November 24th, 2011
** శ్రీరామరాజ్యం ( ** ఫర్వాలేదు )
బాలకృష్ణ, నయనతార, అక్కినేని నాగేశ్వరరావు, శ్రీకాంత్, విధూసింగ్, సంగీతం: ఇళయరాజా
మాటలు: ముళ్లపూడి
పాటలు: జొన్నవిత్తుల
నిర్మాత: యలమంచిలి సాయబాబు
దర్శకత్వం: బాపు
---
అందరికీ తెలిసిన కథే..తెలుగునాట సినీ ప్రేక్షక జనాన్ని నేటికీ వెంటాడే ఉత్తర రామ చరితానికి వెండితెర రూపం ఇచ్చిన ‘లవకుశ’. ఇప్పుడు శ్రీరామరాజ్యం పేరిట ఆధునిక సాంకేతిక హంగులతో మళ్లీ సాక్షాత్కరించింది. ఈ శ్రీరామరాజ్యం దిగ్ధర్శకుడు బాపు తన అనుభవాన్ని రంగరించి తెరపై ‘రంగు’రించిన ‘చిత్రం’. చిత్రంలో కాకలు తీరిన నటీనటులు వుండొచ్చు..ఆ వెనుక వెన్నుదన్నుగా సరైన సాంకేతిక నిపుణులుండొచ్చు. కానీ ప్రతి ఫ్రేమ్‌లో, నటీనటుల హావభావాల్లో, కెమేరా కదలికల్లో, సెట్ ప్రాపర్టీస్‌ల్లో ఆరంభం నుంచి సమాప్తం వరకు బాపు కనిపిస్తూనే వుంటే, సినిమాలోని ప్రతి మాటలో రమణ వినిపిస్తూనే వుంటారు. అందుకే ఇది శ్రీరాముడి..శ్రీరామరాజ్యం కాదు. అచ్చంగా బాపురమణల శ్రీరామరాజ్యం.
లంకలో రావణుడ్ని దునుమాడిన అనంతరం పుష్పకంలో అయోధ్యకు సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా అయోధ్యకు రావడంతో కథ ప్రారంభమవుతుంది. తమ అభిమాన రామచంద్రునికి జనం సాదర స్వాగతం పలకడం, పదునాలుగేళ్ల క్రితం అర్ధాంతరంగా ఆగిన పట్ట్భాషేకం సంపూర్తికావడం, ఇక అంతా బాగే అనుకున్న సమయంలో, సాధారణ పౌరుడి మత్తుపలుకులు ములుకులుగా గుచ్చుకున్న ఆవేదనతో రాముడు, అగ్ని పునీత సీతను అడవులకు పంపడం, ఆమె అక్కడ వాల్మీకి ఆశ్రమంలో లవకుశలకు జన్మనివ్వడం చిత్రంలోని కొన్ని ఘట్టాలు. ఆపై రాముని అశ్వమేధయాగ ప్రయత్నం, ఆ అశ్వానికి అడ్డు పడిన రాముని బిడ్డలు, చివరికి భూజాత తల్లి ఒడికి చేరడంతో చిత్రం ముగుస్తుంది.
శ్రీరామరాజ్యం సినిమాను తీయాలనుకోవడం మూడంచెల రిస్క్. ఒకటి నేటికీ జనం కళ్లల్లో నిలిచిపోయిన ‘లవకుశ’. రెండు వేగానికి మారుపేరుగా మారిపోయిన జీవితాలకు, మెలోడ్రామా రంగరించిన కథను అందించాల్సి రావడం. మూడవది కనీసం రెండు మూడయినా పెద్ద సినిమాలు తీసుకోవడానికి సరిపోయేంత బడ్జెట్ అవసరం. చివరిదైన బడ్జెట్ సమస్యను అధిగమించే నిర్మాత (యలమంచిలి సాయిబాబు) సినిమాకు లభించడం తొలి సౌలభ్యం. అంతటి బడ్జెట్ అందుబాటులో వున్నా, ఉత్తర రామాయణ కావ్యాన్ని రమణీయంగా తెరకెక్కించగల దర్శకుడు బాపును సినిమాకు ఎంచుకోవడంతో తొలి సమస్య తొలగి లవకుశకు దీటైన సినిమా కళ్ల ముందు నిలిచింది, ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపూ లవకుశ పెద్దగా స్ఫురణకు రాలేదంటే దానికి కారణం ముమ్మాటికీ నిర్మాత-దర్శకుడు సమష్టిగా చేసిన కృషే. కానీ ఎటొచ్చీ ముందు చెప్పుకున్న రెండో సమస్య మెలోడ్రామా సంద్రాన్ని దాటడానికి మాత్రం ఈ ఇద్దరూ కలిసి సరైన వారధి నిర్మించలేకపోయారు. అదే ఈ సినిమాకు ప్రతిబంధకంగా నిలిచింది. అందునా ప్రతి ఫ్రేమ్‌ను వీలయినంత స్పష్టంగా తీసే బాపుశైలి ఈ మెలోడ్రామాను మరింత పెంచింది. దీనికి తోడు క్లయిమాక్స్‌ను కాస్త కట్‌షార్ట్ చేయడం కూడా జనానికి నచ్చదు గాక నచ్చదు. వాస్తవానికి ఈ సినిమాకు ఆయువుపట్టు అదే. తండ్రీ తనయుల నడుమ వాదన, పోరు అన్నది కీలకమైన అంశం. దాన్ని తృటిలో తేల్చేసి బాపు లాంటి దిగ్దర్శకుడు కూడా కాస్త తప్పు చేసారనిపించింది. ఎలాగూ పౌరాణికం తీయాలని సాహసించినపుడు, క్లయిమాక్స్‌లోనైనా ఒక్క పద్యం వినిపించే ధైర్యం చేయాల్సింది. ‘చిన్నిపాపలు..కడసారి చెప్పుచుంటి..’ ‘చాలు.చాలు’ లాంటి లవకుశ పద్యాలు ఇప్పటికీ జనానికి గుర్తున్నాయి. సినిమాకు మరో కీలక సన్నివేశమైన పామరుడైన రజకుడు భార్యతో అడ్డగోలు వాదనకు దిగడం, అది రాముడిలో రేకెత్తించిన ఆలోచనా సంచలనం కూడా అంతగా పండలేదు. రామాయణ కథానాయకుడి పాత్ర ఔచిత్యం వర్తమానం జనం దృష్టిలో పలుచన కావడం మంచిది కాదన్న ఉద్దేశంతో సృష్టించిన రాముడి సీతావిరహవేదన దృశ్యాలు సినిమాకు కాస్త బరువుగా మారాయి. పైగా కాస్త సృజన కలిగిన దర్శకులంతా చేసిన తప్పే బాపూ కూడా చేశారనిపించింది. సినిమాని దృశ్య కావ్యంగా మలచడంలో పెట్టిన శ్రద్ధ స్క్రిప్ట్ మీద అంతగా పెట్టలేదనిపించింది.
ఇక సినిమాకు సాంకేతిక పరంగా ప్రాణం పోసింది ఆర్ట్ డైరక్టర్ల కృషి. ఆపై ఇళయరాజా స్వరసమ్మేళనం. అందుబాటులోకి వచ్చిన వస్తుసామగ్రి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో అయోధ్యను, రామమందిరాన్ని, వాల్మీకి ఆశ్రమాన్ని కళ్ల ముందు అధ్బుతంగా సాక్షాత్కరింపచేయగలిగారు. రాముడి దర్బారు, శయన మందిరం, రాజభవనం, నిలువులెత్తు సూర్యవిగ్రహం, ప్రతి ఒక్కటీ ప్రేక్షక జనం కళ్లను మైమరిపింపచేస్తాయి. వాటి కొలతలన్నీ సినిమాకు భారీతనాన్నిచ్చాయి. బాపు ఊహాశక్తికి రూపం ఇచ్చిన ఆర్ట్ డైరక్టర్ల కృషికి ఫొటోగ్రాఫర్ రాజు కృషి తోడై మరింత ఆకర్షణ కూర్చింది. ఫొటోగ్రాఫర్ రాజు కూడా బాపు శైలిని ఆకళింపు చేసుకుని, కెమేరా కదలికలన్నీ తదనుగుణంగా నడిపించాడు. పైగా ఇందుకు గ్రాఫిక్స్ తోడయ్యాయి. అగ్ని, వరుణ, వాయు, సుదర్శన, పాశుపత, బ్రహ్మాస్త్రాలను గ్రాఫిక్స్‌లో చిత్రీకరించిన తీరు బాగుంది. సినిమాకు ఇళయరాజా అందించిన నేపథ్యసంగీతం, పాటలు ఎంతయినా ప్రశంసాపాత్రం. కానీ ఎటొచ్చీ ‘ఓ రామా లేరా..రఘురామా’ పాటలో మొదటి చరణం ఎందుకు తీసేసారో తెలియదు. స్క్రిప్ట్‌కు అనుగుణంగా నడవడం వల్ల కావచ్చు ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ వుండదు. ఇక ముళ్లపూడి వారి మాటలు. పౌరాణికం అయినా తన చమక్కు, వెటకారం, చమత్కారం తనదే అనిపించారు ఆయన తన చివరి సినిమాలో సైతం. సీతా లక్ష్మణ సంవాదం, సీతాభూదేవి సంభాషణం, సీతారాముల ముచ్చట్లు అన్నింటా రమణ మార్కు పండింది. ‘సూర్యవంశ రాజ్య ప్రతిష్టలో నా బాధ్యత ఏమీ లేదా..నన్ను త్యజిస్తే సూర్యవంశ ప్రతిష్ట ఇనుమడిస్తుందా అనే అర్థాల్లో సీత ప్రశ్నించిన తీరు ఆధునిక భావజాలానికి సరిపోతాయి. జొన్నవిత్తుల పాటలు ఇప్పటికే జనానికి పట్టాయి. అయితే పాటల్లో వాడిన పదాలే మళ్లీ మళ్లీ వాడకుండా, మరిన్ని పదాలు చేర్చి వుంటే బాగుండేది.
సినిమాలోని పాత్రధారుల్లో ఎక్కువ మార్కులు సంపాదించినది సీత పాత్రధారిణి నయనతార. సహజంగానే బాపు సినిమాల్లో కథానాయికలకే ఎక్కువ మార్కులు పడతాయి. దీనికి తోడు సినిమా మూడు వంతులు సీత పాత్ర చుట్టూనే తిరుగుతుంది. దీనికి నయనతార ఆహార్యం, నటన తోడయ్యాయి. సినిమా చూస్తున్నపుడు ఆమె నటించిన గతకాలపు వాణిజ్య సినిమాలు ఏవీ గుర్తుకురావు. కేవలం కళ్ల ముందు సీత మాత్రమే సాక్షాత్కరించేలా చేయగలిగింది. ఇక రాముడిగా నటించిన బాలకృష్ణను ఏ మేరకు, ఏయే యాంగిల్స్‌లో ఎలా చూపించాలో, అంతమాత్రమే చూపించడం, ఎంత మేరకు తెరపై వుండాలో అంతమేరకే వుంచడం అతగాడికే అనుకూలించింది. అసలు ఎన్టీఆర్ జీవించిన పాత్రలో బాలకృష్ణను జనం ఎలా రిసీవ్ చేసుకుంటారా అన్న అనుమానం పటాపంచలైంది. అయితే కొన్ని కొన్ని క్లోజప్ సన్నివేశాల్లో ముఖానికి వేసిన మేకప్ వల్ల కావచ్చు. వయసు మీద పడుతుండడం వల్ల కావచ్చు. కాస్త వృద్ధాప్యపు ఛాయలు కనిపించాయి. కానీ బాపు ‘చిత్రీ’కరణ భంగిమల్లో బాలకృష్ణ కూడా ఒదిగిపోవడం వల్ల ఇటువంటి ఒకటి రెండు మైనస్ పాయింట్లు కవరైపోయాయి. ఇక వాల్మీకిగా ఎఎన్‌ఆర్, లక్ష్మణుడిగా శ్రీకాంత్ ఓకె. లవకుశలుగా నటించిన కుర్రాళ్ల కన్నా బాల హనుమంతుడిగా నటించిన బాలుడికే మంచి మార్కులు పడతాయి.
ముదిమి మీద పడిన వేళ కూడా తన భావుకత, రమణీయత ఏ మాత్రం చెక్కు చెదరలేదని నిరూపించుకున్న బాపు కృషిని చూడాలని వున్నా, రూపాయలకు విలువిచ్చే కాలంలో కోట్లను వెదజల్లి, చిల్లర ఏరుకునేంత రిస్క్‌కు సాహసించిన నిర్మాత ధైర్యాన్ని, అభిరుచిని అభినందించాలని వున్నా ఈ సినిమాను చూడొచ్చు.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment