Monday, November 28, 2011

డబ్బింగ్ చిత్రాల దడ

November 24th, 2011
ఇదంతా ఎందుకు వచ్చింది? ఈసారి దీపావళికి భారీ బడ్జెట్‌లో తీసిన హిందీ డబ్బింగ్ ‘రావణ్’, తమిళ డబ్బింగ్ ‘సెవెంత్ సెన్స్’ విడుదల చూసి దడుసుకున్న తెలుగు నిర్మాతలు ఎవరూ తమ సినిమాలను విడుదల చేసుకోడానికి ముందుకు రాలేకపోయారు. ఎందుకంటే తాము తీసిన సినిమాల క్వాలిటీ వారికి తెలుసు కాబట్టి. సినిమాలో దమ్ముంటే అది పోటీని తట్టుకుని ఎలాగైనా నడుస్తుంది. చిరంజీవి సినిమాతో పాటు విడుదలయిన ‘ఆనంద్’ అనే చిన్న చిత్రం పోటీని తట్టుకుని ఘనవిజయం సాధించలే దా? డబ్బింగ్ సినిమాల ధాటికి భయపడి దీపావళి తర్వాత రిలీజైన సినిమాలు ఘోరంగా దెబ్బతినడంతో, చతికిలబడ్డ డబ్బింగ్ చిత్రాలు మళ్ళీ పుంజుకోగలిగాయి. తమిళ చిత్రాలకు, తమిళ హీరోలకు ఉన్న డిమాండ్‌నుబట్టి ‘సెవెంత్ సెన్స్’ సినిమా దాదాపుగా నాలుగు వందల థియేటర్లలో రిలీజ్ అయింది. దీపావళికి విడుదల చేసుకోవడానికి ముందుకు రాని నిర్మాతలకు, సంక్రాంతికి ఇంకో పిడుగు పడనున్నది. వచ్చే సంక్రాంతికి శంకర్ తీసిన ‘త్రీ ఇడియట్స్’ తమిళ డబ్బింగ్ రానున్నది. శంకర్‌కున్న క్రేజ్‌ను బట్టి చూస్తే ఇది కూడా నాలుగు వందల థియేటర్లలో విడుదల కావచ్చు. తెలుగునాట సంక్రాంతి సెంటిమెంట్ పుంది. పెద్ద హీరోల చిత్రాలు పోటాపోటీగా విడుదలై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. శంకర్ దెబ్బకు తమ సినిమాలను వాయిదా వేసుకోవడమైనా జరగాలి. లేకపోతే విడుదల చేద్దామంటే థియేటర్లు దొరకకపోవచ్చు. ఈ ఇబ్బందినుండి బయటపడాలంటే శంకర్ సినిమాను ఆపాలి. అది ఆపలేరు కాబట్టి డబ్బింగ్ చిత్రాలమీద నిషేధాస్త్రం ప్రయోగించాలి లేదా వాటిమీద టాక్స్‌విపరీతంగా పెంచేస్తే సరి.
తెలుగులో పెద్ద హీరోలనబడే వారి చిత్రాలు బోల్తాపడుతున్నాయి. ఇంకోవైపు తమిళంలో వచ్చిన చిన్నా చితకా చిత్రాలు కూడా ఇక్కడ డబ్బు చేసుకుంటున్నాయి. ఎక్కడుంది కిటుకు? నాణ్యతలో మనవాళ్ళు హీరోయిజం పేరిట తయారుచేసే మూస సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఇంకెంత కాలం చూస్తారు. అందుకనే వారు వైవిధ్యభరితంగా వున్న చిత్రాల వైపు దృష్టి సారిస్తున్నారు. మన నేటివిటికీ అనుగుణంగా వుండి, డిఫరెంట్‌గా వుండడంవల్ల తమిళ చిత్రాలు మనవాళ్ళను ఆకర్షిస్తున్నాయి. ‘మృగం’ అనే స్మాల్ బడ్జెట్‌లో వచ్చిన డబ్బింగ్ చిత్రానికి వచ్చిన కలెక్షన్లు విస్మయానికి గురిచేశాయి. ఇక ‘రంగం’ సినిమా ఒరిజినల్ కంటే డబ్బింగ్ చిత్రమే ఎక్కువగా డబ్బులు వసూలుచేయడం పరిశీలకులనే దిగ్భ్రమ కలిగించింది.
డబ్బింగ్ సినిమాలు విరివిగా రావడానికి కారణం కూడా మనవాళ్ళే. మూడు ఫైట్లు, ఆరుపాటలతో, నెగెటివ్ పాత్రలతో మన హీరోలు ఒక మూసలో ఇరుక్కుపోయారు. వైవిధ్యభరితమైన పాత్రలు ఎన్నుకోవడం ఉండదు. ఇక కుర్ర హీరోల సినిమా ఒకటి హిట్టయితే చాలు, వాళ్ళకు సర్వజ్ఞత అలవడుతుంది. ఇకవాళ్లు వేలుపెట్టని శాఖేలేదు. ఇక చిత్రీకరణ అంతా నాసిరకమే. ద్వంద్వార్థాల పాటలు, శబ్ద కాలుష్యానికి దోహదపడే పాటలు, విదేశీ షూటింగ్‌లతో అవగాహన, అనుభవం లేని కుర్రకారంతా సాంకేతిక నిపుణులుగా తయారయి సినిమాను భ్రష్టుపట్టిస్తున్నారు. ఇంగ్లీషు కాసెట్లు ముందేసుకుని కథను వండేయడమే. ఎంత రిచ్‌గా తీశామని మురిసిపోతున్నారే తప్ప కథా కథనాల గురించి పట్టించుకోవడంలేదు. సినిమాకు ఆయువుపట్టు అయిన కథను విస్మరించి, ఎన్ని హంగులతో సినిమాను నింపితే ఏం లాభం? అది వట్టి శవాలంకరణలా నిష్ప్రయోజనమైపోతుంది. పలుపు దొరికిందని బర్రెను కొన్నట్లు, హీరో కాల్షీటు దొరికిందనగానే కథను పట్టించుకోకుండా, రెడీమెడ్ మిక్స్‌తో సినిమా తీస్తే ఎవరు చూస్తారు? ఎన్నాళ్ళు చూస్తారు? ప్రేక్షకుల అజ్ఞానమే శ్రీరామరక్ష అనుకునే సినిమా వాళ్ళకు ప్రేక్షకులు తెలివిమీరడం, ప్రత్యామ్నాయాలు వెతకడం చూసి తట్టుకోలేకపోతున్నారు.
ఇంకోవైపు హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణులంతా కలిసి నిర్మాణవ్యయం విపరీతంగా పెంచేశారు. ‘మగధీర’ నిర్మాణం సినిమా రంగం పతనానికి దారితీసింది. వారు సెట్టింగులు, గ్రాఫిక్స్‌తో భారీ ఎత్తున నలభై కోట్లతో సినిమా తీయడంతో పోటీ ప్రారంభమైంది. ఇక మిగతా హీరోలంతా తమ సినిమాలు కూడా భారీగా తీయాలని తాపత్రయపడడంతో నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. ‘బృందావనం’ లాంటి సాంఘిక చిత్రానికి 35 కోట్లు ఖర్చు పెట్టారంటే ఎందుకు? అవసరమా? అని ప్రశ్నించుకునే నాథుడు లేకపోయాడు. యువ హీరోలు, యువ దర్శకులు కలిసి వ్యయాన్ని పెంచేసి నిర్మాతలను దివాలా తీయిస్తున్నారు. ‘మగధీర’ నలభై కోట్లకు అరవై కోట్లు సంపాదించింది. చిన్న చిత్రమైన ‘అలా మొదలయింది’ మూడు కోట్లకు పది కోట్లు సంపాదించింది. ఎవరికి ఎంత లాభించిందో మనకు ఇక్కడే తెలిసిపోతుంది. ఇప్పుడు కొత్తగా ‘దూకుడు’ సినిమా నూరు కోట్లు వసూలుచేస్తుందని ప్రకటనలిస్తున్నారు. నిజంగా తెలుగు సినిమాకు అంత స్టామినా ఉందా? ఎవర్ని వంచించడానికి ఈ ప్రకటనలు? ఈ ప్రకటనల ఆధారంగానే ప్రభుత్వం వారు ఇన్‌కంటాక్స్ వసూలుచేస్తే బాగుంటుంది. ఇలాంటి ప్రకటనలు అనవసర పోటీని పెంచి నిర్మాణ వ్యయం పెరగడానికే దోహదం చేస్తాయి.
ఇలా పోటీలు పడి అంతా నిర్మాణ వ్యయం పెంచేస్తుంటే చిన్న నిర్మాతలు ఏం చేయాలి? వాళ్ళు డైరెక్టుగా సినిమాలు తీసి చేతులు కాల్చుకునే రిస్కు తీసుకోకుండా డబ్బింగ్ చిత్రాలకు ఎగబడుతున్నారు. మనవాళ్ళ ఆత్రుత చూసి తమిళ చిత్ర నిర్మాతలు డబ్బింగ్ రేట్లను విపరీతంగా పెంచేస్తున్నారు. ఫేలయిన తమిళచిత్రాలు, చిన్నా చితకా హీరోల సినిమాలను కూడా మంచి రేటుకు మనవాళ్ళకు అంటగడుతున్నారు. వైవిధ్యమైన కథా కథనాలకు, పాత్రలకు ప్రాముఖ్యతనిచ్చే తమిళహీరోలు, దర్శకులవల్ల ఎన్నో మంచి చిత్రాలు వస్తున్నాయి. ఆ చిత్రీకరణలోని కొత్తదనానికి మన ప్రేక్షకులు ఎప్పుడో దాసోహమైపోయాం.
ఈ రోజు సూర్య, విశాల్ లాంటి తమిళ నటులకు కూడా మన దగ్గర మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. పైగా ఆ తమిళనటులు ఆంధ్ర దేశానికి తమ సినిమా ప్రమోషన్లకోసం వస్తుంటే, మరి మన హీరోలు ఏం చేస్తున్నట్లు? వాళ్ళు తమ మార్కెట్లను విస్తరించుకుంటూ పోతూ వుంటే, మనవాళ్ళు బావిలో కప్పల్లా ఉండిపోతున్నారు. మన సినిమాలను కూడా ఇతర భాషలలోకి డబ్ చేసి డబ్బు సంపాదించుకోవచ్చు అనుకుంటే అంత సీనున్న సినిమాలు లేవు. ఒక్క అల్లుఅర్జున్ మాత్రమే మళయాళంలో పాగా వేయగలిగాడు. ‘గమనం’లా ద్విభాషా చిత్రాలు తీస్తూ ఇతర భాషా ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయాలి. అలా మనం పరిచయం అయితే, అక్కడ మన డబ్బింగ్‌లకు గిరాకీ ఏర్పడుతుంది.
తమిళ కుర్రహీరోల డబ్బింగుల ముందు, తెలుగు హీరోల ఆకర్షణ, హంగులు పనికిరాకుండా పోతున్నాయి. ఒక హీరోకు ఇంకో హీరో సినిమా పోటీరాకుండా డబ్బింగ్ సినిమాలే ప్రధానంగా పోటీగా నిలబడడం ఊహించలేని విషయం. ఈ పోటీని తట్టుకోవాలంటే వైవిధ్యభరితంగా చిత్రాలను తీయాలనే గుణం నేర్చుకోవాల్సింది పోయి, సదరు తమిళ డబ్బింగ్ చిత్రాలను లేకుండా చూడాలనే ప్రయత్నం దేనికి? దీనికి వాళ్ళు చూపే సాకుఏమిటంటే, తెలుగు సినిమాకు థియేటర్లు దొరక్కుండా పోతున్నాయి, ఒక పెద్ద హీరో సినిమా నాలుగువందల థియేటర్లలో రిలీజవుతుంటే, చిన్న సినిమా వాళ్ళకే థియేటర్లు దొరకకుండా పోతున్న దశలో, డబ్బింగ్ సినిమాలను పట్టించుకునే నాథుడెవరు? ‘‘రోబో, సెవెంత్‌సెన్స్, గాంబ్లర్’ మాత్రమే ఎక్కువ థియేటర్లలో రిలీజయ్యాయి. అన్ని డబ్బింగ్ చిత్రాలను అంత భారీ ఎత్తున విడుదల చేసే అవకాశాలు లేవు. ఒకప్పుడు కనీసం మార్నింగ్ షోలలో చిన్న సినిమాలు విడుదల చేసుకోవడానికి అవకాశముండేది. కాని ఇప్పుడు ప్రతి సినిమా రిలీజయినప్పటినుండి చివరి రోజు వరకు నాలుగు ఆటలు ఆడాల్సిందే. ఈ పద్ధతి తీసేయాలి. శుక్ర, శని, ఆది నాలుగు ఆటలు మిగతా రోజులు మూడు ఆటలకే కుదించాలి.
