November 17th, 2011
తారాగణం:
రణబీర్ కపూర్
నర్గీస్ ఫకీరీ
అదితి రావ్ హైదరీ, పియూష్ మిశ్రా
శిఖా జైన్ తదితరులు
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్
రచన, దర్శకత్వం: ఇంతియాజ్ అలీ
సంగీత ప్రపంచం గురించి ఇంకా కొత్తగా ఏం చెబుతారు? ప్రత్యర్థితో తలపడి విజయం సాధించే ‘డిస్కో డాన్సర్’ దగ్గర్నుంచీ, అంగవైకల్యాన్ని అధిగమించి సంగీతకారుడిగా నిలదొక్కుకునే ‘సౌండ్ ట్రాక్’ వరకూ అనేకం వచ్చాయి. ఇంకా కొత్తగా ‘రాక్ స్టార్’లో చెప్పడానికేముంటుంది? జబ్ వి మెట్, లవ్ ఆజ్‌కల్ చిత్రాల దర్శకుడు ఇంతియాజ్ అలీకి ప్రేమకథలు తీయడం తప్ప ఇంకో ఆసక్తి లేదు. తీసిన రెండు ప్రేమ కథలూ ప్రేమ కథలపట్ల అతడి దృక్పథాన్ని విభిన్నంగా చాటాయి. అతి సంక్లిష్టంగా వుండే ప్రేమ కథలకి కళాత్మక విలువలతో క్లాసిక్‌గా తిర్చిదిద్దే అతడి చపలత్వాన్ని ప్రపంచం గమనించింది. అతడిలో ఒక మణిరత్నం, ఇంకో సంజయ్‌లీలా భన్సాలీ ఇద్దరూ వుంటారు. అయితే ప్రేమ కథలతో చాపల్యం కూడా శృతిమించినప్పుడు- లేదా గత సినిమాల కంటే పై స్థాయిలోప్రతిష్ఠించాలన్న ఆదుర్దా అదుపుతప్పినపుడు- అసలుకే మోసం వస్తుంది. అసలేం చెప్పాడన్న గందరగోళమేర్పడుతుంది.
‘రాక్‌స్టార్’ సంగీతంలో అర్హత సంపాదించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసే కళాకారుడి కథగా - కొత్త కొత్తగా కన్పించి, అంతలోనే అభినవ దేవదాసుగా మారిపోయే అర్థంకాని ప్రేమ కథలోకి తిరగబెట్టే ప్రశ్నార్థకం. ఆకస్మిక ముగింపు ఒక శరాఘాతం.
ఇలా దేవదాసుగా మారిపోయి కళని చెడగొట్టుకునే క్రమం ఇంకో రూపంలో మాదక ద్రవ్యాలతో ‘సౌండ్ ట్రాక్’ ఫస్ట్ఫాలోనే చూశాం. అక్కడ సెకెండాఫ్‌లో తప్పు తెలుసుకున్న హీరో మాదక ద్రవ్యాలతో ప్రాప్తించిన అంగవైకల్యాన్ని జయిస్తాడు. తిరిగి సంగీతకారుడిగా మెరుస్తాడు. ‘రాక్‌స్టార్’లో ప్రేమ మత్తులో కళని చెడగొట్టుకుని, ప్రేమలోనే మునిగి తేలతాడు. ప్రేమ అన్నం పెడుతుందా? దేవదాసు భగ్నప్రేమికుడిగా జీవితాన్ని నాశనం చేసుకుంటే, ఇంతియాజ్ అలీ- ఆ కథని సంగీతానికి పేస్ట్ చేసి కొత్త సృష్టి చేశాననుకొన్నాడు. కానీ దీన్ని ఒక లాజికల్ ఎండ్‌కి తీసుకెళ్ళడంలో విఫలమయ్యాడు.
అయితే సంగీతం కోసం కావచ్చు, తర్వాత ప్రేమ కోసం కావచ్చు, ఇంకా మొదట పల్లెటూరి బైతుగానూ కావచ్చు- ఈ మూడు భిన్న రూపాల్లో రణబీర్‌కపూర్ మాత్రం దేవదాసు కంటే మత్తుగా జీవించాడు. పాత్రల్లోకి దూరిపోయి తను కన్పించకుండా పోయాడు. నటనలో ఇంత పిచ్చిని కనబర్చిన స్టార్‌ని ఈ మధ్యకాలంలో చూడలేదు. అసలు కథెలా ఉన్నా రణబీర్‌కపూర్ పాత్రల్ని అపహరిచుకుపోయి నటనలో మజా అంతా తీర్చుకున్నాడు. వచ్చే సంవత్సరం అతడ్ని ఘెరావ్ చేసేందుకు పెద్ద పెద్ద అవార్డులు పొంచివున్నా ఆశ్చర్యం లేదు. అతను తండ్రి (రిషీకపూర్)ని మించిన తనయుడయ్యాడు. జనార్థన్ జాకఢ్ అలియాస్ జోర్డాన్ (రణబీర్ కపూర్) రాక్‌స్టార్‌గా ఎదగాలని పల్లెటూరు నుంచి గిటార్ పట్టుకుని ఢిల్లీ వచ్చి బస్టాండ్‌లో న్యూసెన్స్ చేస్తుంటే, పోలీసు చెంపవాయించి పట్టుకు పోతాడు. అతనసలు చదువు కోసం వచ్చాడు. కానీ సంగీతమంటే పిచ్చి. నీ పిచ్చిని ఇలా తీర్చుకోలేవు, ఈ పిచ్చి తీరాలంటే నీకింకో పిచ్చి పట్టాలని పొడుస్తూంటాడు కాలేజీ క్యాంటీన్ మేనేజర్. గొప్పగొప్ప కళాకారులు దేనికో మనసు విరిగి, ఆ మంటతో కళాకారులు కాగలిగారంటారు. నీకలాటి గొప్ప సామాజిక బాధలు కలగకపోవచ్చు కానీ, కనీసం ఎవర్నో ప్రేమించి భగ్నప్రేమికుడివికా- అప్పుడు ర్టాక్‌స్టార్‌వి అవుతావని మార్గ నిర్దేశం చేస్తూంటాడు. ఇక జోర్డాన్ మనసు విరిగేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూంటాడు. కానీ ఎవరూ సహకరించరు.
అప్పుడొక అందమైన అమ్మాయి హీర్ (నర్గీస్ ఫకీరీ) కన్పిస్తుంది. ఈమెతో తన ఆశయం నెరవేరచ్చు అనుకుని వెంటపడతాడు. కానీ ఆమె ఛీ కొట్టకుండా ఇష్టపడేసరికి దెబ్బతింటాడు. ఇంకా ఆమె తాగుడికీ, ‘సి’ గ్రేడ్ సెక్స్ సినిమాలకీ తీసికెళ్ళేసరికి - కష్టమనుకుంటాడు. చివరికామె తనకి జరగనున్న పెళ్ళిగురించి చెప్పేసరికి అడ్డంగా మనసు విరిగిపోతుంది. ఇక గిటార్ పట్టుకుని చెలరేగిపోయి అంతర్జాతీయ ప్రదర్శనలకి ఎదిగిపోతాడు. రాక్‌స్టార్ అన్పించుకుంటాడు.
కానీ ఆమె మీద ప్రేమని చంపుకోలేకపోతాడు. ఆమె వుంటున్న ‘ప్రాగ్’కి చేరుకుని ఆమె వైవాహిక జీవితంతో చెలగాటమాడుతుంటాడు. పోలీసులు, అరెస్టులూ కేసులూ వీటన్నిటి మధ్య ఇంకా దేవదాసుగా మారిపోయి అభిమానుల చేత ఛీ కొట్టించుకుంటాడు. రాక్‌స్టార్‌గా పతనవుతాడు.
అయితే ఇలా దేవదాసుకి సాహసించగల్గిన దర్శకుడు దాన్ని విషాదాంతం చేయడానికి ఈ కాలం ప్రేక్షకుల దృష్ట్యా భయడినట్టు- సుఖాంతం చేశాడు. అయితే ఇక్కడ ప్రేమ, సంగీతం అనే రెండు గమ్యాలున్నాయి. ప్రేమ సబ్జెక్టివ్ స్టోరీ పాయింట్ అయితే, సంగీతం ఆబ్జెక్టివ్ స్టోరీ ప్రాబ్లం. ప్రేమతో ప్లాట్ క్లయిమాక్స్‌వుంటే, సంగీతంతో స్టోరీ క్లయిమాక్స్. ప్లాట్ క్లయిమాక్స్‌తో ముగించాలంటే అందులో పే ఆఫ్ కాని బీట్స్ ఏమీ లేవు. ఆమెకి పెళ్లయి పోయింది. ప్రధాన కథ సంగీత ప్రయాణం అయినప్పుడు ఈ సినిమా స్టోరీ క్లయిమాక్స్‌నే డిమాండ్ చేయాలి. ఇందులో కావలసినన్ని పే ఆఫ్ కాని బీట్స్ వున్నాయి దీన్ని విస్మరించి పెళ్ళయిన హీరోయిన్‌తోనే ప్రేమ కథని ఒక ఆకస్మిక పరిణామంతో సుఖాంతం చేయడంతో తెల్లబోవడం మనవంతైంది. సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘హమ్ దిల్‌దే చుకే సనమ్’లో హీరోయిన్‌కి పెళ్ళయినా కాపురం చేయలేదు. హీరో హీరోయిన్ల బాధచూసి ఆమెకి విముక్తి కల్గిస్తాడు భర్త. ఇది ఇండియన్ సెంటిమెంటు. కానీ ఇంతియాజ్ అలీ ఫారిన్ సెంటిమెంటు కోసం తీసినట్టు ఈ సినిమా తయారైంది.
ఈ సినిమాకి ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం పెద్ద ఎస్సెట్ అని బయట అన్పించినా, సినిమాలో చాలాపాటలు పల్లవి, లేదా ఒక చరణంతో ముగిసిపోయేవే!
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment