ఆయన బయట అనేక రకాల అభివూపాయాలతో ఉండేవారు. ఇంట్లో మాత్రం గంభీరంగా ఉండేవారు. ఆయన చేసిన త్యాగం, తెలంగాణ కోసం తపించిన సందర్భాలు గుర్తుకువచ్చినప్పుడల్లా దుఃఖం వస్తుంది. నేను చదువుపట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. పదో తరగతి వరకే చదువుకున్నాను. నాకు చదువు మీద కంటే ఇతరత్రా అంశాలపట్ల మక్కువ ఉండేది. మా నాన్నగారి దగ్గరికి చాలామది వస్తుండవారు. రకరకాల స్వభావాలు, అభివూపాయాలు కలిగి ఉండేవారు. నా కంటే ముందు అన్నయ్య, అక్కయ్య, తమ్ముడు పుట్టిపోయారు. ఇప్పుడు నేనొక్కడినే. నాకూ మా బాబు (పేరు సంతోష్. ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్) ఒక్కడే. నన్ను చాలా మంది కాళోజీగారి అబ్బాయి అని, కొంతమంది రవికుమార్ అని, మిత్రులు చిన్నకాళోజీ అని సంబోధిస్తుంటారు. నాకు 55 ఏళ్లు యిప్పుడు. ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది. ఆయన ఏం సంపాదించారో. ఆయన దేశం కోసం, తెలంగాణ కోసం చేసిన త్యాగం ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. నేను నాన్నగారితో మాట్లాడేందుకు భయపడేవాడ్ని. ‘నీకేం కావాలో పెద్దనాన్నగారిని అడిగి తీసుకో.. నా అవసరం ఏమిటీ? నాకు లోకంతో పని. లోకంతో నాకూ పని ఉంది. వారు అనేక కష్టాల్లో ఉన్నారు. వారిని నేను చూసుకుంటాను. నీకు కావలసినవన్నీ పెద్దనాన్న చూసుకుంటారు’ అని అనేవారు ఆయన. నాకేం కావాలన్నా మా పెద్దనాన్న కాళోజీ రామేశ్వరరావునే అడిగేవాడ్ని. నాకు కావలసివన్నీ చిన్నతనం నుంచి ఆయనే సమకూర్చేవారు.

నాన్నగారి కోసం అనేక మంది దేశం నలుమూలల నుంచి వచ్చేవాళ్లు. సాహిత్యరంగంలో శ్రీశ్రీ మొదలు, దాశరథి సోదరులు, సినారె, బిరుదురాజు రామరాజు, పల్లా దుర్గయ్య ఇలా ఎంతో మంది వచ్చేవారు. ఎవరు వరంగల్‌కు వచ్చినా ఆయనతో మాట్లాడందే తిరిగి వెళ్లేవాళ్లు కాదు. వాళ్లు మాట్లాడుతుంటే నేను వినేవాణ్ణి. వారిలా ఆలోచించే వాణ్ణి. కానీ నేను వారిలా తయారుకాలేదన్న బాధ నాకిప్పటికీ ఉంటుంది. నేను చదివిన చదువుకు తగ్గట్టుగా అప్పుడు నాకు ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగం వచ్చింది. నన్నందరూ కాళోజీ గారి అబ్బాయి అని చూసేది. ఆయన పేరును ఎట్టిపరిస్థితుల్లోనూ బదునాం చేయవద్దని ప్రతీక్షణం అనుకునేవాణ్ణి. ఇప్పటి వరకు ఆ పనిచేయలేదనే నమ్ముతాన్నేను. నేను ఇప్పుడు వీఆర్‌ఎస్ తీసుకొని ఇంటివద్దే ఉంటున్నాను. సాహిత్యంలో పెద్దగా ప్రవేశం లేకపోయినా నాన్న వారసత్వంగా వచ్చిన అక్షరాల కోసం నగరంలో జరిగే సాహితీసభలకు వెళుతుంటాను. మిత్రమండలి సమావేశానికి క్రమం తప్పకుండా హాజరవుతుంటాను.

దేశమంత ఇల్లు కట్టుకున్నారు: రుక్మిణిబాయి
ఆయన దేశాలు తిరిగేది. ఇంటిపట్టున ఉండేవాడు కాదు. ముక్కుసూటి మనిషి. బయట ఏదన్నా ఘోరం జరిగిందని తెలిస్తే వలవలా కన్నీళ్లు కార్చేవారు. నాకు 12 ఏళ్ల వయస్సున్నపుడే ఆయనతో పెళ్లి అయింది. ఇప్పుడు 87 సంవత్సరాలు. ఆయన ఇంటిని పట్టించుకోలేదు. కానీ ఈ దేశమంతా ఇల్లుకట్టుకునే ఉన్నారు. అందరూ ఆయనను ఆరాధనగా కొలుస్తుంటే నాకు ఇంకేం కావాలనిపిస్తది. ఆయనతో మాట్లాడాలంటే ఇంట్లో వాళ్లు భయపడేది. మాకు పెళ్లయిన కొత్తలో వరంగల్‌లో ఉండేవాళ్లం. ఆయన దేశాలు పట్టుకొని తిరిగేవారు కదా. మొదట పెళ్లే వద్దన్నాడట. కానీ ఆయన గురువు డి.రాజా(రాజేశ్వరరావు) నాకు మేనమామ. ఆయన కుదిర్చిన పెళ్లే. పెళ్లిచూపుల తరువాత నాలుగోనాడు నన్ను ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకున్నాడు. మా అత్తామామలు రమాబాయి, రంగారావులు. మా బావగారు రామేశ్వరరావుగారే ఇంటిని చూసుకున్నారు. కొంతకాలం మేం వరంగల్‌లో ఉన్నాం. అప్పుడొకసారి ఆయన దేశాలుపట్టుకొని తిరుగుతున్నప్పుడు మేం ఉంటున్న కిరాయి ఇంటిని ఖాళీ చేయమన్నారు. ఏదో మాటవరుసకు అంటున్నారు కదా అని అనుకున్నాను. కానీ వాళ్లు మా సామాను అంతా ఓ బండిలో వేసి మా బావగారి ఇంటికి పంపారు. అప్పటి నుంచి ఇదిగో ఇక్కడే ఉంటున్నాం. (కాళోజీ నారాయణగారికి ఇప్పటికీ ఆయన పేరుమీద ఓ సొంత ఇల్లూ కూడా లేదు. ఆయన ఎమ్మెల్సీగా, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్నారు). ఆయన జ్ఞాపకాలంటే ఎన్నని చెప్పను. రోజూ ఈ గదిలో కూర్చొని ఆయనతో నేను ఢిల్లీకిపోయిన సంగతిని, విశాఖపట్నం పోయిన సంగతి గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాను. అసలు ఆయనను మరచిపోతేనా.

ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆయన ఎప్పుడూ తెలంగాణ కోసం ఆరాటపడేది. ఇది అందరికీ తెలుసు. ఆయనకు పీవీసాబ్ ఢిల్లీలో (పద్మవిభూషణ్ అవార్డు సందర్భంగా) అవార్డు ఇచ్చినపుడు ఆయనతో వెళ్లాను. అందరూ ఆయన్ని తెలంగాణ కాళోజీ అన్నారప్పుడే. అసలు తెలంగాణోళ్లకు అవార్డు కూడా ఇస్తారా? అని కొందరు ఆయనతోనే అన్నారట. దానికి ఆయన వారితో పెద్దయుద్ధమే చేశారుపూండి. ఆయన బతికినన్నాళ్లు తెలంగాణ కోసమే బతికారు. ఆయనలో సగభాగమైన నేను తెలంగాణ అనకుండా... లేకుండా ఎందుకుంటాను చెప్పండీ?

ప్రశ్నల కొడవలి..
తెలుగునాట ఆ మాటకు వస్తే యావత్ దేశంలోనే పరిచయం అవసరం లేని ధిక్కార కాగడ కాళోజీ. ఆయన అసలుపేరు రఘువీర్ నారాయణ లక్ష్మికాంత శ్రీనివాసరావు రామరాజా కాళోజీ. ఆయన 9 సెప్టెంబర్, 1914న జన్మించారు. తండ్రి రంగారావు, తల్లి రమాబాయి. అన్నయ్య ప్రముఖ ఉర్దూకవి, న్యాయవాది కాళోజీ రామేశ్వరరావు. వరంగల్ జిల్లా హన్మకొండ మండలం మడికొండ నివాసం. ఆయన ప్లీడరీ చేసినా సాహితీవేత్తగా, ఉద్యమవేత్తగా, కార్యకర్తగా, గ్రంథాలయోద్యమనాయకుడిగా, విద్యార్థి సంఘాల నాయకుడిగా, కవిగా, పౌరహక్కుల గొంతుకగా అసమ్మతీ నిరసన, ధిక్కారాల స్వరంగా అందరికీ కేరాఫ్ అడ్రస్. ఇంట్లో ఉన్నా, కోర్టులో ఉన్నా, సభలో ఉన్నా, వక్తగా ఉన్నా చివరికి జైలులో ఉన్నా ఆయన వ్యక్తిత్వం నిఖార్సయిన ప్రశ్నల కొడవలి. ఆయన చాలా మందికి ఎమ్మెల్సీ అని ఈ తరం ప్రజావూపతినిధులకు తెలియకపోవచ్చు. అలుపెరుగని ప్రజాఉద్యమ కార్యకర్తగా ఉన్న ఆయన తెలంగాణ కోసం నిత్యం తపించేవారు. 1933లో వైతాళిక సమితి స్థాపించారు. వందేమాతర ఉద్యమానికి విరాళాలు సేకరించారు. గొప్ప దేశభక్తుడు. తెలంగాణ ఆరాధ్యుడు. ఆయన అసలు సిసలు ప్రజాసామ్యవాది. ఇవన్నే కాదు ఆయన క్రికెట్ అంటే చెవి కోసుకునేవారు. ఆయనకు 1992లో పద్మవిభూషణ్ వచ్చింది. కాళోజీ కథానికలు, ఖలీల్ జీబ్రాన్ అనువాద రచ లతోపాటు అనేక మరాఠీ, బెంగాలీ, రచనలకు తెలుగు అనువాదాలు చేశారు. 1946లో పార్ధీవవ్యయంగా రూపుదిద్దుకున్న నా గొడవ ఆరు సంపుటాల సమగ్ర సాహిత్యం ఆనాటి ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆయన 13, నవంబర్ 2002లో అస్తమించారు. ఆయన వర్థంతి సందర్భంగా కాళోజీ ఫౌండేషన్ మొట్టమొదటిసారిగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ మాస్టారు (ఆదిలాబాద్, యాది సదాశివ)కు స్మారక అవార్డు ఇస్తున్నారు.

No comments:

Post a Comment