మన పొరుగున ఉన్న కర్ణాటకలో డబ్బింగ్ చిత్రాలను నిషేధించారు. అక్కడి సంగతి వేరు. బెంగుళూరు కాస్మో పాలిటన్ సిటీ. అక్కడ తమిళం, మళయాళం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు నేరుగా విడుదలవుతాయి. కన్నడ సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి. ఇక డబ్బింగ్‌ల హడావుడి వేరు. అందుకని కన్నడ చిత్రరంగం నిలదొక్కుకోవాలంటే ప్రతి థియేటర్లో కొన్ని వారాలు విధిగా కన్నడ చిత్రాలను ప్రదర్శించాలి. డబ్బింగులు కాకుండా ఆయా చిత్రాలను నేరుగా విడుదల చేసుకోవచ్చని ప్రతిపాదించాలి. హాలీవుడ్ డబ్బింగులు హిందీచిత్ర పరిశ్రమను దెబ్బతీస్తున్నాయని వాటిని నిషేధించమని మహేష్ భట్ లాంటి ప్రముఖులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. నిషేధం సరియైనది కాదు.
వాటిమీద టాక్సులు పెంచేస్తే సరి. ఆంధ్రప్రదేశ్‌లో అనువాద చిత్రాలపై నిర్మాతల మండలి కొత్తగా ఆంక్షలు విధించాలని ప్రయత్నించడం సమంజసం కాదని, ఆ చిత్రాలపై భారీగా పన్ను విధించాలని చెబుతుండటం భావ్యం కాదని చెన్నైలోని అనువాద చిత్రాల నిర్మాతలు, సాంకేతిక నిపుణుల సంఘం పేర్కొన్నది. అనువాద చిత్ర నిర్మాతల సాధకబాధకాలను, అనువాద చిత్ర నిర్మాణంలో ఎదుర్కొనే కష్టనష్టాల గురించి ఏమాత్రం అడిగి తెలుసుకోకుండా, కనీసం తమకు తెలియజేయకుండా థియేటర్ల విషయంలోగానీ, పన్ను పెంపుదల వంటి ఇతర విషయాలను గురించి ప్రతిపాదన చేయటం సమంజసంకాదని తెలపాలి. చెన్నై అనువాద చిత్ర నిర్మాతల తరఫున, ఆంధ్రప్రదేశ్‌లో అనువాద చిత్రాలకు సంబంధించి యాభై ప్రింట్లతో ప్రదర్శింపబడితే వాటిపై ఇరవై శాతం పన్ను విధిస్తే సరిపోతుందనీ, యాభై ప్రింట్లకన్నా అధిక సంఖ్యలో అనువాద చిత్రాలను ప్రదర్శిస్తే వాటికి యాభై శాతం పన్ను విధిస్తే తప్పులేదని తమ ప్రతిపాదనను తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి పరిశీలనకై పంపారు. అన్నిరకాల డబ్బింగ్ సినిమాలకు ఇప్పుడు వున్న టాక్సు విధానమే కొనసాగాలని విజయవాడ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతిపాదించడం ఇంకో మలుపు. ఈవిషయమై ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ పెద్దలు, అనువాద చిత్ర నిర్మాతల మండలి, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడే డబ్బింగ్ చిత్రాలపై వచ్చిన గందరగోళం పోతుంది.

No comments:

Post a Comment