Monday, November 28, 2011

న్యూస్ చానెళ్ళా .. సస్పెన్స్ థ్రిల్లర్లా?

November 29th, 2011
ఈ మధ్యకాలంలో ప్రపంచంలో దుర్మార్గం పెరిగిపోతోందని మా మేనత్త ఎప్పుడూ అంటూండేది. ప్రపంచంలో దుర్మార్గం ఎప్పుడూ ఉంది, ఇప్పుడు పత్రికలు చదివీ, టీవి చూసీ తెల్సుకోగలుగుతున్నామన్న జవాబు ఆమెకు నచ్చేదికాదు. బీహార్‌లో తన పాలనలో నేరాలు పెరుగుతున్నాయని అందరూ అంటున్నారు కానీ తన పాలనలో నేరస్థులను ఎక్కువగా పట్టుకోవడంవల్ల నేరాల సంఖ్య తెలుస్తోందనీ, అందుకుముందు పాలనలో నేరస్థులను అచ్చుగుద్ది వదిలేసేవారనీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఒకరు ప్రవచించారు. ఆ మాట నిజమేనా? ఆయన పాలనలో నేరాలు పెరిగాయా, ప్రభుత్వ యంత్రాంగం పని తీరు మెరుగయిందా? ప్రపంచంలో దుర్మార్గం ఈమధ్య కాలంలో పెరిగిందా లేక దుర్మార్గాలగురించి ఎక్కువ తెలుస్తోందా?
నేర ప్రవృత్తీ, దుర్మార్గం వంటివి కొలవడం కష్టం. కానీ కొలవగలిగినవి కొన్ని ఉంటాయి. దేశంలో రైలు ప్రమాదాలూ, ప్రమాదాలలో మరణాలూ పూర్వం కన్నా ఇప్పుడు ఎక్కువయ్యాయా అంటే కచ్చితంగా ఎక్కువయ్యాయనే చాలా ఎక్కువమంది చెప్తారు. కానీ 1950లలో ప్రమాదాలు గమనించండి. మద్రాసు -ట్యూటికార్న్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 154మంది 1956లో, ఢిల్లీ పఠాన్‌కోట ప్రమాదంవల్ల 32 మంది 1958లో మరణించారని ఎందరికి ఆనాడైనా తెలుసు? 1964లో ధనుష్కోడి వంతెన మీద రైలు మొత్తం సముద్రం అలలలో ములిగిపోయింది. ఒక్క 1956లోనే మహబూబ్‌నగర్ వద్ద 156మందీ, అరియలూర్ వద్ద 154మందీ ప్రమాదంలో మరణించినందుకు నాటి రైల్వేమంత్రి స్వర్గీయ లాల్‌బహదూర్‌శాస్ర్తీ నైతిక బాధ్యతను వహిస్తూ రాజీనామా చేశారన్న సంగతి మాత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది.
మరి రైలు ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని అందరికీ ఎందుకనిపిస్తుంది. 1950, 1960లలో నేటివలె వార్తలను తొందరగా చేరవేసే ప్రసార సాధానాలులేవు. ఉత్తరాన వారణాసిలోనో, లక్నోలోనో రైలు ప్రమాదం జరిగితే రెండో రోజునో, మూడో రోజునో దక్షిణాది వార్తాపత్రికలో మధ్య పేజీలలో ఎక్కడో చిన్న కాలమ్‌గా వార్త ప్రచురితమయ్యేది. ప్రమాదం గురించీ, మరణాలగురించీ అంతగా మనస్సుకెక్కే అవకాశం లేదు. ఆ రైలులో బంధు మిత్రులు ప్రయాణిస్తే తప్ప ఆ వార్త ఎవరికీ అంతగా తెలుసుకోవలసిన అవసరమూ లేదు.
అప్పట్లో రైలు మార్గాలు చాలామటుకు సింగిల్‌లైన్‌నే ఉండేవి. సిగ్నలింగ్ వ్యవస్థ నేటివలె వృద్ధిచెందలేదు. కొన్ని స్టేషన్లకు కరంటు సౌకర్యం కూడా లేదు. టెక్నాలజీ అంతగా వృద్ధి చెందని రోజుల్లోనే ఆక్సిడెంట్లు ఎక్కువ జరిగేవి. నేడు మ్రాదాల సంఖ్య- రైళ్ళసంఖ్య పెరిగినప్పటికీ బాగా తగ్గింది.
అయితే ప్రస్తుతమే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని ఎందుకనిపిస్తున్నది? ప్రమాదం జరగ్గానే రిలీఫ్ టీం కన్నా ముందుగా న్యూస్ చానెల్స్ టీం అక్కడ వాలిపోతుంది. ప్రమాదం తాలూకు భయానక దృశ్యాలను వీలైనన్ని కోణాలలోతీసి ప్రేక్షకులకు చూపిస్తుంది. కాళ్ళు విరిగినవాళ్ళని ‘‘మీకెలా ఉందని’’ ప్రశ్నిస్తుంది. బాగున్న కొంతమందిముందు మైకుపెట్టి, రైల్వేలు ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నాయో చెప్పిస్తుంది. ప్రజల మనస్సులలో రైల్వేల పని తీరు ఘోరంగా ఉందని ముద్రపడేదాకా చూపిన దృశ్యాలే చూపిస్తూ, చెప్పిన విషయాలే చెప్పిస్తూ తన టిఆర్‌పిలు పెంచుకుంటుంది.
రైల్వేలో ప్రమాదాలు జరగడంలేదనీ, ఎవరూ తప్పులే చెయ్యడంలేదనీ చెప్పడం లేదు. ఒకరాత్రి మనం రైలెక్కి పడుకుని ఉదయం హాయిగా గమ్యం చేరామంటే కొన్ని వందలమంది స్టేషన్‌మాస్టర్లు, డ్రైవర్లు, గార్డులు, సిగ్నలింగ్ స్ట్ఫా, మెయింటనెన్స్ వర్కర్లు సక్రమంగా పనిచేసి ఉంటారు. ప్రమాదానికి కారణమేమిటి, జరగకుండా ఉండడానికి జాగ్రత్తలేమిటి, ప్రమాదం జరిగాక చేపడుతున్న కార్యక్రమాలేమిటి వంటివి వార్తలకిందకి వస్తాయి. బీభత్సరసాన్ని మాత్రం పోషించడం ఏ విధంగా వార్త అవుతుంది? పాశ్చాత్య దేశాలలో శవాన్ని కూడా లాంగ్ షాట్‌లో తెల్లగుడ్డ కప్పి చూపుతారు. ఆ మంచిని మనం నేర్చుకోలేమా?
ఎక్కడ జరిగిన ప్రమాదాలైనా విజువల్ మీడియా పద్ధతి మారదు. అమెరికాలో దురదృష్టవశాత్తూ భారతీయులు ప్రమాదంలో మరణిస్తే అది ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఆ ప్రమాదం కొన్ని కుటుంబాలవారికి విషాదకరం. తెలిసిన ఎవరికైనా బాధాకరం. కానీ అందులో ప్రేక్షకులందరికీ అప్పటికప్పుడు తెలుసుకునే న్యూస్ వాల్యూ ఏముంది? అసలు తెలుసుకోవలసిన అవసరం ఏది? అమెరికాలో ట్విన్‌టవర్స్‌ని పేల్చివేయడం అందరూ తెలుసుకోవలసిన సంగతి. ట్విన్ టవర్స్‌ని కూల్చడం ప్రపంచంలో అన్ని దేశాల చారిత్రక, ఆర్థిక పరిస్థితులను మార్చివేసింది. అమెరికాకు వీసా నిబంధనలూ, ఎయిర్‌పోర్టులలో తనిఖీలూ కఠినమయ్యాయి. ఒక సంఘటన ప్రజల జీవితంలో మార్పు తెస్తే అది వార్త. టివి చానెళ్ళలో అమెరికాలో మనవాళ్ళకి రోడ్డు ప్రమాదాలు చూపించే తీరు ఎలా ఉంటుందంటే మన దేశమే మెరుగనిపిస్తుంది. కానీ ప్రమాదాలలో భారతదేశమే మొదటిస్థానంలో ఉంది.
నేరాలని చూపే పద్ధతి నేరాలను ప్రోత్సహించడానికేనన్న విమర్శ విన్పిస్తూనే ఉంది. నేరం చెయ్యని వాళ్ళని శిక్షించగలగడమూ మీడియాకి వెన్నతోపెట్టిన విద్య. వ్యభిచారంవృత్తిగా కల ఒకమ్మాయిని పట్టుకున్న పోలీసులు ఆమె నిరపరాధి అని విడిచిపెట్టారు. టివి చానెళ్ళు విడిచిపెట్టలేదు. సంఘంలో తలెత్తుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ప్రేక్షకుల్లో బేసిక్ ఇన్‌స్టింక్ట్‌ని రెచ్చగొట్టి వారి సంఖ్య పెంచుకోవడమే వార్తా చానెళ్ళ లక్ష్యమైతే ఇక ఐటెమ్‌సాంగ్ (పూర్వం జ్యోతిలక్ష్మి డాన్స్) పెట్టి సినిమా ఆడించాలనుకునే నిర్మాతలకూ, వీరికి తేడా ఏముంది? ఒక విధంగా నిర్మాతలే నయం. వారు వినోదం ఇస్తున్నామంటున్నారు కానీ విజ్ఞానం పంచుతున్నామనడం లేదు. వారికి హిపోక్రసీలేదు.
ఈ మధ్య సిబిఐవారు ఒక సీనియర్ ఐఎఎస్ అధికారిణిని విచారణకు పిలిచారు. ఆమె నిందితురాలే కానీ నేటివరకూ నేరస్థురాలుకాదు. ఆమె కారులోనుంచి దిగడం, మెట్లెక్కి లోపలకు వెళ్ళడం దృశ్యాన్ని పదేపదే చూపించారు. చూస్తూంటే మీడియా ఆమెను అరగంటసేపు చిత్రీకరించిట్లనిపిస్తుంది. ఒక సీనియర్ అధికారిణిని ఆ విధంగా చూస్తే సామాన్య ప్రజలలో ‘ఆహా బాగా అయింది ఈవిడకి’ అన్న భావం కలుగుతుందనుకుని చూపించారా? ఆమెను అడిగిన ప్రశ్నలూ, ఆమె చెప్పిన జవాబులూ వార్తలవుతాయి కానీ ఆమె పరిగెడుతున్నట్లుగా లోపలకు వెళ్ళే దృశ్యం కాదే (వాస్తవానికి ఆమె పరిగెత్తనూ లేదు).
వార్త అన్నది ప్రేక్షకులలో విజ్ఞానాన్ని పెంచాలి. వారి నిత్య జీవితంలో మార్పులు చేసుకుందుకు ఉపయోగపడాలి. తప్పుడు సంకేతాలను ఎప్పటికీ ఇవ్వకూడదు. వాస్తవానికి పురుషుల్లో ఆత్మహత్యలు స్ర్తిలలో ఆత్మహత్యలకన్నా మూడు రెట్లెక్కువ. ఈ విషయానికి గణాంకా
లున్నాయి. కానీ ఎక్కడైనా ఒక అమ్మాయి భర్త ఆరళ్ళకో, అత్తవారి వరకట్న హింసలకో ఆత్మహత్య చేసుకుంటే ఉరితాడు వేలాడేసిన కొక్కెం దగ్గరనుంచి ఆమె పాదాలదాకా చూపించి రాద్ధాంతం చేసి మగవారందరూ మృగాలన్న అభిప్రాయాన్ని చానెళ్లు కల్గిస్తాయి. కారణమేమిటి? స్ర్తిల కష్టాలను చూపిస్తే కన్నీటితో కరిగిపోయి టివికి అతుక్కుపోయే వారున్నారు కనుక. మగవాడి ఆత్మహత్య మనసుకి ఎక్కదుకనుక.
రాష్ట్రంలో ముఖ్య నాయకుడు ఒకాయన ప్రమాదంలో చిక్కుకుని జాడ తెలియనప్పుడు ‘‘ప్రజలంతా ఆయన ఏమయ్యారోనని భయపడుతున్నారు. రాష్టమ్రంతా ఉత్కంఠగా ఉంది. ఏమైందో తెలిసేలోగా షార్ట్ బ్రేక్’’ అని వార్తలు చదువుతూంటే జరుగుతున్న సంఘటన చూస్తున్నామా లేక చివరకేమవుతుందో ఊహించలేని సస్పెన్స్ థ్రిల్లర్ నవల చదువుతున్నామా అని అన్పించడం సహజం కాదా.
ఈ పరిస్థితినుంచి బయటపడ్డానికి ఏం చెయ్యాలి? వార్తలు విజ్ఞానాన్ని అందించాలి, భీభత్సరస ప్రధానమైన వినోదం కాదు అన్నది చానెళ్లు అనుసరించడానికి ఏం చెయ్యాలి? స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గం అని ముక్తకంఠంతో చెప్తున్నారు. కానీ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దూరదర్శన్ మాత్రమే ఉన్నప్పుడు ప్రోగ్రాంలు నిరుత్సాహకరంగా ఉండేవేమో కానీ విజ్ఞాన దూరంగా ఉండేవికావు. ఒకవేళ ఆ దిశలో వెడుతుంటే పైనుంచి కంట్రోల్ ఉండేది. వృద్ధవనితను చూపి ‘‘ఈమె వయస్సు అరవై ఏళ్ళా ఇరవై ఏళ్ళా’ అనే క్విజ్ ప్రోగ్రాంని (మషూర్ మహల్) దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జోక్యం చేసుకుని ఆపించారు. శ్రీకృష్ణదేవరాయలను బఫూన్‌గా చూపించిన ‘తెనాలి రామకృష్ణ’ సీరియల్‌ని సమాచార ప్రసార శాఖ మంత్రి దివంగత ఉపేంద్ర స్వయంగా పూనుకుని నిలిపివేశారు. కొంతైనా ప్రైవేటు చానెళ్ళపై ప్రభుత్వ నియంత్రణ ఉంటే వార్తలు కల్పిత పుస్తకాలలా ఉండవేమో.

No comments:

Post a Comment