రాజకీయ కథనం కాకపోయినా ఒక సినిమా రాజకీయాలను ప్రభావితం చేయగలదా? అంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒక పాత ఆనకట్ట కూలిపోతే ఎటువంటి ఉపద్రవాలు సంభావిస్తాయో చూపే హాలివుడ్ చిత్రం ‘డ్యామ్ 999’ విడుదల ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. తమిళనాడు, కేరళల మధ్య వివాదంగా ఉన్న ముళ్ళపెరియార్ ఆధారంగా తీసిన చిత్రమిదంటూ డిఎంకె అధ్యక్షుడు ఎం.కరుణానిధి బుధవారం బహిరంగంగా ఈ చిత్ర విడుదలను వ్యతిరేకించారు. పైగా, ఈ చిత్రాన్ని విడుదల చేస్తే అది రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉన్న సత్సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తుందని ఆయన ఒక ప్రకటనలో హెచ్చరించారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే, రాష్ట్రంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడాన్ని నిలిపివేయాల్సి వస్తుందని ఆయన అన్నారు.
సోహన్ రాయ్ దర్శకత్వం వహించిన, నవంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని నిషేధించాలని ఎండిఎంకె నాయకుడు వైగో, పిఎంకె వ్యవస్థాపకుడు ఎస్.రాందాస్ డిమాండ్ చేసిన ఒక రోజు అనంతరం కరుణ స్పందించారు. ఎన్నో సంవత్సరాలుగా ముళ్ళపెరియార్ డ్యాం సమస్య పరిష్కారం కాకుండానే ఉండిపోయిందని, ఈ ఆనకట్టపై తమిళనాడుకు ఉన్న 999 సంవత్సరాల హక్కులను ప్రస్తావిస్తూనే సినిమాకు ఆ పేరు పెట్టారని కరుణానిధి అభిప్రాయపడ్డారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న 116 సంవత్సరాల ఆనకట్ట తమిళనాడు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నది. దక్షిణ జిల్లాల నీటిపారుదల అవసరాలను ఇది తీరుస్తున్నది. భద్రతకు సంబంధించి వ్యక్తమవుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని పాత ఆనకట్ట స్థానంలో కొత్తదానిని నిర్మించాలని కేరళ ప్రతిపాదించింది. అయితే అది రాష్ట్ర ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందనే కారణంతో తమిళనాడు దానిని వ్యతిరేకిస్తున్నది.
ఈ అంశాన్ని తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తిన విషయాన్ని పేర్కొంటూ, కేంద్రం, చిత్ర పరిశ్రమ అన్ని విషయాలను పరిగణించి నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావాన్ని కరుణానిధి వ్యక్తం చేశారు.కాగా, శుక్రవారం నాడు ఈ చిత్ర విడుదలను నిరసిస్తూ తమ పార్టీ కార్యకర్తలు శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తారని వైగో వేరొక ప్రకటనలో తెలిపారు. సినిమా ప్రివ్యూను అడ్డుకునేందుకు ఎండిఎంకె కార్యకర్తలు ప్రివ్యూ థియేటర్‌లో ఫిల్మ్ రోల్స్‌ను సోమవారం ధ్వంసం చేసిన ఘటనలో పది మందిని అరెస్టు చేశారు.ఇదిలా ఉండగా, ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా నిషేధించాలని బిజెపి తమిళనాడు శాఖ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ డిమాండ్ చేశారు.
ఈ చిత్రం ప్రజలలో అనవసరమైన ఆందోళనను సృష్టిస్తుందని, ముఖ్యంగా కేరళ వాసులను గందరగోళంలో పడేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ సినిమాను నిషేధించకపోతే, తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో దీనిని ప్రదర్శించడాన్ని నిషేధించాలని ఆయన కోరారు. ేరళ, తమిళనాడుతో సహా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అటువంటి చిత్రాలను ప్రదర్శించడాన్ని అడ్డుకోవాలని ఆయన అన్నారు. ముఖ్యంగా, ఆ ఆనకట్టను తనిఖీ చేసి కేంద్ర, రాష్ట్ర నిపుణుల బృందాలు దాని భద్రతకు ఎటువంటి ముప్పులేదని హామీ ఇచ్చిన తర్వాత ఇటువంటి చిత్రాలను ప్రదర్శించడానికి అనుమతివ్వకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ 999 కథనం
తన రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రతిష్ఠకోసం లక్షలాది ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తూ ఒక అవినీతి మేయర్ కొత్త ఆనకట్టను నిర్మిస్తాడు. ఈ నేపథ్యంలో తన సోదరిని కాపాడే నావికుడు, కలవాలనుకున్న ఇద్దరు ప్రేమికులు, తన కుటుంబాన్ని దక్కించుకోవాలని ఒక మహిళపడే తపన, తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న ఒక బాలుడు, మరణంలో కూడా తన భర్త వెంటే ఉండాలనుకునే భార్య; వారి పరిస్థితిని ముందుగానే చూసిన జ్యోతిష్కుడు - ఇలా జరుగనున్న ఉపద్రవంతో తొమ్మిది జీవితాలు ముడిపడి ఉన్న కథ ఇది. తొమ్మిది పాత్రలు, తొమ్మిది చిత్తవృత్తులు కూలిపోతున్న భావోద్వేగాల ఆనకట్టే ఈ చిత్రం.
చైనాలో 1975లో దాదాపు 250,000మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న బాంకియావో ఆనకట్ట విధ్వంసంపై డ్యాం 999 వెలుగు ప్రసరిస్తుంది. ఇక భారతదేశంలో కేరళ- తమిళనాడు సరిహద్దులలోని ఇడుక్కి జిల్లాలో ఉనన ముళ్ళపెరియార్ ఆనకట్ట వద్ద భూప్రకంపనలు తిరిగి చోటు చేసుకున్న నేపథ్యంలో డ్యాం 999 కేరళ ప్రభుత్వానికి మేల్కొలుపులా ఉపయోగపడుతుంది.ఈ సంవత్సరం జనవరి నుంచి ఇడుక్కిలోని కొన్ని ప్రాంతాలలోనూ, పక్కనే ఉన్న కొట్టాయం, పాతానంతిట్ట జిల్లాల్లోనే 22సార్లు స్వల్పంగా భూమి కంపించి, అనంతర ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అధికారులు వెల్లడించారు. గత వారమే డ్యాం ప్రాంతం సహా రిక్టర్ స్కేల్‌పై 2.02, 3.04లతో రెండుసార్లు భూమి స్వల్పంగా కంపించింది. రిజర్వాయర్ కింద రెండు బీటలు ఏర్పడ్డాయని, తాజాగా చోటు చేసుకున్న ప్రకంపనల కారణంగానే ఇది జరిగి ఉండవచ్చని రిజర్వాయర్ ఇన్‌ఛార్జి అధికారులు పేర్కొన్నారు.
కేరళలోని ఇడుక్కి ప్రాంతం ట్రావెంకోర్ రాజ్యం, తమిళనాడు కింద, బ్రిటిష్ పాలనలో మద్రాసు ప్రావిన్సులో ఉన్న సమయంలో ముళ్ళపెరియార్ ఆనకట్టను నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఆనకట్ట మధ్య తమిళనాడు జిల్లాలకు నీటిపారుదలకు ఆధారంగా ఉంటూ వస్తున్నది. అయితే గత రెండు దశాబ్దాలుగా ఈ ఆనకట్ట ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశమైంది. కేరళ ప్రభుత్వం ప్రస్తుతమున్న ఆనకట్టను డికమిషన్ చేసి కొత్తది నిర్మించాలన్న యోచన తమిళనాడుకు ఆమోదయోగ్యం కాలేదు.
స్థానిక ప్రతిఘటన బృందాలను పక్కన పెడితే ఇరు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఈ అంశంపై తీవ్రమైన వైఖరినే తీసుకున్నాయి. ముళె్ళైపెరియార్ ఆనకట్టను అంతరించిపోతున్న ఆనకట్టల జాబితాలో చేర్చడంతో ఆ డ్యాంలో నీటి స్థాయి 136 ఫీట్లకు మించి ఉండడాన్ని నిరోధిస్తూ కేరళ ప్రభుత్వం 2006లో కేరళ నీటిపారుదల, నీటి సంరక్షణ (సవరణ) చట్టం 2006ను ఆమోదించింది. డ్యాం 999కు సోహన్ రాయ్ దర్శకత్వం వహించగా, రజిత్ కపూర్, జోషువా ఫ్రెడ్రిక్ స్మిత్, లిండా ఆర్సెనియో, గ్యారీ రిచర్డ్‌సన్, జాలా పిరింగ్, ఆశిష్ విద్యార్ధి, వినయ్‌రాయ్, విమలా రామన్, మేఘా బర్మన్‌లు ఇందులో నటిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment